క‌రోనా ట్రీట్‌మెంట్ కోసం వెళ్లిన రోగుల‌కు ప్రైవేటు ఆస్ప‌త్రులు షాక్‌ల మీద షాక్‌లిస్తున్నాయి. ప్ర‌త్యేక గ‌దుల ఏర్పాటు...చికిత్స విధానం పేరు చెప్పి ఏకంగా ల‌క్ష‌ల్లో బిల్లుల‌ను బంధువుల చేతిలో పెట్టేస్తున్నాయి. అడ్డగోలుగా చార్జీల‌తో ఛార్జీలు వసూలు చేయడానికి వీల్లేదంటూ... టెస్టులకు ఎంత, వెంటిలేటర్లకు ఎంత అనేది పక్కాగా రేట్ల‌ను ప్ర‌భుత్వం ఫిక్స్ చేసినా గాలికి వ‌దిలేశాయి. ఆదేశాల‌ను ఏమాత్రం ఖాత‌ర్ చేయ‌డం లేదు. చాలా ప్రైవేట్ ఆస్పత్రులు, కార్పొరేట్ హాస్పిటల్స్ వసూలు చేస్తున్న ఛార్జీలకూ, ప్రభుత్వం చెప్పిన ఛార్జీలకూ ఎక్కడా పొంతన అన్నదే లేదంటున్నారు బాధితులు.

 

అసలే అత్యంత క‌ఠిన‌మైన ఆర్థిక స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్న ప‌రిస్థితుల్లో ఆస్ప‌త్రులు క‌రోనా వైద్యం పేరుతో పేద‌ల‌ను పిండుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో లాభాపేక్షను పక్కన పెట్టి... సేవే ప‌ర‌మార్థంగా..ధ్యేయంగా వైద్య వృత్తిని నిర్వ‌హించాల్సిన ఆస్ప‌త్రులు లాభాలకు అవ‌కాశంగా భావిస్తుండ‌టం నిజంగా సిగ్గుప‌డాల్సిందే.  ప్రభుత్వ ఆస్పత్రులు ఖాళీ లేకపోవడంతో... చాలా మంది కరోనా బాధితులు... ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తున్నారు. తీరా ఆక్కడకు వెళ్లాక... ఆస్పత్రుల సిబ్బంది చెప్పే రేట్లు చూసి బెంబేలెత్తిపోతున్నారు. ఈ నిలువు దోపిడీకి ప్రభుత్వం చెక్ పెట్టకపోతే క‌రోనా ప‌రీక్ష‌ల‌కు..ట్రీట్‌మెంట్‌కు వెళ్ల‌కుండా ఇళ్ల‌లోనే ఉండిపోయే ప్ర‌మాదం ఉంద‌ని వైద్య ఆరోగ్య నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. ఇది మ‌రింత ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితుల‌ను తెచ్చి పెడుతుంద‌ని పేర్కొంటున్నారు.

 

ఇదిలా ఉండ‌గా కరోనా మహమ్మారి బారినపడి విలవిల్లాడుతున్న బాధితుల నుంచి నిబంధనలకు విరు ద్ధంగా రూ. లక్షల్లో ఫీజులు గుంజుతున్న కార్పొరేట్, ప్రైవేట్‌ ఆస్పత్రులపై తెలంగాణ‌ రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే కొన్ని ల్యాబు రిపోర్ట్‌ల‌పై అనుమానాలు వ్య‌క్త‌మ‌వ‌డంతో ఆంక్ష‌లు విధించిన విష‌యం తెలిసిందే. తాజాగా  కరోనా ఫీజులను నిర్దే శించినా అధిక వసూళ్లకు పాల్పడుతున్న ఆయా ఆస్పత్రులకు ముకుతాడు వేయాలని భావిస్తోంది. కేంద్ర అంటువ్యాధుల నియంత్రణ చట్టానికి అనుగుణంగా మార్చిలో జారీ చేసిన తెలంగాణ అంటువ్యాధుల (కోవిడ్‌–19) నియంత్రణ–2020 నోటిఫికేషన్‌ ప్రకారం చర్యలు తీసుకోవాలని యోచిస్తోంది. సాధ్య‌మైనంత త్వ‌ర‌గా ఈ చ‌ట్టం అమ‌ల్లోకి రావాల‌ని అంద‌రం కోరుకుందాం..!

మరింత సమాచారం తెలుసుకోండి: