ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైసీపీలో ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలైంది. దీంతో ఆ పార్టీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. వాస్తవానికి ఈ పరిస్థితి ఏ రాష్ట్రంలోనైనా ప్రతిపక్ష పార్టీకి రావాలి. కానీ, ఏపీలో మాత్రం విచిత్రంగా అధికార పార్టీకి వచ్చింది. దీనికి అసలు కారణం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ. అసలు కథ ఏంటంటే..

 

ట్విట్టర్ వేదికగా రాజకీయ ప్రత్యర్థుల్ని మరీ ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను వ్యక్తిగతంగా విచిత్రమైన పేర్లతో హేళన చేస్తూ పోస్టులు పెట్టే విజయసాయి రెడ్డికి బీజేపీ జాతీయ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ ధియోదర్ కళ్లు తిరిగే పోస్టు పెట్టారు. “ఏడాది కాలంగా తినడానికి ఏమీ దొరక్క నక నక లాడుతున్న టీడీపీ మిడతల దండు కమలం పువ్వు వైపు కదులుతోంది. ఇప్పటికే కొన్ని మిడతలు బీజేపీలో చేరి విధ్వంసం సృష్టిస్తున్న విషయం గ్రహించే లోగానే మిగతావి ఎగురుకుంటూ బయల్దేరాయి. ఈ విపత్తు నుంచి బీజేపీ ఎలా బయటపడుతుందో చూడాలి..” ఇటీవల వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ ఇది.

విజయసాయి రెడ్డి ఈ ట్వీట్ చేయగానే టీడీపీ నుంచి బీజేపీలోకి ఎవరు వెళ్లారు, ఇంకా వెళ్లే ఆలోచనలో ఎవరు ఉన్నారు అని చాలా మంది అయోమయంలో పడ్డారు. ఇక దీనికి బీజేపీ కూడా అదే విధంగా స్పందించింది. పసుపు రంగునే కాదు… ఏ రంగుని అయినా కాషాయం మారుస్తుంది, ముందు రఘురామ కృష్ణంరాజు గారిని మీ పార్టీ రంగు మార్చక ముందే జాగ్రత్త పడండి అంటూ బీజేపీ ఏపీ వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ దియోధర్ ఒక ఘాటు కౌంటర్ ఇచ్చారు. విజయసాయి రెడ్డి గారి ట్వీట్ ఏమో గాని సునీల్ ధియోదర్ చేసిన ట్వీట్ మాత్రం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.

దీంతో వైసీపీ రంగుని కూడా బీజేపీ మారుస్తుందా అంటూ చర్చలు మొదలయ్యాయి. బీజేపీ లాంటి పార్టీ ఇలాంటి వ్యాఖ్యలు చేసిందంటే.. వాటిని ఆశామాషీగా తీసుకోలేం. వైసీపీ విషయంలో బీజేపీ ఏదో పెద్ద ప్లాన్ తోనే ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, సునీల్ దియోధర్ చేసిన ఈ ట్వీట్ తో వైసీపీ నేతల్లో ఒక్కసారిగా కలవరం మొదలైందని రాజకీయ వర్గాల్లో చర్చ. సాధారణంగా కేంద్ర బీజేపీ ఏం మాట్లాడినా దానికి సమాధానం చెప్పే అలవాటు లేని వైసీపీ నేతలు దీనికి సమాధానం చెప్తారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: