రాజ‌స్థాన్ కాంగ్రెస్ పార్టీలో ఎగిసిన‌ రాజ‌కీయ తుఫాన్‌...ముఖ్యమంత్రి గెహ్ల‌ట్ అధికార పీఠానికి ఎస‌రు తెస్తోంది. కాంగ్రెస్ పార్టీలోని సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త‌గా ఉంటున్న గెహ్ల‌ట్‌కు...ఆయ‌న క‌న్నా త‌క్కువ రాజ‌కీయ అనుభ‌వమున్న స‌చిన్ పైల‌ట్‌కు మ‌ధ్య రాజ‌కీయ విబేధాలు చాలా కాలంగా కొన‌సాగుతూనే ఉన్నాయి. రాజ‌స్థాన్‌లో పార్టీ ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం సాధించ‌డానికి ఇద్ద‌రు నేత‌లు కృషి చేశారు. ఇందులో ఇద్ద‌రికీ అధిష్ఠానం వ‌ద్ద మంచి పేరు..బ‌లం ఉండ‌టం గ‌మ‌నార్హం. ఒక‌ర‌కంగా చెప్పాలంటే ముఖ్య‌మంత్రి ప‌ద‌వి విష‌యమే వీరిద్ద‌రి న‌డుమ రాజ‌కీయ వైరుధ్యానికి దారితీసింది. అప్ప‌టి నుంచే ఇద్ద‌రు రాజ‌కీయ వ‌ర్గాలు విడిపోయి పార్టీలో అస‌మ్మ‌తిని రాజేసేలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 

 


సోనియా అండ‌దండ‌ల‌తో గెహ్ల‌ట్‌కు ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ద‌క్క‌గా...రాహుల్‌కు అత్యంత స‌న్నిహితుడిగా..యువ నాయ‌కుడిగా ఉన్న స‌చిన్ పైల‌ట్‌కు నిరాశ ఎదురైంది. రాహుల్ హామీల‌తో, బుజ్జ‌గింపుల‌తో స‌చిన్ పైల‌ట్ వెన‌క్కి త‌గ్గ‌డంతో ఆయ‌న‌కు డిప్యూటీ సీఎం క‌ట్ట‌బెట్టారు. ప‌ద‌వుల పంప‌కం జ‌రిగినా ఇద్ద‌రి నేత‌ల మ‌ధ్య వైరుధ్యం, బేధాభిప్రాయాలు స‌మ‌సిపోలేదు. వ‌ర్గ రాజ‌కీయాల‌ను పెంచి పోషిస్తూనే ఉన్నారు. పార్టీలో ఎమ్మెల్యేలు, నాయ‌కులు గెహ్ల‌ట్‌, స‌చిన్ వ‌ర్గాలుగా విడిపోయి ప‌నిచేస్తుండ‌టం గ‌మ‌నార్హం. స‌హ‌జంగానే ప‌ద‌వులు ద‌క్క‌ని వారంతా కూడా స‌చిన్ వ‌ర్గంలోకి వ‌చ్చేశారు. అలాగే మంత్రివ‌ర్గంలో ఉన్న కొంతమంది స‌చిన్ వ‌ర్గ ప్ర‌జాప్ర‌తినిధులు ప్ర‌భుత్వ విధానాలానే త‌ప్పుబ‌ట్ట‌డం, ముఖ్య‌మంత్రి ఆదేశాలు అమ‌లు కాకుండా చూడ‌టం వంటివి చేయ‌డం మొద‌లుపెట్టారు.

 

 గెహ్ల‌ట్ కూడా స‌చిన్‌ను ఇబ్బందుల‌కు గురిచేసేందుకు య‌త్నించిన సంఘ‌ట‌న‌లు ఉన్నాయ‌ని తెలుస్తోంది. ఇటీవ‌ల ప్ర‌భుత్వాన్ని కూల్చేందుకు స‌చిన్ య‌త్నిస్తున్నాడంటూ కొన్ని ప్రాథ‌మిక ఆధారాల‌తో ప్ర‌భుత్వం కేసులు న‌మోదు చేయ‌డంతో ఈ వివాదం తార‌స్థాయికి చేరుకుంది. ఇక తాడోపేడో తేల్చుకోవాల‌ని నిర్ణ‌యించుకున్న స‌చిన్ పైల‌ట్ త‌న వ‌ర్గ ఎమ్మెల్యేల‌తో ఢిల్లీకి చేరుకోవ‌డం గ‌మ‌నార్హం. రాహుల్‌గాంధీతో ప‌లుమార్లు బేటీ జ‌రిగినా అస‌లు విష‌యం మాత్రం తేలలేద‌ని తెలుస్తోంద‌ని..క‌రోనా కాలంలో వేడిని ర‌గిలిస్తున్న రాజ‌స్థాన్ రాజ‌కీయం ఏ మ‌లుపు తిరుగుతుందోన‌ని ఆ రాష్ట్ర ప్ర‌జ‌లు, రాజ‌కీయ ప‌క్షాలు, జాతీయ పార్టీలు ఉత్కంఠ‌తో ఎదురు చూస్తున్నాయి. ఏం జ‌రుగుతుందో కాల‌మే స‌మాధానం చెబుతుంది..వేయిట్ అండ్ సీ.

మరింత సమాచారం తెలుసుకోండి: