చీమ‌లు పెట్టిన పుట్ట‌లు.. పాముల‌కు ఆవాసంగా మార‌తాయ‌ని.. ఎప్పుడో త‌న త‌త్వాల్లో బోధించారు వేమ‌న‌. అందుకే ఆయ‌న యోగి అయ్యారు. ఇప్పుడు అచ్చు.. ఇలా రాజకీయాలే చేస్తానంటోంది బీజేపీ! అది కూడా అక్క‌డెక్క‌డో కాదు.. ఏపీలోనే!! తాజాగా ఆ పార్టీ నేత‌ల మ‌నోభావాలు ఇదే ప‌రిస్థితిని తెర‌మీదికి తెస్తున్నా యి. రాష్ట్రంలో బీజేపీ ఎద‌గాల‌నేది ఆ పార్టీ కేంద్ర నేత‌ల మ‌నోభావ‌న‌. ఉమ్మడి రాష్ట్రంలో కొంత మేర‌కు బీజేపీ పుంజుకుంది. ఎమ్మెల్యేలుగా కూడా ప్ర‌జ‌ల్లోంచి గెలిచారు. అయితే, రాష్ట్ర విభ‌జ‌నతో మ‌రింత పుం జుకుంటామ‌ని భావించిన బీజేపీ పెద్ద‌లు.. రాష్ట్ర విభ‌జ‌న‌కు త‌మ పూర్తి స‌హ‌కారం అందించారు. 


ఆ త‌ర్వాత ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో బీజేపీ.. టీడీపీ, జ‌న‌సేన‌ల‌తో పొత్తు పెట్టుకుంది. ఈ క్ర‌మంలోనే నాలు గు స్థానాల్లో విజ‌యం సాధించింది. ఇది 2014 మాట. ఇక‌, 2019 ఎన్నిక‌ల‌కు వ‌చ్చే స‌రికి.. ప‌రిస్థితి రివ‌ర్స్ అయింది. చంద్ర‌బాబుతో వైరంతో సొంత‌గా పోటీ చేసింది. 1.7% ఓట్ల‌తో క‌నీసం ఒక్క స్థానాన్ని కూడా నిల ‌బెట్టుకోలేక పోయింది. అయిన‌ప్ప‌టికీ.. వ‌చ్చే 2024లో జ‌రిగే ఎన్నిక‌లపై భారీగానే ఆశ‌లు పెట్టుకుంది. ఎట్టి ప‌రిస్థితిలోనూ అధికారంలోకి వ‌చ్చి తీరుతామ‌ని రాష్ట్ర క‌మ‌ల నాథులు చెబుతున్నారు. అయితే, వాస్త‌వానికి ఆ ప‌రిస్థితి ఉందా?  ఓటు బ్యాంకు లేకుండా.. ప్ర‌జ‌ల్లో పార్టీకి ఆద‌ర‌ణ లేకుండా అధికారంలోకి రావ‌డం సాధ్య‌మేనా? అనేవి మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌లు. 


ఇక్క‌డే అస‌లు గుట్టు చెబుతున్నారు బీజేపీ నేతలు. త‌మ‌కంటూ.. ఓటు బ్యాంకు లేని మాట వాస్త‌వ‌మేన‌ని అంగీక‌రిస్తూనే.. అధికారంలోకి రావ‌డం మాత్రం ఖాయ‌మ‌ని అంటున్నారు.దీనికి వారు చెబుతున్న ఫార్ము లా.. వివిధ పార్టీల నుంచి నాయ‌కులు త‌మ గూటికి చేరుతున్నార‌ని, నాయ‌కుల బ‌లం జ‌న‌బ‌లం కాదా? అని ప్ర‌శ్నిస్తున్నారు. ఇప్ప‌టికే టీడీపీ నుంచి న‌లుగురు రాజ్య‌స‌భ స‌భ్యులు క‌మ‌ల గూటికి చేరుకున్నార‌ని అంటున్నారు. అదేస‌మ‌యంలో వైసీపీ నుంచి కూడా ఒక ఎంపీ రేపో మాపో.. త‌మ పార్టీకి జై కొట్ట‌డం ఖాయ మ‌ని అంటున్నారు. వీరుండ‌గా.. మాకేల భ‌యం అంటూ.. బీజేపీ నేత‌లు ఆశ‌లు భారీగానే పెట్టుకున్నారు. 


కానీ, వాస్త‌వ ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. క్షేత్ర‌స్థాయిలో నాయ‌కుల బ‌లం ఉండాలా?  లేక పార్టీల బ‌లం ఉండాలా ? అంటే.. ఒక్కొక్క చోట ఒక్కో విధంగా ఉంది ప‌రిస్థితి. కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కుల బ‌లం ఎక్కువ‌గా ఉంటే.. చాలా చోట్ల పార్టీల బ‌లం ఉంది. గ‌త ఏడాది ఎన్నిక‌ల‌ను ప‌రిశీలిస్తే.. ఇదే మ‌న‌కు నిజ‌మ‌ని తేలు తుంది. రాష్ట్ర వ్యాప్తంగా జ‌గ‌న్ సునామీ ఉన్న‌ప్ప‌టికీ.. 23 నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ గెలుపు గుర్రం ఎక్కింది. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలిచిన నాయ‌కుల‌ను ప‌రిశీలిస్తే.. పార్టీ క‌న్నా వ్య‌క్తిగ‌త ఇమేజ్‌కు ప్ర‌భావం ఉంది. అయితే, మెజారిటీ స్థానాల్లో మాత్రం వైసీపీ గుండుగుత్తుగా గెలుపు గుర్రం ఎక్కింది. దీనిని బ‌ట్టి.. బీజేపీ వ్యూహాలు నిజ‌మ‌వుతాయా?  అనే సందేహం వ్య‌క్త‌మ‌వుతోంది. అయితే, ఒక పార్టీ ద‌న్నుతో.. తాను గెలుపు గుర్రం ఎక్కాల‌ని భావిస్తూ.. భ‌విష్య‌త్ రాజ‌కీయాల‌పై ప‌ట్టు సాధించ‌లేక పోతే..రేపు ప్ర‌భుత్వం(బీజేపీ నేత‌లు చెబుతున్న‌ట్టు) అధికారంలోకి వ‌చ్చి కూడా ఏం సాధించిన‌ట్టు?! మ‌రి క‌మ‌లం పార్టీ నేత‌లు ఆలోచించుకోవాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: