రాజస్ధాన్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ముసలంపుట్టింది. ఐదేళ్ళుండాల్సిన ప్రభుత్వం అర్ధాంతరంగా కూలిపోయే పరిస్ధితికి వచ్చింది. దీనికి స్వయంకృతపరాధమే కారణమని చెప్పాలి. యువనేత సచిన్ పైలెట్ కు ముఖ్యమంత్రి, సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ కు మధ్య మొదటినుండి ఉన్న గొడవలు ఒక్కసారిగా పెరిగిపోయి చివరకు ప్రభుత్వం పుట్టిముంచే దశకు చేరుకుంది. కేవలం గెహ్లాట్ మీద కోపంతోనే సచిన్ ప్రభుత్వంపై తిరుగుబాటు లేవదీశాడన్న విషయం అర్ధమైపోతోంది. అధిష్టానం జోక్యం చేసుకున్నా ఇద్దరి మధ్య గొడవలను సర్దుబాటు చేసేందుకు అవకాశం లేకుండా పోయింది. దాంతో గెహ్లాట్ ప్రభుత్వం కూలిపోయే దశకు చేరుకుంది.

 

ఇంతకీ అసలు ఇద్దరి మధ్య గొడవలు ఎందుకు మొదలైంది ? ఎందుకంటే ఇద్దరికీ మొదటి నుండి పడటం లేదు.  ప్రతిపక్షంలో ఉన్నపుడు పార్టీ పటిష్టానికి బాగా కష్టపడింది సచిన్ పైలెట్టే. అభ్యర్ధుల ఎంపికలో కూడా అప్పట్లో పైలెట్ దే పైచేయి అయ్యింది. ఎన్నికల సమయంలో అభ్యర్ధుల విజయానికి, పార్టీ తరపున విపరీతమైన ప్రచారం చేసింది సచిన్ మాత్రమే. మొత్తానికి యువనేతలకు ప్రాధాన్యత ఇచ్చిన నేపధ్యంలో ప్రతిపక్షంలో ఉన్నపుడు నేతల మధ్య ఉన్న కట్టుబాటు కారణంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించిన పైలెట్ నే అధిష్టానం ముఖ్యమంత్రిని చేస్తుందని అందరు అనుకున్నారు.

 

అయితే అందరి అంచనాలను తల్లకిందులు చేస్తు అశోక్ సిఎంగా బాధ్యతలు స్వీకరించాడు. అదే ఇద్దరి మధ్య గొడవలకు కారణమైంది. సరే పైలెట్ ను కూడా ఉపముఖ్యమంత్రిగా నియమించింది అధిష్టానం. కానీ పైలెట్ కు గెహ్లాడ్ సరైన ప్రాధాన్యత ఇవ్వకుండా ఎక్కడికక్కడ అవమానిస్తునే ఉన్నాడట. శాఖల కేటాయింపులో కానీ ప్రభుత్వ వ్యవహారాల్లో కానీ సచిన్ వర్గానికి ముఖ్యమంత్రి ఎటువంటి ప్రాధాన్యత లేకుండా చేశాడట. దాంతో విసిగిపోయిన పైలెట్ అవకాశం కోసం ఎదురు చూశాడు. ఇంతలో మొన్నటి జూన్ 13వ తేదీన స్పెషల్ ఆపరేషన్స్ గ్రూపు (ఎస్ఓజి)పోలీసు అధికారులు ఓ ఫోన్ ట్యాపింగ్ సంభాషణలను బయటపెట్టారు. అందులో గెహ్లాట్ ప్రభుత్వాన్ని పడగొట్టడం, సచిన్ కు కేంద్రంలో మంత్రిపదవి ఇప్పించటం వంటి డైలాగులున్నాయి.

 

ఈ ఇద్దరిలో ఒకరేమో స్వతంత్ర ఎంఎల్ఏ కాగా మరోకడు కాంగ్రెస్ ఎంఎల్ఏ. వాళ్ళ సంభాషణల్లో సనిచ్ ప్రస్తావన కూడా రావటంతో పోలీసులు వెంటనే  ఎఫ్ఐఆర్ కట్టేశారు. అంతేకాకుండా కుట్రకు ప్లాన్ వేస్తున్నాడన్న కలరింగ్ ఇచ్చి విచారణకు హాజరవ్వాలంటూ  సచిన్ కు పోలీసులు నోటీసులు కూడా ఇచ్చారు. ఇంకేముంది సచిన్ కు మండిపోయింది. ఇదంతా గెహ్లాటే వెనుక నుండి నడిపిస్తున్నాడంటూ సచిన్ మండిపోయాడు. పచ్చగడ్డి వేయకపోయినా మంటలు మండుతున్న సమయంలో ఏకంగా ఉపముఖ్యమంత్రినే విచారించాలని పోలీసులు నోటీసులు ఇస్తే ఇంకేమన్నా ఉందా ? తనను తప్పుడు కేసులో ఇరికించేందుకు గెహ్లాట్ పెద్ద ప్లానే  వేశాడంటూ సచిన్ మండిపోయాడు.  

 

దాంతో ఇద్దరి మధ్య గొడవలు ముదిరిపోయి చివరకు సచిన్ తిరుగుబాటు లేవదీసేస్ధాయికి పరిస్ధితి దిగజారిపోయింది. మరి గెహ్లాట్ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో ? సచిన్ ఏమి చేస్తాడో చూడాల్సిందే. ఇక్కడ అధిష్టానంది కూడా పూర్తి తప్పున్నట్లే అర్ధమవుతోంది. ఇద్దరి మధ్య గొడవలున్న విషయం తెలిసి కూడా అవి పెరుగుతుంటే ఢిల్లీ నాయకత్వం చూస్తు ఊరుకుంది. చివరకు సొంత ప్రభుత్వమే కూలిపోయే దశకు చేరుకున్న తర్వాత జోక్యం చేసుకోవటమంటే చేతులు కాలిన ఆకులు పట్టుకోవటం సామెతలాగే తయారైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: