గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. తన రాజీనామా విషయంలో వెనకడుగు వేశారా..? టీడీపీ తరపున గెలిచి  వైఎస్సార్సీపీకి మద్దతు పలికిన వంశీ.. ఇకపై కమలానికి జై కొట్టబోతున్నారా..? వల్లభనేని వంశీ యూ టర్న్ వెనుక బీజేపీ ఎంపీ సుజనా చౌదరి హస్తం ఉందా..? అంటే.. అవుననే సమాధానం వినిపిస్తుంది.

 

గత కొన్ని రోజులుగా టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నాడనే ప్రచారం సాగుతోంది. ఈ విషయమై ఇప్పటికే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తో సంప్రదింపులు జరిపారట. రాజీనామా చేసి, ఉపఎన్నికలో గెలిచి.. సగర్వంగా వైసీపీ ఎమ్మెల్యేగానే అసెంబ్లీలో కూర్చోవాలని చూస్తున్నాడంటూ రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ గా చర్చ జరుగుతుంది. వాస్తవానికి 2019 ఎన్నికల్లో రాష్ట్రమంతా వైసీపీ గాలి వీచినా దాన్ని తట్టుకొని నిలబడి టీడీపీ తరుఫున గన్నవరం నుంచి వంశీ గెలిచాడు. దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు ఆ నియోజకవర్గంలో ఆయనకి ఎంత మంచి పేరు ఉందో.

 

కానీ కాలక్రమేనా మారుతున్న పరిణామాలతో టీడీపీలో ఉండలేకపోయారు. టీడీపీ నుంచి గెలిసి వైసీపీకి మద్దతు పలుకుతున్నారనే అపవాదు ఉంది. దాంతో వల్లభనేని వంశీని టీడీపీ నేతలు సోషల్ మీడియాలో విమర్శలు చేశారు. దాంతో వంశీ తిరగబడి టీడీపీకి రాజీనామా చేశారు. ప్రస్తుతం శాసనసభలో టెక్నికల్ గా టీడీపీ ఎమ్మెల్యేగా ఉంటూ వైసీపీకి మద్దతు ప్రకటించిన వల్లభనేని వంశీ తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేవబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడున్న తాజా సమాచారం ప్రకారం.. వల్లభనేని వంశీ తన స్టాండ్ మార్చుకున్నట్టు తెలుస్తుంది.

 

వంశీ రాజీనామా చేస్తున్నాడంటూ వార్తలు వచ్చిన వెంటనే బీజేపీ ఎంపీ సుజనా చౌదరి వంశీకి ఫోన్ చేసి మాట్లాడినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో రాజీనామా ఆలోచన మానుకోమని, సమయం వచ్చినప్పుడు ఏం చెయ్యాలో తానే చెప్తానని సుజనా, వంశీకి చెప్పారట. దీనికి వల్లభనేని వంశీ కూడా సరే అని చెప్పినట్టు సమాచారం. సుజనా చౌదరితో వల్లభనేని వంశీకి మంచి సంబంధాలు ఉన్నాయి.. ఇంకా చెప్పాలంటే వంశీకి, సుజనా ఒక గాడ్ ఫాదర్. సుజనా చెప్పగానే వంశీ వెనకడుగు వేయడంతో మరో కొత్త అంశం తెరపైకి వచ్చింది.

 

అదేంటంటే.. త్వరలోనే వల్లభనేని వంశీ బీజేపీలోకి చెరబోతున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. వైసీపీలో చేరాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి గాని. బీజేపీలోకి చేరాలంటే అవసరం లేదు. అందుకే రాజీనామా వద్దని సుజనా చెప్పారట. అలాగే.. చంద్రబాబుపై అసంతృప్తిగా ఉన్న నేతలను బాబు తరపున సుజనా డీల్ చేస్తున్నారా..? లేక ఏపీలో బీజేపీని స్ట్రాంగ్ చేసేందుకు ఇలా చేస్తున్నారా..? అనే సందేహాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా దీని గురించి పూర్తిగా తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: