ఏపీ రాజ‌కీయాల్లో అనూహ్య‌మైన ఘ‌ట‌న చోటు చేసుకుంది. అప్పుడెప్పుడో రాజ‌కీయాల నుంచి విర‌మించుకున్న ప్ర‌ముఖ న‌టుడు, విల‌న్‌, హాస్య‌న‌టుడు కోట శ్రీనివాస‌రావు ఏపీ రాజ‌కీయాలపై మ‌రీ ముఖ్యంగా సీఎం జ‌గ‌న్‌పై చేసిన ఒకే ఒక్క కామెంట్ ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఇప్ప‌టి వ‌రకు అనేక మంది ప్ర‌తిప‌క్ష నాయ‌కులు, ప్ర‌త్య‌ర్థులు జ‌గ‌న్‌పై అనేక కామెంట్లు చేశారు. అయితే, అవ‌న్నీ ఒక ఎత్త‌యితే.. ఇప్పుడు అనూహ్యంగా కోట వారి నోటి నుంచి పేలిన తూటా ఒక్క‌టీ ఒక ఎత్తుగా మారింది. దీనిపైనే అటు సినీ వ‌ర్గాలు, ఇటు రాజ‌కీయ వ‌ర్గాలు చ‌ర్చిస్తున్నాయి.


కోట శ్రీనివాస‌రావు.. సినీ ఫీల్డ్‌లో సుప్ర‌శిద్ధుల‌నే విష‌యం ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అయితే, ఆయ‌న గ‌తంలో 1999లో బీజేపీ పార్టీ త‌ర‌ఫున విజ‌య‌వాడలో అప్ప‌టి తూర్పు నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి విజ‌యం సాధించారు. అలా ఆయ‌న 2004 వ‌ర‌కు ఎమ్మెల్యేగా కొన‌సాగారు. అయితే, అప్ప‌టి ప‌రిస్థితిలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వంతో క‌లిసి ప‌నిచేశార‌నే వ్యాఖ్య‌లు వినిపించాయి. దీనికితోడు ఆయ‌న ఎమ్మెల్యేగా గెలిచిన త‌ర్వాత నియోజ‌క‌వ‌ర్గంపై దృష్టి పెట్ట‌లేదు. నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌ల‌కు అనేక హామీలు ఇచ్చిన‌ప్ప‌టికీ.. ఆయ‌న ఏ ఒక్క‌టీ సాకారం చేయ‌లేక పోయారు.

ఫ‌లితంగా త‌దుప‌రి ఎన్నిక‌ల్లో ఆయ‌న త‌న త‌మ్ముడు కోట శంక‌ర‌రావుకు టికెట్ ఇప్పించుకుని పోటీ చేయించినా.. ఆయ‌న ఓడిపోయారు. ఇక‌, ఆ త‌ర్వాత త‌న‌కు రాజ‌కీయాల‌కు ప‌డ‌వ‌ని బాహాటంగానే చెబుతూ.. రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్నారు. అయితే, తాజాగా ఆయ‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా ఓ మీడియాతో మాట్లాడిన కోట‌.. రాజ‌కీయాల‌పై స్పందించారు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో ఉన్న కోట‌.. తెలంగాణ రాజ‌కీయాల‌పై స్పందించ‌కుండా.. కేవ‌లం ఏపీ రాజ‌కీయాల‌పై స్పందించారు. ``నిద్ర పోయే వారిని లేపొచ్చు. న‌టించేవారిని ఎవ‌రు లేపుతారు. ఆయ‌న‌కు ఈ విష‌యాలు తెలియ‌వ‌ని ఎలా అనుకుంటాం``-అని సీఎం జ‌గ‌న్‌ను ఉద్దేశించి(పైకి ఎవ‌రిపేరూ చెప్ప‌లేదు) కోట వ్యాఖ్యానించారు.

ఆయ‌న చేసింది ఒకే ఒక్క కామెంటే అయినా.. కిలోకారం కుమ్మేసిన‌ట్టుగా ఉంద‌నే విశ్లేష‌ణ‌లు ఊపందుకున్నాయి. రాష్ట్రంలో ప్ర‌తిప‌క్ష నేత‌ల‌ను అరెస్టు చేస్తుండ‌డంపై ఇలా వ్యాఖ్యానించా రా?  లేక‌.. ప్ర‌జ‌ల్లోకి ప్ర‌భుత్వం తీసుకువెళ్తున్న ప‌థ‌కాల్లోని లోపాల గురించి ఆయ‌న ఎత్తి చూపాల‌నుకున్నారా?  ఇవ‌న్నీ కాకుండా బీజేపీ ఎదిగే ప‌రిస్థితి లేద‌ని, దీనికి జ‌గ‌నే కార‌ణ‌మ‌ని న‌ర్మ‌గ‌ర్భంగా వ్యాఖ్యానించారా? అనే స‌వాల‌క్ష ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌య్యాయి. దీంతో కోట వారి మాట‌ల తూటాకు ప్రాధాన్యం పెరిగిపోయింది. మ‌రి దీన‌ర్ధం ఏమిటో.. ప‌ర‌మార్ధం ఏమిటో ఆయ‌న‌కే తెలియాలి! అంటున్నారు వైసీపీ నాయ‌కులు.

మరింత సమాచారం తెలుసుకోండి: