అవును ఒకే ఒక అమ్మాయి దెబ్బకు కేరళ రాజకీయాల్లో మంటలు మండిపోతున్నాయి. ఒకమ్మాయి కోసం దేశంలోని దర్యాప్తు సంస్ధలన్నీ గాలించి చివరకు బెంగుళూరులో వారం తర్వాత పట్టుకున్నారు. రాజకీయాల్లో మంటలు సంగతి పక్కన పెట్టేస్తే ఏకంగా ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ మెడకే చుట్టుకునేట్లుంది మొత్తం వ్యవహారం. నిజంగా ఆ అమ్మాయి వ్యవహారాలతో పినరయ్ ప్రభుత్వానికి సంబంధం ఉందో లేదో తెలీదు కానీ  ప్రభుత్వం మాత్రం వివాదంలో నుండి బయటపడటానికి నానా అవస్తలు పడుతోంది. బంగారం స్మగ్లింగ్ వివాదం బయటపడటంతో ప్రభుత్వం సమాధానం చెప్పుకోలేకపోతోంది. ఏవో కుంభకోణలతోనో, అవినీతి ఆరోపణలతోనో మంత్రులు, ముఖ్యమంత్రి కార్యాలయం వివాదాల్లో ఇరుక్కోవటం ఎక్కడైనా జరిగేదే అన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఓ అమ్మాయి కారణంగా మొత్తం ప్రభుత్వం ఇబ్బందుల్లో పడటం బహుశా కేరళలోనే జరిగిందేమో.

 

ఇంతకీ విషయం ఏమిటంటే స్వప్నసురేష్ అనే అమ్మాయి  తిరువనంతపురంలో ఓ ట్రావెల్ ఏజెంట్ గా 2009 ప్రాంతంలో తన కెరీర్ మొదలుపెట్టింది. తర్వాత రెండేళ్ళకు అంటే 2011 ప్రాంతంలో దుబాయ్ కి వెళ్ళిపోయింది. దుబాయ్ లో కూడా ట్రావెల్ ఏజెంటుగానే కొంతకాలం పనిచేసింది. తర్వాత అక్కడేమైందో ఏమో దుబాయ్ లోనే ఓ ఎయిర్ లైన్స్ సంస్ధలో దుబాయ్ విమానాశ్రయం ఉద్యోగి అవతారం ఎత్తింది. కొంతకాలం తర్వాత ఏదో వివాదం మొదలవ్వటంతో వెంటనే స్వప్న మళ్ళీ కేరళకు తిరిగి వచ్చేసింది. తిరువనంతపురంకు వచ్చేసిన వెంటనే ఎయిర్ ఇండియా ఏజెంటు ఉద్యోగం మొదలుపెట్టింది.

 

కొంతకాలానికి ఎయిర్ ఇండియా ఏజెంటుగా ఉద్యోగం వదిలేసి ఏకంగా యునైటె అరబ్ ఎమిరేట్స్ రాయబార కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగం సంపాదించింది. కొంతకాలానికి ఆమెపై ఆరోపణలు రావటంతో స్వప్నను తీసేశారు. తర్వాత కేరళ ఐటి  మౌళిక సదుపాయాల శాఖలో లైజనింగ్ అధికారి అవతారం ఎత్తింది. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుండి రెగ్యులర్ గా తురువనంతపురంలోని రాయబార కార్యాలయానికి ఏవో పార్సెళ్ళు వస్తునే ఉన్నాయి. మామూలుగా రాయబార కార్యాలయాలకు వచ్చే పార్శిళ్ళను ఎవరూ చెక్ చేయరు. దేశాల మధ్య ఉన్న దౌత్య సంబంధాలను దృష్టిలో పెట్టుకుని గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకోవటంలో భాగంగా ఎయిర్ పోర్టుల్లో చెకింగ్ చేయకపోవటం, పార్శిళ్ళను చెక్ చేయకపోవటం లాంటి వెసులుబాట్లుంటాయి.

 

సరిగ్గా దీన్నే స్వప్న తనకు అనుకూలంగా మార్చుకుంది. దుబాయ్ నుండి రెగ్యులర్ గా తిరువనంతపురంకు వచ్చే పార్శిళ్ళల్లో భారీ ఎత్తున బంగారాన్ని స్మగ్లింగ్ చేయించేదట. ఈ విషయాన్ని ఎవరో కస్టమ్స్ వాళ్ళకు ఉప్పందించారు. దాంతో మర్యాదలను, ఆనవాయితీలను పక్కనపెట్టి కస్టమ్స్ అధికారులు దుబాయ్ నుండి వచ్చిన పార్శిళ్ళను పరిశీలించారు. ఇంకేముందు ఒకసారి చేసిన తనిఖీలోనే సుమారు 30 కిలోల బంగారు కడ్డీలు బయటపడ్డాయి. ఇటువంటి పార్శిళ్ళు నెలల తరబడి కొన్ని వందలు వచ్చాయట. పార్శిల్ వ్యవహారం బయటపడ్డాక ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే ప్రిన్సిపుల్ సెక్రటరీ శంకరన్ కస్టమ్స్ వాళ్ళపై తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలున్నాయి. ఒత్తిడి తెచ్చినా ఫలితం లేదని తెలియగానే వెంటనే స్వప్న ఎవరికీ కనబడకుండా మాయమైపోయింది.

 

శంకరన్ తమపై ఒత్తిడి పెట్టినట్లు కస్టమ్స్ అధికారులు బయటకు చెప్పేశారు. దాంతో వెంటనే శంకరన్ను విధుల నుండి ప్రభుత్వం తప్పించింది. మాయమైపోయి స్వప్న గతంలో ముఖ్యమంత్రితో కూడా సన్నిహితంగా ఉండేదనే ఆరోపణలు మొదలయ్యాయి. దాంతో వివాదమంతా ఇపుడు పినరయ్ కు కూడా చుట్టుకుంది. ప్రతిపక్షాలన్నీ ఏకమైపోయి విజయన్ పై మండిపోతు రాజీనామాను డిమాండ్ చేస్తున్నాయి. స్వప్న కెరీర్ మొత్తం వివాదాస్పదమే అని ఇపుడు వార్తలు బయటకు వస్తున్నాయి. మొత్తానికి ఎవరిని ఏ స్ధాయిలో మ్యానేజ్ చేసిందో ? ఎలా మ్యానేజ్ చేసిందో తెలీదు కానీ నెలల తరబడి జరిగిన బంగారం స్మగ్లింగ్ లో స్వప్నదే కీలక పాత్రగా ఆరోపణలు పెరిగిపోతున్నాయి. మరి  స్వప్న ఎప్పటికి దొరుకుతుందో ? మంటలు ఎలా చల్లారుతాయో చూడాల్సిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: