క‌రోనా ప్ర‌పంచ గ‌మ‌నాన్నే మార్చింది. అన్ని రంగాల‌కు కొత్త‌దారిని చూపెడుతోంది. అన్నీ ఇంటి నుంచే అన్న‌ది క‌రోనా వైర‌స్ సంక్షోంభం నుంచి నేర్చుకోవాల్సిన ప్రాథ‌మిక సూత్రం. వినోదమైనా...ప‌నైనా..ఆత్మీయ‌త‌లైనా..స‌ర్వం ఆన్‌లైన్ వేదిక‌గానే జ‌ర‌గాల్సిన ప‌రిస్థితి క‌ల్పించింది క‌రోనా. క‌రోనా  అన్ని రంగాల‌పై ప్ర‌భావం చూపిన దానిక‌న్నా సినిమా రంగంపై అత్యంత ఎక్కువ ప్ర‌భావం చూపింద‌నే చెప్పాలి. ఈ ప్ర‌భావం నుంచి సినిమా రంగం కోలుకోవ‌డానికి ఎన్నాళ్లు ప‌డుతుందో కూడా చెప్ప‌లేని ప‌రిస్థితి. అస‌లు కోలుకుంటుందా..? అన్న సందేహం కూడా నెల‌కొంటోంది. థియేట‌ర్లు తెరుచుకోవ‌డానికి మార్గాల‌న్నీ మూసుకుని పోయాయి. మునిప‌టిలా ప్రేక్ష‌కులు సినిమాల‌ను థియేట‌ర్ల‌కు వెళ్లి చూసేంత సాహ‌సం చేస్తారా..? అన్న‌ది కూడా పెద్ద ప్ర‌శ్న‌.


ఈ ప్ర‌శ్న‌ల‌న్నింటికి కూడా కాల‌మే స‌మాధానం చెప్పాలి. కాల‌మే స‌మాధానం చెబుతుంద‌ని ఖాళీగా కూర్చోలేని ప‌రిస్థితి. అందుకే సిని నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు, హీరోలు, డిస్ట్రిబ్యూట‌ర్లు ఇలా సినిమాకు చెందిన‌..సినిమాతో సంబంధం ఉన్న‌వారంద‌రూ కూడా ఇప్పుడు ఓటీటీ వైపు అడుగులు వేస్తున్నారు. ఇప్ప‌టికే అల్లు అర్జున్ మొద‌లెట్టేశారు. త్వ‌ర‌లోనే అక్కినేని కుటుంబం కూడా అడుగుపెడుతోంద‌ని టాక్‌. తాజాగా దిల్ రాజు కూడా ఓటీటీ వైపు వ‌చ్చేస్తున్నార‌ని స్ప‌ష్ట‌మైంది. మొత్తంగా ప్ర‌పంచ చ‌ల‌న చిత్రం రంగంలో వ‌చ్చిన మార్పులు  తెలుగు సినిమా రంగంలోనూ చోటు చేసుకుంది. ఇల్లే థియేట‌ర్‌గా మారిపోవ‌డం గ‌మ‌నార్హం. 


ఇదిలా ఉండ‌గా తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 1800కి పైగా థియేటర్స్‌లో ప్రదర్శన ఆగిపోయింది. ఇందులో పనిచేసే ఉద్యోగులు ఉపాధిని కోల్పోయారు. లీజుదారులు యజమానులకు నెలకు లక్షల్లో అద్దె కట్టాల్సి వుంది. నిర్వహణ భారం భరించాల్సి వస్తోంది. ఇక సినిమాలపై పెట్టిన పెట్టుబడి, తెచ్చిన అప్పులు, వాటి వడ్డీ భారం నిర్మాతలకు గుదిబండగా మారింది. వీటి నుంచి బైటపడడానికి ముందున్న ఆప్షన్‌ ఓటిటి ఫ్లాట్‌ఫామ్‌. కరోనా సెలవుల్ని ఉపయోగించుకుని.. లాభపడాలని ఓటిటి ప్లాట్‌ఫారమ్‌లోని డిజిటల్‌ సంస్థలు భావిస్తున్నాయి. రెగ్యులర్‌ రేటు కంటే ఎక్కువ పెట్టి రైట్స్‌ తీసుకున్నా లాభమేగానీ.. నష్టం లేదట. 

మరింత సమాచారం తెలుసుకోండి: