అమెరికాలో ప్ర‌వాస భార‌తీయులు అగ‌చాట్లు ప‌డుతున్నారు. మంచి ఉద్యోగంతో గొప్ప‌గా బ‌త‌క వ‌చ్చ‌ని భావించి ప‌రాయి దేశం ప‌య‌న‌మై వెళ్లిన వారిని క‌రోనా క‌ష్టాలు వెంటాడుతున్నాయి. క‌రోనా త‌గ్గితే ఎలాగోలా అంతా స‌ర్దుబాటు చేసుకుని బ‌త‌క‌వ‌చ్చ‌ని భావించిన వారికి నిరాశే ఎదుర‌వుతోంది. అగ్ర‌రాజ్యం అమెరికాలో రోజురోజుకు క‌రోనా ఉధృతి పెరుగుతుండ‌టంతో ప్ర‌వాసీయుల్లో ఆందోళ‌న పెరుగుతోంది.  ఉద్యోగాలు గాలిలో దీపాలుగా మారాయి. ఇప్ప‌టికే అనేక మంది ఉద్యోగాలు కోల్పోయారు. రానున్న కాలం కూడా క‌ఠినంగా ఉండ‌నుంద‌ని ట్రంప్ హెచ్చ‌రిక‌ల‌తో క్లారిటీగా అర్థ‌మ‌వుతూనే ఉంది. చిన్న చిత‌కా జాబ్‌ల‌తో కాలం వెళ్ల‌దీసే వారి ప‌రిస్థితి మరీ దారుణంగా త‌యారైంది.

 

ఒక ర‌కంగా చెప్పాలంటే అగ్ర‌రాజ్యంలో ప్ర‌వాస భార‌తీయులు పేద‌రికంతో బ‌త‌కీడుస్తున్నారు. భార‌త్‌లో ఉంటే బ‌లుసాకైనా తిన‌వ‌చ్చు అనే అభిప్రాయంతో ఏకీభ‌వించే వారి సంఖ్య పెరుగుతుండ‌టం గ‌మ‌నార్హం. ఇక ఇక్క‌డ ఉండ‌లేం...ప‌రిస్థితులు ఏమంత బాగోలేవు..వీలైనంత త్వ‌ర‌గా రావ‌డానికే ప్ర‌య‌త్నిస్తాం అంటూ స్వ‌దేశంలోని త‌ల్లిదండ్రుల‌కు, కుటుంబ‌స‌భ్యుల‌కు, మిత్రుల‌కు చెప్పేస్తుండ‌టం గ‌మ‌నార్హం. ఇక్క‌డే ఏదైనా వ్యాపారం, అనుభవం ఉన్న రంగంలో పెట్టుబ‌డులు పెట్ట‌డం, సొంత వ్యాపారం వంటి ఆలోచ‌న‌ల‌తో ప్ర‌వాసీయులు ఉన్న‌ట్లు  తెలుస్తోంది. పరాయి దేశంలో అనేక క‌ష్టాలు ప‌డుతూ  సంపాద‌న కోసం వెంపర్లాడే బ‌దులు స్వ‌దేశంలో అయిన వారి మ‌ధ్య అప్యాయ‌త అనురాగాల నడుమ జీవితం హాయిగా గ‌డ‌ప వ‌చ్చ‌ని భావిస్తున్నారు.


ఇదిలా ఉండ‌గా ప్రస్తుతం అమెరికాలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. మూడు రోజులుగా అమెరికాలో 65 వేలకు పైగా కరోనా కేసులు నమోదు కావ‌డం.. పాత కేసుల రిక‌వ‌రీ త‌క్కువ‌గా ఉండ‌టం గ‌మ‌నార్హం. దీంతో మ‌ర‌ణ శ‌య్య‌పైకి వెళ్తున్న వారి సంఖ్య కూడా గ‌ణ‌నీయంగా పెరుగుతూనే ఉంది.  శుక్ర‌వారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 68 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు 32,91,786 మంది బాధితులు కరోనా బారిన పడ్డారు. ఇందులో 1,36,671 మంది మృతిచెందారు. అదేవిధంగా 14,60,495 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. 16,94,620 మంది బాధితులు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: