ఏపీ నుంచి రాజ్యసభకు ఇద్దరు మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్ - మోపిదేవి వెంకటరమణ తరలిపోవడంతో ఆ రెండు సీట్లు ఖాళీ అయ్యాయి. దీంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేబినెట్ లో మార్పులు చేర్పులు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఈ పదవులు ఎవరికి దక్కనున్నాయి అనేది మాత్రం ఉత్కంఠంగా మారింది. సీనియర్లు, జూనియర్లు అందరూ ఆ పదవుల కోసం తెగ ప్రయత్నిస్తున్నారు. ఎవరి వ్యూహాలు వారు అమలు చేస్తూ.. అధినేత జగన్ ని కలుస్తూ.. తమ మీద దయ చూపమని కోరుకుంటున్నారు ఎమ్మెల్యేలు..

 

అయితే శ్రావణమాసం 21వ తేదీ నుంచి ప్రారంభమవుతోంది. దీంతో 22వ తేదీన కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించే అవకాశం ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటివేళ.. సీఎం జగన్ దీనిపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ఇప్పటికే కొత్తగా మంత్రి వర్గంలోకి రాబోయే నేతల పేర్లు దాదాపు ఖరారు చేసినట్టు సమాచారం. కాకపోతే ఈ సారి మంత్రుల ఎంపికపై సీఎం జగన్ చాలా జాగ్రత్తలు వహించినట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఎంతోమంది సీనియర్ నేతల పేర్లు తెరపైకి వచ్చినప్పటికి.. వారందరిని పక్కన పెట్టి, కొత్త పేర్లు ఫైనల్ చేసినట్టు ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది.

 

ఈ లిస్ట్ లో ప్రముఖంగా వినిపిస్తున్న పేర్లు.. అనంత వెంకటరామిరెడ్డి, జంగా కృష్ణమూర్తి. వీరిద్దరూ సీఎం జగన్ కి ఎంతో నమ్మకస్థులు. ఈ క్రమంలోనే వీరిని ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. పైగా అనంతపురం జిల్లాకి చెందిన అనంత వెంకటరామిరెడ్డి చాలా కాలంగా జగన్ మోహన్ రెడ్డికి విధేయుడు.. అలాగే సీనియర్ రాజకీయనాయకుడు. దీంతో ఆయన సేవలు పార్టీకి ఉపయోగపడతాయని భావించిన సీఎం జగన్.. ఆయనని మంత్రి వర్గంలోకి తీసుకోబోతున్నట్టు సమాచారం. అదేవిధంగా ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి కూడా ఈ సారి మంత్రివర్గంలో స్థానం దాదాపుగా ఖరారైనట్టు తెలుస్తుంది. బలహీన వర్గాల నాయకుడిగా జంగాకి మంచి పేరు ఉన్నది. ఈ కారణంతోనే ఆయనని ఈసారి మంత్రివర్గంలోకి తీసుకోబోతునట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: