రాజస్ధాన్ లో కూడా రాజకీయ సంక్షోభం మొదలైంది. అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయేందుకు ఎన్నో రోజులు పట్టేట్లు లేదు. మధ్యప్రదేశ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయినట్లే తాజాగా రాజస్ధాన్ లో కూడా అవే పరిణామాలు జరుగుతున్నాయి.  దాంతో అశోక్ ప్రభుత్వానికి దినదిన గండం నూరేళ్ళాయస్సులాగ తయారైంది. సరే తిరుగుబాటు నేత సచిన్ పైలెట్ కు అవసరమైన సహాయ సహకారాలను బిజెపి సీనియర్ నేతలు అందిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం అందరికీ తెలిసిందే. మధ్యప్రదేశ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవటానికి బిజెపి ఎలాంటి పాత్ర పోషించిందో రాజస్ధాన్ కూడా ఇలాంటి కార్యక్రమమే తెరవెనుక జరుగుతోందన్న విషయంలో  ఎలాంటి అనుమానం లేదు.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఒకపుడు ప్రత్యర్ధి ప్రభుత్వాలను పగడొట్టేందుకు  కాంగ్రెస్ పార్టీ ఎలాంటి కుట్రలు చేసిందో ఇపుడు బిజెపి కూడా అదే బాటలో వెళుతోంది. అంటే ప్రత్యర్ధి ప్రభుత్వాలను పడగట్టడంలోను, ప్రత్యర్ధులపై దర్యాప్తు సంస్ధలను ప్రయోగించటంలోను కాంగ్రెస్ కు బిజెపికి తేడా ఏమీ లేదని తేలిపోయింది. ప్రత్యర్ధి ప్రభుత్వాలను పడగొట్టడంలో అప్పట్లో కాంగ్రెస్ తెరవెనుక ప్రయత్నాలు చేసేది. ఇపుడు బిజెపి బాహాటంగానే కుట్రలు చేస్తోంది. బిజెపి కుట్రలకు కాంగ్రెస్ లోని చీలిక వర్గాలు కూడా బాహాటంగా మద్దతు ఇస్తుండటంతో ప్రభుత్వాలు కూలిపోతున్నాయి. ఇందుకు మధ్యప్రదేశ్ లో జరిగిన పరిణామాలే నిదర్శనం.

 

సరే తాజా విషయానికి వస్తే గెహ్లాట్ ప్రభుత్వం కూలిపోవటానికి ముహూర్తం దగ్గర పడినట్లే కనిపిస్తోంది. ఎందుకంటే కాంగ్రెస్ కున్న, మద్దతిస్తున్న 107 మంది ఎంఎల్ఏల్లో    31 మంది ముఖ్యమంత్రిపై తిరుగుబాటు చేశారు. దీనికి యువనేత సచిన్ పైలెట్ నేతృత్వం వహిస్తుండటంతో  రాజకీయాలు బాగా రసకందాయంలో పడింది. పైలెట్ నాయకత్వంలోని ఎంఎల్ఏలు ఢిల్లీలో ప్రత్యేక క్యాంపు నిర్వహించటంతో తిరుగుబాటు ఎంఎల్ఏలు కాంగ్రెస్ అధిష్టానానికి అందుబాటులో లేకుండా పోయారు. ఆయుధాల చట్టం క్రింద నమోదైన ఓ కేసులో ప్రభుత్వం ఏకంగా ఉపముఖ్యమంత్రిగా ఉన్న సచిన్ పైలెట్ కే స్పెషల్ ఆపరేషన్స్ గ్రూపు (ఎస్ఓజి) నోటీసులిచ్చింది. హోంమంత్రిత్వ శాఖ గెహ్లాట్ చేతిలో ఉంది. మొదటినుండి గెహ్లాట్-పైలెట్ కు పడటం లేదు. ఇంకేముంది ? అగ్గి రాజుకుంది.

 

ఈమధ్యనే కాంగ్రెస్ కు రాజీనామా చేసి బిజెపిలో చేరిన  మధ్యప్రదేశ యువనేత జ్యోతిరాధిత్య సింథియా వెంటనే సచిన్ పైలెట్ తో టచ్ లోకి వెళ్ళారు. వీళ్ళద్దరు చాలాసేపు భేటి అయ్యారు. దాంతో పైలెట్ నిర్ణయాలవెనుక సింథియా ప్రోద్బలముందన్న ప్రచారం పెరిగిపోయింది. బిజెపితో కలవటం కన్నా సొంతంగా పార్టీ పెట్టేందుకే పైలెట్ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఎందుకంటే ఇప్పటికప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయినా బిజెపి అధికారంలోకి వచ్చే అవకాశాలు తక్కువే. వచ్చినా ఎంతకాలం ప్రభుత్వంలో ఉంటుందో చెప్పలేరు. ఎందుకంటే 200 అసెంబ్లీలున్న రాజస్ధాన్ లో బిజెపి బలం 72 మంది మాత్రమే. ఎవరైనా అధికారంలోకి రావాలంటే 101 ఎంఎల్ఏల మద్దతు అవసరం.

 

ఒకవేళ పైలెట్ మద్దతిచ్చినా కమలంపార్టీకి వచ్చేది  102 మంది ఎంఎల్ఏలే. అంటే అవసరమైన బలంకన్నా చేతిలో ఉండేది కేవలం ఒక్క ఎంఎల్ఏ మాత్రమే. కమలం అధికారంలో కంటిన్యు అవ్వటమన్నది పూర్తిగా పైలెట్ దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడుటుంది. అలాగని పైలెట్ ను సిఎంగా చేయటానికి కమలం సీనియర్ నేతలు అంగీకరించలేదట. దాంతో సనిన్ కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ప్రచారం పెరిగిపోతోంది. మొత్తానికి చేతులారా కాంగ్రెస్ పార్టీ  తన ప్రభుత్వాన్ని కూల్చేసుకుంటోందనే అనుకోవాలి. చూద్దాం ఏం జరుగుతుందో.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: