అదేంటి?  వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి వివాహం.. విజ‌య‌మ్మ‌తో క‌దా జ‌రిగింది. ఆయ‌న స‌తీమ‌ణిగా విజ‌య‌మ్మే క‌దా అన్ని గౌర‌వాలు పొందుతున్న‌ది. మ‌రి రాజేశ్వ‌రి ఎవ‌రు మ‌ధ్య‌లో ?! అస‌లు ఏం జ‌రిగింది.. అని ఆలో చిస్తు న్నారా? ఇది నిజ‌మే. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి వివాహం.. నిజంగానే రాజేశ్వ‌రితోనే జ‌రిగింది. క‌టుంబ పెద్ద‌లు, త‌ల్లీ దండ్రులు పులివెందుల వాస్త‌వ్యులు వైఎస్ రాజారెడ్డి.. జ‌య‌మ్మ‌ల ద్వితీయ పుత్రుడైన వైఎస్ రాజ‌శేఖ‌రరెడ్డికి, పులివెందుల గ్రామానికి చెందిన పి.రామాంజుల‌రెడ్డి, తుల‌శ‌మ్మల ప్ర‌థ‌మ కుమార్తె `రాజేశ్వ‌రి`ని ఇచ్చే వివాహం చేశారు. ఈ విష‌యం.. పైనున్న పెళ్లి కార్డులోనూ స్ప‌ష్టంగా ఉంది. ఇది వైఎస్ వివాహ ప‌త్రికే! అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగిన ఈ వివాహానికి భారీ ఎత్తున ప్ర‌జ‌లు హాజ‌ర‌య్యారు. 


వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించారు. వాస్త‌వానికి పెళ్లి జ‌రిగిన ముందు రోజు క‌డ‌ప జిల్లాను వ‌ర్షాలు, వ‌ర‌ద‌లు పోటెత్తాయి. దీంతో అస‌లు ఆహ్వానితులు వ‌స్తారా?  రారా? అనే సందేహాలు వెల్లువెత్తాయి. కానీ, భారీ ఎత్తున ప్ర‌జ‌లు వ‌చ్చారు. దీనికి కారణం.. పెళ్లికి ముందు రోజు రాత్రి ఇరు కుటుంబాల పెద్ద‌లు కూడా దేవుడిని ప్రార్ధించారు. దేవుడా.. మా కుటుంబంలో జ‌రుగుతున్న ఘ‌న‌కార్యాన్ని గ‌ట్టెక్కించ‌మ‌ని వేడుకున్నారు. వీరి ప్రార్థ‌న విన్న దేవుడు.. వ‌ర్షాన్ని ఆపేశాడు. దీంతో ముందు రోజు ఉన్న వాతావ‌ర‌ణం పెళ్లిరోజు నాటికి పూర్తిగా మారిపోయింది. దీంతో రాజేశ్వ‌రి, వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డిల వివాహం ఘ‌నంగా జ‌రిగిపోయింది. 

 

మ‌రి ఇంత‌కీ.. విజ‌య‌మ్మ ఎవ‌రు?  వైఎస్‌రాజ‌శేఖ‌ర‌రెడ్డికి ఈమెకు ప‌రిచ‌యం ఏంటి? 37 ఏళ్ల‌పాటు వీరి కాపురం ఎలా జ‌రిగింది? అనే ప్ర‌శ్న‌లు స‌హ‌జంగా తిక‌మ‌క పెడ‌తాయి. ఈ విష‌యాన్ని వైఎస్ స‌తీమ‌ణి.. విజ‌య‌మ్మ స్వ‌యంగా రాసుకున్న ``నాలో.. నాతో వైఎస్సార్‌`` పుస్త‌కంలో సంక్షిప్తంగా వివ‌రించారు. వైఎస్ పెళ్లి విష‌యాల‌ను ఆమె వివ‌రించారు. పులివెందుల‌కు చెందిన పొచిమిరెడ్డి రామాంజ‌నేయుల రెడ్డి(కార్డులో మాత్రం రామాంజి రెడ్డి అని వేశారు) ప్ర‌థ‌మ కుమార్తె విజ‌య‌మ్మ. ఈమె ఇంట‌ర్ వ‌ర‌కు చ‌దువుకున్న త‌ర్వాత ఇదే గ్రామానికి చెందిన వైఎస్ రాజారెడ్డి రెండో కుమారుడు ఎంబీబీఎస్ చ‌దివిన డాక్ట‌ర్ వైఎస్‌తో కుదిర్చారు. 


అబ్బాయి, అమ్మాయి ఇష్ట‌ప‌డ్డారు. ఇరు కుటుంబాల పెద్ద‌లు కూడా ఇష్ట‌ప‌డ్డారు. విజ‌య‌మ్మ తండ్రి రా మాంజిరెడ్డి ప‌ది బ‌స్సుల‌కు ఓన‌రు, ఓ సినిమా హాలు కూడా ఉంది. ఇక‌, వైఎస్ తండ్రి రాజారెడ్డికి వ్య‌వసా యం ఉంది. పైగా ఆసాములు. దీంతో ఇరు ప‌క్షాలు కూడా వివాహానికి సిద్ధ‌మ‌య్యాయి. నిజానికి విజ‌య‌మ్మ అస‌లు పేరు విజ‌య‌ల‌క్ష్మి. హిందూమ‌త‌స్తులు . కానీ, రాజారెడ్డి కుటుంబం క్రిస్టియ‌న్లు. దీంతో పెళ్లిని క్రిస్టియ‌న్ ఆచారం ప్ర‌కారం చేయాల‌నుకున్నారు.  పెళ్లిళ్లు చేసే పాస్ట‌ర్‌ను పిలిచారు. ఆయ‌న పెళ్లి కుమారుడు అయిన వైఎస్‌, పెళ్లి కుమార్తె అయిన‌.. విజ‌య‌ల‌క్ష్మి పేర్ల‌ను ప‌రిశీలించి.. ఇద్ద‌రు స‌మవుజ్జీలుగా ఉండాలంటే.. విజ‌య‌ల‌క్ష్మి పేరు మార్చాల‌ని సూచించారు. 


ఈ క్ర‌మంలోనే ఆ ఫాద‌ర్ స‌హా కుటుంబ పెద్ద‌లు, రాజారెడ్డి కుటుంబ బంధ‌వులు ముఖ్యంగా వైఎస్ త‌ల్లి జ‌య‌మ్మ సూచ‌న‌ల మేర‌కు విజ‌య‌ల‌క్ష్మి పేరు రాజేశ్వ‌రిగా మారిపోయింది. దీనినే కార్డులో ముద్రించారు. అంటే.. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి వివాహం.. రాజేశ్వ‌రిగా పేరు మార్చుకున్న విజ‌య‌ల‌క్ష్మితోనే జ‌రిగింద‌న్న మాట‌. 1972, ఫిబ్ర‌వ‌రి 2న ఘ‌నంగా పులివెందుల వేదిక‌గా వివాహం జ‌రిపించార‌న్న మాట‌. సో.. వైఎస్ వివాహం వెనుక జ‌రిగిన ట్విస్ట్ ఇదే!!

మరింత సమాచారం తెలుసుకోండి: