ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకోబోతున్నాయా..? రాష్ట్ర స్పీకర్ గా ఉన్న తమ్మినేని సీతారాంను ఆ పదవి నుంచి తొలగించబోతున్నారా..? తమ్మినేని సీతారాం, సీఎం జగన్ ని కోరిన కోరిక ఏంటి..? ఆయన కోరిన కోరికను సీఎం జగన్ తీర్చబోతున్నారా..? ఇప్పుడు ఇవే ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఒకసారి వీటిని క్షుణ్ణంగా పరిశీలిస్తే..

 

ఏపీ నుంచి రాజ్యసభకు ఇద్దరు మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్ - మోపిదేవి వెంకటరమణ తరలిపోవడంతో ఆ రెండు సీట్లు ఖాళీ అయ్యాయి. దీంతో జగన్ కేబినెట్ లో మార్పులు చేర్పులు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఈ పదవులు ఎవరికి దక్కనున్నాయి అనేది మాత్రం ఉత్కంఠంగా మారింది. సీనియర్లు, జూనియర్లు అందరూ ఆ పదవుల కోసం తెగ ప్రయత్నిస్తున్నారు. ఎవరి వ్యూహాలు వారు అమలు చేస్తూ.. అధినేత జగన్ ని కలుస్తూ.. తమ మీద దయ చూపమని కోరుకుంటున్నారు ఎమ్మెల్యేలు. అయితే ఈ క్రమంలో అనూహ్యంగా స్పీకర్ తమ్మినేని సీతారాం పేరు తెరపైకి వచ్చింది.

 

2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో  శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నుంచి వైసీపీ తరుపున పోటీ చేసి శాసనసభ సభ్యునిగా గెలుపొంది, సీఎం జగన్ సర్కార్ లో స్పీకర్ గా కొనసాగుతున్నారు. అయితే తాజాగా ఆయన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో తనకు అవకాశం కలిపించాలని కోరారట. అయితే ఇటీవల.. ప్రభుత్వ వ్యవహారాల్లో న్యాయ వ్యవస్థ జోక్యం ఎక్కువైందన్న అభిప్రాయాన్ని తమ్మినేని వ్యక్తం చేశారు. అలాగే చంద్రబాబుతో మొదలుపెడితే…జిల్లా స్థాయి నాయకుల వరకు అందరిపై ఘాటు వ్యాఖ్యలు చేయడం. ఇలా నిత్యం ఏదోకటి చేసి వార్తల్లో నిలిస్తున్నారు తమ్మినేని.

 

కాగా, సీఎం జగన్ కూడా ఇవన్నీ పరిశీలించి, ప్రతిపక్షం మీద ఒంటికాలు మీద లేచే తమ్మినేని లాంటి వారు మంత్రి వర్గంలో ఉంటేనే కరెక్ట్ అని భావించి.. ఆయన్ని మంత్రి వర్గంలోకి తీసుకునేందుకు మొగ్గు చూపిస్తునట్టు సమాచారం. సాధారణంగా రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో ఉండేవారు రాజకీయల గురించి మాట్లాడరు.. కానీ, తమ్మినేని మాత్రం మంత్రి పదవి మీద ఆశతోనే ఇలా మాట్లాడుతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: