ఎవరు ఎన్ని రకాలుగా విమర్శించినా భయపడే రకం కాదు. ఎవరు ఎంతగా కవ్వించినా కంగారు పడే రకం కాదు. ప్రళయం ముంచుకొస్తున్నా పారిపోయే రకం కాదు. దేనికి అదరకుండా, బెదరకుండా, తాను ఏం చేయాలనుకున్నారో అది చేసి చూపించే రకం. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అనే మొండి మనిషి. అన్నిటికీ మించి మంచి వ్యూహకర్తగా, తెలివైన నాయకుడిగా, తనను తాను నిరూపించుకున్న టిఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యవహార శైలి గురించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కెసిఆర్ ఏది చేసినా అది సంథింగ్ స్పెషల్ అన్నట్టుగా ఉంటుంది. టిఆర్ఎస్ పార్టీ స్థాపించిన తరువాత ప్రత్యేక తెలంగాణ కోసం ఆ పార్టీ ఎన్నిరకాల ఇబ్బందులు ఎదుర్కొంది.. ఎంతమంది అపహాస్యం చేశారో తెలియంది కాదు. అన్ని అవమానాలు, అన్ని బాధలు, వేధింపులు అన్నిటినీ తట్టుకుని ఆయన అనుకున్న కార్యం సాధించారు. ప్రత్యేక తెలంగాణను సాధించడమే కాకుండా, రెండుసార్లు పార్టీని అధికారంలోకి తీసుకు రావడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు.

IHG'Jai Telangana' - news

మొదటిసారి అధికారంలోక వచ్చినప్పుడు ఆయన పరిపాలన జనరంజకంగానే సాగింది. వేల కోట్లతో అభివృద్ధి పనులు, సాగునీటి ప్రాజెక్టుల రూపకల్పన, తెలంగాణ వ్యాప్తంగా ప్రజలకు గోదావరి జలాలు అందించడం, రైతుల సంక్షేమం కోసం అనేక కొత్త పథకాలు ప్రవేశ పెట్టడం ఇలా ఎన్నో చేశారు. అప్పట్లో కేసీఆర్ పాలనపై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురిపించారు. ప్రతి ఒక్కరూ కేసీఆర్ ను ఆదర్శంగా తీసుకుని పరిపాలన చేయాలనే సూచనలు అందాయి. ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతలు టిఆర్ఎస్ ప్రభుత్వానికి రావడంతో, అదే అదనుగా ఆయన ముందస్తు ఎన్నికలకు వెళ్లి రెండోసారి కూడా విజయం సాధించారు. అంతా బాగానే ఉన్నా, కెసిఆర్ రెండో విడత అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదం అవుతూనే వస్తున్నాయి.

IHG

ముఖ్యంగా సచివాలయానికి వచ్చేందుకు కేసీఆర్ పెద్దగా ఆసక్తి చూపించకపోవడం, తాను ఎక్కడ ఉంటే అక్కడే సచివాలయం అన్నట్టుగా వ్యవహరించడం, ఎక్కువగా ఫామ్ హౌస్ లోనే గడుపుతుండటం, వంటి చర్యలతో కొద్దికాలంగా ఆయన వివాదాస్పదం అవుతూ వస్తున్నారు. ఇదిలా ఉంటే, దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో తెలంగాణలో ఆ ప్రభావం కనిపించగానే కేసీఆర్ చాలా చురుగ్గా వ్యవహరించారు. ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి వైరస్ విజృంభించకుండా, అనేక చర్యలు తీసుకున్నారు. కేంద్ర నిబంధనలకు అదనంగా మరిన్ని నిబంధనలు అమలు చేశారు. నిత్యం మీడియా సమావేశాలు నిర్వహించి ప్రజలకు కరోనా జాగ్రత్తలు చెబుతూ, భరోసా కల్పించే ప్రయత్నం చేసేవారు. ఇంత వరకు బాగానే ఉన్నా, లాక్ డౌన్ నిబంధనలు ఎత్తివేసిన తర్వాత పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. తెలంగాణలో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వైరస్ వ్యాప్తి తీవ్రతరం అవుతున్న తీరు ప్రతి ఒక్కరిని ఆందోళనకు గురి చేస్తోంది.

IHG

ఈ సమయంలో ప్రజలకు ధైర్యం చెబుతూ, వైద్యపరంగా మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ, వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తూ, ఈ వ్యాధి ప్రభావానికి గురైన వారికి ప్రత్యేకంగా చికిత్స అందిస్తూ మరింత మందికి ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా చేయడం వంటి విషయాలను పూర్తిగా కేసీఆర్ పక్కనపెట్టేశారు. కరోనా వైరస్ వ్యవహారంపై పెద్దగా పట్టించుకోనట్టుగా వ్యవహరిస్తుండడంపై ఆయనపై విమర్శలు పెరిగిపోతున్నాయి. కరోనా పరీక్షలు ఎక్కువగా నిర్వహించాలని, సాక్షాత్తు హైకోర్టు జోక్యం చేసుకుని చెప్పే వరకు పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నిత్యం వేల కేసులు నమోదవుతున్నాయి. అలాగే మరణాల శాతం కూడా గతం కంటే ఇప్పుడు ఎక్కువైంది. అప్పటి వరకు బాగానే ఉన్న వారు సైతం అకస్మాత్తుగా అస్వస్థతకు గురై మరణిస్తున్నారు. ప్రజలకు ధైర్యం కల్పించేలా, ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సి ఉన్న ఈ కీలక సమయంలో, కేసీఆర్ ప్రజలకు, అధికారులకు అందుబాటులో లేకుండా, పూర్తిగా అజ్ఞాతంలో గడుపుతుండటం మరింతగా ఆయన వ్యవహార శైలి పై విమర్శలు వ్యక్తం అవ్వడానికి కారణమవుతోంది. 

IHG't have corona symptoms but tested +Ve.

అలాగే తెలంగాణలో కరోనా వ్యాధి నిర్ధారణ చేయించుకునేందుకు ప్రజలు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. ప్రైవేటు ఆసుపత్రులలో కరోనా పరీక్షలు చేస్తున్నా, ప్రభుత్వం వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తోందనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ సెంటర్లలో ఈ పరీక్షలు అధిక సంఖ్యలో నిర్వహిస్తున్నారా అంటే హైదరాబాదులో ఉన్న శాంపిల్ సేకరణ కేంద్రాల్లో రోజుకు 250 మాత్రమే చేస్తున్నారని, టోకెన్ల విధానంగా వీటిని నిర్వహిస్తున్నారని, పరీక్షలు చేసిన తర్వాత వాటి రిజల్ట్ వచ్చేందుకు ఎక్కువ సమయం పడుతుండడం, ఒకవేళ పాజిటివ్ అని తేలినా ఇళ్లల్లోనే ఉంటూ మందులు వాడాలి అంటూ సూచనలు వస్తుండడం జరుగుతున్నాయి. కనీసం పాజిటివ్ వచ్చిన వారి వివరాలను ట్రాక్ చేసి చికిత్స అందించేందుకు అవకాశం ఉన్నా, ప్రభుత్వం ఆ విధంగా చేయడం లేదు. ఇక ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందే పరిస్థితి కూడా తెలంగాణ ప్రజలకు లేకుండా పోయింది. కొద్ది రోజుల క్రితం గాంధీ ఆసుపత్రి లో వెయ్యి పడకలు ఖాళీగా ఉన్నాయని తెలంగాణ హెల్త్ సెక్రటరీ ప్రకటించినా, అక్కడ చేర్చుకోవడం లేదంటూ అనేక మంది వెనక్కి వచ్చే పరిస్థితి.

IHG

కరోనా సోకిన వారు హోమ్ ఐసోలేషన్ లోనే ఉండాలంటూ సూచనలు వస్తుండడం, వైరస్ సోకిన వారికి, వారి కుటుంబ సభ్యులకు మానసిక వేదన కలిగిస్తోంది. అందరూ వారిని దూరం పెడుతుండడం, ఇరుకు ఇళ్లల్లో ఉండే వారి పరిస్థితి మరింత దారుణంగా ఉండడం, ఈ వైరస్ కారణంగా మరింత మందికి కరోనా వస్తుందనే భయంతో, చుట్టుపక్కల వారు మరింత దూరంగా ఉండడం, ఇలా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుదామన్నా చేర్చుకునే పరిస్థితి లేదు కేవలం వీఐపీలకు తప్ప. సామాన్యులు ఎవరూ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకునే అవకాశం లేదు అన్నట్టుగా పరిస్థితి ఉంది. కొద్ది రోజుల క్రితం ఓ జర్నలిస్టు మంత్రి హరీష్ కు పంపించిన వీడియో బాగా వైరల్ అయింది. తాను డబ్బులు పెట్టుకుంటానని, అపోలో ఆసుపత్రిలో చేర్చుకునే విధంగా తనకు అవకాశం కల్పించాలంటూ ఆయన కోరడంతో హరీష్ రావు సిఫార్సు తో అతడు ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి వచ్చింది.

IHG

ఇక ఈ స్థాయిలో కరోనా విజృంభిస్తున్న సమయంలో, హడావుడిగా పాత సచివాలయం కూల్చివేసేందుకు ప్రభుత్వం మొగ్గు చూపించడం, కొత్తగా 500 కోట్లు పెట్టి కొత్త భవనాన్ని నిర్మించేందుకు ప్రయత్నించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ఆ భవనాన్ని కూల్చే కంటే, కనీసం కరోనా ఐసోలేషన్ వార్డుగా ఉపయోగించుకుని ఉంటే బాగుండేదనే సూచనలు వస్తున్నాయి. ఇప్పుడు ఇంత అకస్మాత్తుగా ఈ కూల్చివేతలు అవసరమా అనే ప్రశ్నలు పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత సమయంలో కూల్చివేతలు చేపట్టినా, ప్రతిపక్షాలు ఉద్యమించే పరిస్థితి లేకపోవడంతో, తమకు అనుకూలంగా ఉంటుందని ప్రభుత్వం ఈ చర్యలకు దిగిందనే విమర్శలు లేకపోలేదు.

IHG

వేర్ ఈజ్ కెసిఆర్ అనే నినాదం పెరిగిపోవడంతో, మంత్రులు ఎదురుదాడికి దిగుతున్నారు. కెసిఆర్ ఎక్కడ ఉంటే ఏంటి ?  అభివృద్ధి పనులు ఆగలేదు కదా అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు. అటువంటప్పుడు ప్రజలు ఓట్లు వేసి గెలిపించటం ఎందుకు ?  నాయకులు ఉన్నా, లేకపోయినా ప్రజల జనజీవనం ఏమీ ఆగిపోదు కదా ? మీ మీద నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు మీరు చెప్పే సమాధానం ఇదేనా ? అంటూ ఎదురు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అసలు ఇన్ని విమర్శలు ఎదుర్కొనే కంటే ..అసలు ఎందుకు అజ్ఞాతంలో గడపాల్సి వస్తుంది ?  ఎక్కడ ఉన్నారు ? ఏం చేస్తున్నారు ? అనేది జనాలకు, అధికారులకు ఎందుకు దూరంగా ఉంటున్నారు ? అనే విషయాలను కెసిఆర్ బయటపెడితే, ప్రస్తుత పరిస్థితిని ఆయన ఇబ్బందులను అర్థం చేసుకునే స్థితిలోనే జనాలు ఉన్నారు. కానీ ఆ విషయాన్ని కేసీఆర్ పక్కన పెట్టి మొండిగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: