ప్రపంచాన్ని వణికించేస్తున్న కరోనా వైరస్ దెబ్బకు అగ్రరాజ్యమైన అమెరికా అల్లాడిపోతోంది.  ఒకదశలో వైరస్ దెబ్బనుండి అమెరికా కోలుకుంటోంది అనే అనిపించింది. కానీ హఠాత్తుగా అగ్రరాజ్యంలో కేసులు మళ్ళీ పెరిగిపోతున్నాయి. ఒక్క రోజులోనే అమెరికా మొత్తం మీద 61 వేల పాజిటివ్ కేసులు రిజస్టర్ అవ్వటంతో యావత్ ప్రపంచాన్ని వణికించేస్తోంది. అమెరికాలో కేసులు పెరుగుతున్నాయంటే మరి ప్రపంచానికే కదా సమస్య. ఎందుకంటే ప్రపంచంలోని ఎక్కెడెక్కడి దేశాల నుండి జనాలందరూ వివిధ కారణాలతో అమెరికాలోనే వాలిపోతుంటారు. చదువుకునే వాళ్ళు, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళతో పాటు వివిధ వృత్తుల్లో ఉన్న వాళ్ళంతా అమెరికా వైపే చూస్తుంటారు. అమెరికాలో ఉన్న విదేశీయుల్లో కూడా ఎక్కువగా చైనా, ఇండియా, గల్ఫ్ దేశాల వాళ్ళే ఎక్కువుంటారన్న విషయం అందరికీ తెలిసిందే.

 

ఇటువంటి అమెరికాలో ఒక్కరోజులో ఏకంగా 61 వేలమందికి కరోనా వైరస్ సోకిందంటే మామూలు విషయం కాదు. తాజా కేసులతో అగ్రరాజ్యంలో మొత్తం కేసుల సంఖ్య 33 లక్షలదిశగా దూసుకుపోతోంది. అదే సమయంలో చనిపోయిన వారిసంఖ్య కూడా 1.4 లక్షలకు చేరుకుంటోంది.  ఒకపుడు న్యూయార్క్, కాలిఫోర్నియా, న్యూజెర్సీ, లాస్ ఏంజెలీస్, టెక్సాస్, కొలంబియా, వాషింగ్టన్ తదితర రాష్ట్రాల్లో చాలా ఎక్కువగా ఉంది. మొదట్లో అంటే వైరస్ బయటపడిన రోజుల్లో అమెరికా టెస్టింగులు జరక్కపోవటం, జాగ్రత్తలు తీసుకోకపోవటం, స్వయాన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపే నిర్లక్ష్యంగా ఉండటం వల్ల జనాల్లో కూడా ఓ విధమైన నిర్లక్ష్యం కనిపించింది. దాంతో  కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది.

 

పెరిగిపోతున్న కేసుల దెబ్బకు అప్పట్లో అమెరికాలో ఆసుపత్రులు సరిపోలేదు. వైద్య సౌకర్యాలు లేవు. ఎటువంటి వైద్యం అందించాలో  డాక్టర్లకు కూడా  అర్ధంకాలేదు. దానికితోడు వైద్య పరికరాలు అంటే మాస్కులు, వెంటిలేటర్లు, బెడ్లు లాంటి సౌకర్యాలు కూడా సరిపడా లేకపోవటంతో కేసుల సంఖ్య ఒక్కసారిగా లక్షల్లో  పెరిగిపోయింది. కానీ తర్వాత తర్వాత పరిస్ధితిని ప్రభుత్వం కాస్త అదుపులోకి తీసుకువచ్చిందనే చెప్పాలి.  వైద్య సౌకర్యాలు, పరికరాల కెపాసిటిని పెంచుకోవటంతో రోగులకు వైద్యం చేయించటంలో ఆసుపత్రులు చొరవ చూపించాయి. దాంతో పరిస్ధితి అదుపులోకి వస్తున్నట్లే అందరికీ అనిపించింది.

 

ఇటువంటి పరిస్ధితుల్లో మళ్ళీ అగ్రరాజ్యంలో ఒక్కసారిగా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వేలాది కేసులు ఎందుకు పెరిగిపోతున్నాయో ఎవరికీ అర్ధం కావటం లేదు. బహుశా సోషల్ డిస్టెన్సింగ్ పాటించకపోవటం కూడా ఓ కారణంగా అనుమానిస్తున్నారు వైద్య నిపుణులు. కారణాలు ఏవైనా ఒక్కరోజులో 61 వేల కేసులు నమోదవ్వటంతో యావత్ ప్రపంచం ఉలిక్కిపడింది.  అమెరికా తర్వాత అత్యధిక కేసులు నమోదైన దేశంగా బ్రెజిల్ రికార్డులకు ఎక్కింది. గడచిన 24 గంటల్లో బ్రెజిల్ లో 43 వేల కేసులు నమోదయ్యాయి. సరే ఇతర దేశాల్లో నమోదవుతున్న కేసులను పక్కనపెట్టేస్తే మనదేశంలో కూడా తక్కువ నమోదవ్వటం లేదు. ఒక్కరోజులో మనదేశంలో సుమారు 26 వేల కేసులు నమోదవ్వటమంటే చిన్న విషయం కాదు. కేసుల విషయంలో మనం జాగ్రత్త పడకపోతే ఇంతే సంగతులు.

 

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: