ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలన మార్పులు చోటుచేసుకోబోతున్నాయా..? కేంద్రం కన్ను ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంపై పడిందా..? ఇందుకు అనుగుణంగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ఆపరేషన్ మొదలైందా..? త్వరలోనే వైసీపీ, టీడీపీలకి గట్టి షాక్ తగలబోతుందా..? అంటే అవుననే తెలుస్తుంది.

 

రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని దక్షినాది రాష్ట్రాల్లో పాగా వేయడానికి బీజేపీ తన ప్రయత్నాలు మొదలుపెట్టింది. తెలంగాణా సహా ఆంధ్రప్రదేశ్ లో తమ ఉనికిని చాటుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంది. అయితే తెలంగాణలో కిందటి సంవత్సరం జరిగిన ఎన్నికలలో బీజేపీ నుంచి ముగ్గురు ఎంపీలు గెలవడంతో.. ఇక్కడ పార్టీ బలంగానే ఉందని భావిస్తున్నారు కేంద్ర పెద్దలు. దీంతో తెలంగాణలో పార్టీని మరింత పటిష్టం చేసేందుకు అధ్యక్షుడిని మార్చేసింది బీజేపీ అధినాయకత్వం. ఇప్పుడు బీజేపీ కన్ను ఆంధ్రప్రదేశ్ పై పడినట్టు తెలుస్తుంది. ఏపీలో అధికారం లేకపోయినా, ఏ మాత్రం కూడా బలం లేకపోయినా కేవలం ముగ్గురు ఎమ్మెల్సీలు మాత్రమే ఉన్నా సరే వైసీపీని పదే పదే టార్గెట్ చేస్తూ వస్తుంది బీజేపీ.

 

అయితే ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం హోదాలోకి రావడానికి ఆ పార్టీ ప్రయత్నం చేస్తుంది అని కీలక వర్గాల సమాచారం. ఇందుకోసం బీజేపీ అగ్ర నేత రామ్ మాధవ్ తో పాటుగా మరి కొందరు నేతలను  రంగంలోకి దించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. రంగంలోకి దిగిన ఈ కీలక నేతలు వైసీపీ, టీడీపీ ఎమ్మెల్యేలతో టచ్ లోకి వెళ్తున్నారట. ఇప్పటికే కొంత పని పూర్తి అయిందని.. రెండు పార్టీల నుంచి దాదాపు 28 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని తెలుస్తుంది. ఇందులో ముఖ్యంగా.. కేసుల భయంతో ఉన్న టీడీపీ నేతలు, అసంతృప్తితో ఉన్న వైసీపీ నేతలు ఉన్నట్టు సమాచారం. అలాగే ప్రకాశం జిల్లా నుంచి రెండు పార్టీలకు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు, రాయలసీమ జిల్లాల నుంచి మొత్తం రెండు పార్టీలకు చెందిన పది మంది వెళ్ళే అవకాశం ఉంది అనే వార్తలు వస్తున్నాయి.

 

ఇలా పార్టీ మారాలి అనుకున్న ఎమ్మెల్యేలకు, హోటల్ పార్క్ హయత్ లో సుజనా చౌదరి కలిసిన ఎమ్మెల్యేలకు ఎమన్నా సంబంధం ఉందా అని రాజకీయ వర్గాలు ఆరా తీస్తున్నాయి. అయితే ఈ వ్యవహారం గురించి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి ముందుగానే లీక్ ఉన్నట్టు సమాచారం. ఇది గమనించే విజయ సాయి త్వరలోనే కొందరు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ బీజేపీలో చేరడం దాదాపుగా ఖాయంగా కనపడుతుంది. అంటూ టీడీపీ నేతలని ఉద్దేశించి సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. అయితే ఇక్కడ కొసమెరుపు ఏంటంటే.. వైసీపీ ఎమ్మెల్యేలు కూడా బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారన్న సంగతి విజయసాయి కి తెలుసా..? లేదా..? అనేది. పైగా 28 మంది ఎమ్మెల్యేలతో పాటు ఇరు పార్టీలకి చెందిన ఇద్దరు ఎంపీలు కూడా ఈ లిస్టులో ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద బీజేపీ మొదలుపెట్టిన ఈ ఆపరేషన్ తో వైసీపీ, టీడీపీలకి ఒకేసారి గట్టి దెబ్బ తగలబోతుందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: