కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం.. అందరికీ సమానంగా అన్ని అవకాశాలు కల్పిస్తాం. అంటూ ఏపీ సీఎం జగన్ చెప్పడమే కాదు, ఆ విధంగానే అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా పరిపాలన సాగిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా, ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నా, చిరునవ్వుతోనే ఆ బాధలన్నీ భరిస్తూ, ప్రభుత్వ పరంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అందరిని సంతోషంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు. పాలనాపరంగా, వ్యవహారాలు పరంగా, ఇప్పటి వరకు జగన్ ప్రజల్లో మంచి మార్కులే వేయించుకుంటూ వస్తున్నారు. ఇక ప్రతిపక్షాల విమర్శలు ఎప్పుడూ ఉండేవే. సహజంగా రాజకీయ పార్టీలకు ప్రత్యర్థి పార్టీలు చేసే పనులు ఏవి నచ్చవు. ఏం చేసినా రాజకీయం చేసేందుకే ప్రయత్నిస్తారు తప్ప, ప్రశంసించేందుకు ముందుకు రారు. అదేవిధంగా ఏపీలో తెలుగుదేశం, జనసేన, బిజెపి వంటి పార్టీలు అదే విధమైన వైఖరితో ముందుకు వెళుతూ జగన్ ను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తూ వస్తున్నాయి.

 

 ఇదంతా పక్కన పెడితే, కొద్దిరోజులుగా జగన్ వ్యవహారశైలిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ఒక సామాజిక వర్గం వారిని టార్గెట్ చేసుకుంటూ ప్రభుత్వం ముందుకు వెళుతుందని, ఆ సామాజిక వర్గం వారికి సరైన ప్రాధాన్యం దక్కకుండా చేసే ఉద్దేశ్యంలో భాగంగా వారిపై వేధింపులకు దిగుతోందని, ఇలా అనేక ఆరోపణలు జగన్ ప్రభుత్వం ఎదుర్కొంటోంది. పరిపాలనలో పారదర్శకత పెంచే విధంగా ముందుకు వెళ్లే క్రమంలో గత టిడిపి ప్రభుత్వంలో అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న కొంతమంది నాయకులను, అధికారులను పక్కకు తప్పించే క్రమంలో జగన్ కఠినంగానే వ్యవహరిస్తున్నారు. ఈ కఠిన నిర్ణయాల్లో ఆ సామాజిక వర్గం వారు ఎక్కువగా ఇబ్బంది పడుతుండడంతో జగన్ మొత్తం ఆ సామాజిక వర్గం వారందరినీ, వేధిస్తోందనే  అభిప్రాయాన్ని జనంలోకి తీసుకెళ్లడంలో టిడిపి, జనసేన పార్టీలు ప్రస్తుతం సక్సెస్ అయినట్టే కనిపిస్తున్నాయి. 

 

దీనికి తోడు అదే సామాజిక వర్గానికి చెందిన ఓ మంత్రి సైతం తమ సామాజిక వర్గాన్ని, ఆ సామాజికవర్గ నాయకులపైన విమర్శలు చేస్తూ ఉండటం వంటి పరిణామాలు,  పరిపాలన రాజధానిగా అమరావతిని తప్పించి విశాఖకు తరలించే ప్రయత్నాలు చేస్తుండడంతో, అమరావతి లో ఎక్కువగా ఉండే ఆ సామాజిక వర్గం ప్రజల్లోనూ, ఈ తరహా అభిప్రాయం వచ్చేసింది. దీంతో ఆ వర్గం ప్రజల ఆదరణ ప్రభుత్వానికి తగ్గిపోతుందని ఎంతగా వారికి మేలు చేస్తున్నా, తమను చిన్నచూపు చూస్తున్నారనే అభిప్రాయం పెరిగిపోయింది. ఈ విషయంలో వైసిపి తప్పు చేస్తుందనే అభిప్రాయం ఆ వర్గం ప్రజల్లో వచ్చేసింది. అయితే ఇక్కడ పూర్తిగా జగన్ ను తప్పు పట్టేందుకు ఆస్కారం లేదు. 

 

ఎందుకంటే గత టిడిపి ప్రభుత్వంలో ప్రధానంగా చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన అధికారులకు పెద్దపీట వేస్తూ, కీలక స్థానాల్లో వారిని నియమించడం, అలాగే ఓ సందర్భంలో డీఎస్పీ ప్రమోషన్ల విషయంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికి ప్రమోషన్లు ఒకేసారి దక్కడం వంటి పరిణామాలు ఎన్నో అప్పట్లో సంచలనంగా మారాయి. గత టిడిపి ప్రభుత్వంలో నియమించిన అధికారులను ఇప్పుడు కొనసాగిస్తే, అప్పట్లో తాము చేసిన విమర్శలకు అర్థం ఉండదని, అలాగే పనితీరు పారదర్శకత ఉన్న అధికారులను నియమిస్తేనే, తాను అనుకున్న విధంగా పరిపాలన కొనసాగుతోందనే ఉద్దేశంతో జగన్ ఆలోచించి కొంతమంది కీలక అధికారులను తప్పించి పరిపాలనను గాడిలో పెట్టినట్టుగా కనిపిస్తోంది.

 

 కులాల విషయంలో జగన్ మొదటి నుంచి జాగ్రత్తగానే వ్యవహరిస్తూ వస్తున్నారు. తన మంత్రిమండలిలో కూడా జగన్ సామాజికవర్గానికి చెందిన వారికి కంటే మిగతా అన్ని కులాల వారికి ప్రాధాన్యం పెరిగేలా మంత్రిమండలి ఏర్పాటు చేశారు. అలాగే నామినేటెడ్ పోస్టుల విషయంలోనూ ఎప్పుడూ లేని విధంగా కులాల వారీగా రిజర్వేషన్లు కల్పించి, బడుగు బలహీన వర్గాల వారికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ, వారికి నామినేటెడ్ పోస్టులు కట్టబెట్టారు. ఈ విషయంలో సొంత సామాజిక వర్గం నుంచి కాస్త వ్యతిరేకత వచ్చినట్టుగా కనిపించినా లెక్కచేయకుండా అన్ని కులాల వారికి తన ప్రభుత్వంలో సమన్యాయం జరగాలనే విధంగా జగన్ ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే కొంతమందికి బాధ కలిగినా, జగన్ వెళ్తున్న రూట్ సరైనదే అన్న అభిప్రాయం మెజార్టీ జనాల్లో కనిపిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: