తెలంగాణలో సచివాలయ భవనం కూల్చివేత వ్యవహారంపై అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. కానీ, దీని ప్రభావం మాత్రం ఆంధ్రప్రదేశ్ పై పడుతుంది. దానికి గల కారణాలు కాంగ్రెస్ నేత ఉత్తమకుమార్ రెడ్డి, ప్రస్తుత మంత్రి హరీష్ రావు పద ప్రయోగాలు. అసలు ఈ గోడవకి కారణం ఏంటి..? అనే విషయానికొస్తే..

 

విభజన చట్టంలోని సెక్షన్–8 లెక్కప్రకారం ఉమ్మడి రాజధాని ప్రాంతంలో శాంతిభద్రతలు, అంతర్గతభద్రత, కీలకప్రాంతాలు, సంస్థాపనల భద్రత, ప్రభుత్వభవనాల కేటాయింపు, ప్రభుత్వభవనాల నిర్వహణల ప్రత్యేక బాధ్యతలను గవర్నర్ నిర్వహిస్తారు. అయితే తాజాగా హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సెక్రటేరియట్ కూల్చివేత పనులు మొదలుపెట్టిన ప్రభుత్వం ఇందుకు గవర్నర్ అనుమతి తీసుకుందా అనేది కాంగ్రెస్ ప్రశ్న. రాజకీయంగా తీవ్ర దుమారం రేపిన సచివాలయ భవనాల కూల్చివేతపై ముందుగా స్పందించిన ఉత్తమ్… 2012-13 కాలంలో పూర్తైన భవనాలను కూల్చివేయడం దారుణమని.. కేసీఆర్ వాస్తు పిచ్చికి ఇది పరాకాష్ట అని అంటూ.. ఈమేరకు గవర్నర్ విభజన చట్టం ప్రకారం సెక్షన్-8 అమలు చేయాలని డిమాండ్ చేశారు.

 

అయితే.. దీనికి టీఆర్ఎస్ నేతలు కూడా గట్టి సమాధానమే ఇస్తున్నారు. ఏపీ ప్రభుత్వమే భవనాలను తెలంగాణకు అప్పజెప్పిన తర్వాత ఇక సెక్షన్-8 ప్రస్తావన అనవసరం అంటున్నారు. మంత్రి హరీశ్ రావు అయితే ఒకింత అడుగు ముందుకేసి మరీ.. హైదరాబాద్ ఇంకా ఆంధ్ర వారి పెత్తనంలో ఉండాలా.. కాంగ్రెస్ నాయకులు అదే కోరుకుంటున్నారా అంటూ ప్రశ్నించారు. ఇంకా హైదరాబాద్ పై ఆంధ్రోళ్ల పెత్తనం ఏంటి అని కూడా వ్యాఖ్యానించారు. ఏపీ ముఖ్యమంత్రుల దగ్గర పని చేసిన ఉత్తమ్ కు ఇంకా ఆ భావాలు పోలేదని..

 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే స్వచ్ఛందంగా, అధికారికంగా సెక్రటేరియల్, ప్రభుత్వ భవనాలను అప్పగించిన అనంతరం అసలు సెక్షన్-8 కు ఆస్కారమే లేదని మంత్రి హరీశ్ రావు తేల్చిచెప్పేశారు. అయితే ఇక్కడే అసలు వివాదం మొదలైంది. రాష్ట్రం విడిపోయి ఇన్నేళ్ళు అవుతున్నా.. ఇప్పటికీ ఆ పదాలు వాడటం అవసరమా అని ఆంధ్రులు హరీష్ ను అంటుంటే.. ఆ అవసరం తెచ్చింది ఉత్తమే అని తెలంగాణ వాదులు అంటున్నారు. కానీ, ఏదిఏమైనా గవర్నర్ తనకున్న విశేష అధికారాలు ఉపయోగిస్తే టీఆర్ఎస్ ప్రభుత్వానికి చిక్కులు తప్పవని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: