ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మాట ఇస్తే దానికి తిరుగు ఉండ‌దు అన్న‌ది ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. జ‌గ‌న్‌కు ఈ ల‌క్ష‌ణం మాత్రం ఆయ‌న తండ్రి దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్‌. రాజ‌శేఖ‌ర్ రెడ్డి నుంచి వ‌చ్చింద‌నే చెప్పాలి. వైఎస్ కూడా ఎవ‌రికి అయినా ఏదైనా ప‌ద‌వి ఇస్తాన‌ని చెప్పినా లేదా సాయం చేస్తాన‌ని మాట ఇచ్చినా కూడా అది ఖ‌చ్చితంగా నెర‌వేర్చేవారు. ఇప్పుడు జ‌గ‌న్ సైతం ఈ విష‌యంలో త‌న తండ్రి ల‌క్ష‌ణాన్నే పుణికి పుచ్చుకున్నాడ‌నే చెప్పాలి. ఇదిలా ఉంటే గ‌వ‌ర్న‌ర్ కోటాలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాన్ని జ‌గ‌న్ గుంటూరు జిల్లాకు చెందిన సీనియ‌ర్ నేత‌, మాజీ ఎమ్మెల్యే మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌కు ఇస్తున్న‌ట్టు వైసీపీ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది.

 

వాస్త‌వానికి మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ వైఎస్ కుటుంబానికి అత్యంత స‌న్నిహితుడు. మ‌ర్రి కుటుంబంలో ఆయ‌న మామ‌, దివంగ‌త మాజీ ఎమ్మెల్యే సోమేప‌ల్లి సాంబ‌య్య‌, మ‌ర్రి క‌లిసి మొత్తం ఎనిమిది సార్లు చిల‌క‌లూరిపేట నుంచి పోటీ చేశారు. వీరు ఇద్ద‌రు కూడా పేట ఎమ్మెల్యేలుగా విజ‌యం సాధించారు. ఇక గ‌త ఎన్నిక‌ల‌కు ముందు జ‌గ‌న్ ఈ సీటును అప్పుడే టీడీపీ నుంచి వ‌చ్చిన విడ‌ద‌ల ర‌జ‌నీకి ఇచ్చారు. దీంతో రాజ‌శేఖ‌ర్ ర‌జ‌నీని ద‌గ్గ‌రుండి మ‌రీ గెలిపించారు. అయితే ఎన్నిక‌ల ప్ర‌చారంలో చిల‌క‌లూరిపేట‌కు వ‌చ్చిన జ‌గ‌న్ తాము అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ సీటు ఇవ్వ‌డంతో పాటు మంత్రి ప‌ద‌వి ఇస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు జ‌గ‌న్ తాను ఇచ్చిన హామీని నిల‌బెట్టుకుంటున్నారు.

 

ఇక ఇప్పుడు గ‌వ‌ర్న‌ర్ కోటాలో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానాన్ని మ‌ర్రితో భ‌ర్తీ చేయాల‌ని జ‌గ‌న్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఇక జ‌గ‌న్ కేబినెట్లో క‌మ్మ వ‌ర్గం నుంచి ఒక్క కొడాలి నాని మాత్ర‌మే మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు కీల‌క‌మైన గుంటూరు జిల్లా నుంచి మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌ను ముందుగా మండ‌లికి పంపితే ఆ త‌ర్వాత స‌మీక‌ర‌ణ‌ల‌ను బ‌ట్టి ఆయ‌న‌కు మ‌రింత కీల‌క‌మైన ప‌ద‌వి ఇవ్వొచ్చ‌న్న ఆలోచ‌న‌లో జ‌గ‌న్ ఉన్నార‌ట‌. ఇక రాజ‌శేఖ‌ర్‌కు ఎమ్మెల్సీ వ‌స్తే క‌మ్మ వ‌ర్గం నుంచి ఈ ప‌ద‌వి ద‌క్కించుకున్న తొలి ఎమ్మెల్సీగా నిలుస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: