భార‌త స‌రిహ‌ద్దులోకి చొచ్చుకు వ‌చ్చిన చైనా మూక‌లు వారం రోజులుగా కొద్ది కొద్దిగా వెన‌క్కి మ‌ళ్లాయి. గురువారం ఉద‌యం పూర్తిగా మ‌న బార్డ‌ర్ దాటేయ‌డం గ‌మ‌నార్హం. స‌రిహ‌ద్దు దాటాకే శాంతి చర్చ‌లుంటాయ‌ని భార‌త్ స్ప‌ష్టం చేయ‌డం, అంత‌ర్జాతీయంగా ఒత్తిడి, భార‌త బ‌లగాల‌ను చేధించ‌డం అంత ఈజీ కాద‌న్న విష‌యం చైనా సైన్యానికి అర్థ‌మైంది. స‌రిగ్గా ఐదురోజుల క్రితం భారత-చైనా దేశ దళాలు ఉన్నత స్థాయి చర్చలు జరపడం కొంత ఫ‌లితాల‌నిచ్చాయి. ఉభయ దేశాల సైనిక దళాల మధ్య ఉద్రిక్థతలు రేగిన నేపథ్యంలో ఈ చర్చలు మ‌ధ్య మార్గాన్ని సూచించాయి.

 


 లడఖ్ లోని ఛుషుల్-మొల్డోలో గల ఇండియన్ బోర్డర్ పాయింట్ వద్ద ఈ చర్చలు జరగ‌గా,  భారత దళాల తరఫున లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్, చైనా తరఫున టిబెట్ మిలిటరీ డిస్ట్రిక్ట్ కమాండర్ ఈ సంప్రదింపుల్లో పాల్గొన్నారు. లడఖ్ తూర్పు ప్రాంతంలో.. యధాతథ స్థితిని కొనసాగించాలని, వాస్తవాధీన రేఖ వద్ద చేపడుతున్న భారీ నిర్మాణాలను నిలిపివేయాలని భారత్.. చైనాను కోరుతోంది. తాజాగా శుక్ర‌వారం జ‌ర‌గబోయే ఉన్న‌తాధికారుల స‌మక్షంలో ఈ అంశాలే ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు రానున్నాయి. శాంతియుతంగా ప‌రిష్క‌రించుకుంటే మంచిద‌నే భావ‌న‌ను భార‌త్ చైనా ముందు ఉంచ‌నుంది. ఇదిలా ఉండ‌గా చైనా సైన్యం వెన‌క్కి వెళ్ల‌డం వెన‌క మోదీ చాణక్యం బాగా ప‌నిచేసింద‌ని అంత‌ర్జాతీయ మీడియాలో క‌థ‌నాలు వెలువ‌డటం గ‌మ‌నార్హం.

 


సరిహద్దు ప్రాంతాల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన మన సైనిక దళాలలో నైతిక స్థైర్యాన్ని  పెంపొందించడంతో పాటు, భారత్- – చైనాల మధ్య మిలటరీ స్థాయి చర్చలకు ఒక సాధికారతను కల్పించింది. మన్ కీ బాత్ ప్రసంగంలో చేసిన వ్యాఖ్యలు, 59 యాప్‌ల నిషేధం, ఇత‌ర వ్యాపారాల‌పై కొత్త‌గా ఆంక్ష‌ల విధింపు వంటి చ‌ర్య‌లు చైనాపై ఒత్తిడి పెంచాయ‌నే చెప్పాలి. ల‌ద్దాఖ్‌లో ప్ర‌ధాన‌మంత్రి మోదీ పర్యటన పరిస్థితి తీవ్రతను స్పష్టం చేయడమే కాక, తదుపరి చర్చలు సానుకూలంగా జరిగేందుకు దోహదం చేసింది. లద్దాఖ్‌లో సైనికులను ఉద్దేశించి ప్రధానమంత్రి చేసిన ప్రసంగంతో అంతకు ముందు వరకూ ఆయనపై వచ్చిన విమర్శలన్నీ పూర్వపక్షమయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: