పల్లెల్లో ఇళ్లకు ఉన్న తాళాలు తెరచుకున్నాయి. జీవనోపాధికి పట్నం వెళ్లిన వారు స్వగ్రామాలకు చేరుకున్నారు. పొట్టకూటికోసం ఉన్న ఊరును, కన్నతల్లిని విడిచి పట్నంపోయిన ఎంతోమంది జీవితాలను కరోనా భయంతో తిరిగి పుట్టిన ఊరికి చేరుకుంటున్నారు. ప‌ట్నంలో చేసేందుకు పనిలేక.. అక్కడ ఉండే స్తోమత లేకపోవడంతో తిరిగి వ‌చ్చేస్తున్నారు. అయితే దుర‌దృష్ట‌వ‌శాత్తు ఇలా ప‌ట్నం నుంచి ప‌ల్లెకు చేరుకుంటున్న వారిలో క‌రోనా వైర‌స్ బారిన ప‌డిన వారూ ఉంటున్నారు. వ్యాధి ల‌క్ష‌ణాలు బ‌య‌ట ప‌డ‌క‌పోవ‌డంతో క‌రోనా వైర‌స్ త‌మకు సోక‌లేద‌నే ధీమాతో వారు ఇలా ప‌ల్లెల‌కు వెళ్తున్నారు.

 


ఇందులో వారిని నిందించ‌డానికి కూడా ఏం లేదు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న వలస కూలీలు పెద్ద సంఖ్యలో రాష్ట్రానికి తిరిగివస్తున్నారు. పెద్ద సంఖ్యలో ఇతర రాష్ట్రాల నుంచి కూలీలు, కార్మికులు పనులు చేసుకునేందుకు రాష్ట్రానికి తరలివస్తున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులు ఊపందుకుంటాయన్న కోణంలో ఈ పరిణామం సంతోషానిచ్చేదే అయినా.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో తీవ్ర కలవరపాటుకు గురిచేస్తోంది. ఇతర రాష్ట్రాలతో పోల్చితే మన రాష్ట్రంలో కరోనా కేసులు తక్కువగా ఉండటంతో ఈ మహమ్మారి అదుపులోనే ఉందన్న అభిప్రాయాలున్నాయి. ఈ తరుణంలో వలస వెళ్లిన కూలీల రాక, తిరుగు వలసలు పల్లె ప్రజలకు ఆందోళన కలిగిస్తోంది. 

 


క‌రోనా వైర‌స్ నివార‌ణ చ‌ర్య‌ల్లో ప్ర‌భుత్వం ఇప్ప‌టికే అనేక నిబంధ‌న‌లు తీసుకువ‌చ్చింది. ఇత‌ర రాష్ట్రాల నుంచి వ‌చ్చే వ‌ల‌స కూలీల‌కు, ఉద్యోగుల‌కు త‌ప్ప‌నిస‌రిగా ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని ఆదేశించింది. మొద‌ట్లో వైద్యాధికారులు బాగానే చేసినా..ఇప్పుడు కాస్త నిర్ల‌క్ష్యం పెరిగిపోయింది. దీనికితోడు గ్రామానికి చేరుకున్నా..ఆ స‌మాచారం స్థానిక అధికారులకు గానీ, ప్ర‌జాప్ర‌తినిధుల‌కు గాని కుటుంబ స‌భ్యులు తెలియ‌నివ్వ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే వ‌ల‌స కార్మికులు, ఇత‌ర రాష్ట్రాల్లో ఉద్యోగాలు మానేసిన వ‌చ్చిన వారి కుటుంబ స‌భ్యులే   ముందుగా  క‌రోనా బారిన ప‌డుతున్నారు. ఖ‌మ్మం జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన న‌లుగురికి క‌రోనా రావ‌డం గ‌మ‌నార్హం. ఇలా ఇప్పుడు తెలంగాణ‌లోని ప్ర‌తి జిల్లాకు హైద‌రాబాద్‌తో పాటు ఇత‌ర రాష్ట్రాల మూల‌లున్న క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. గ‌డిచిన ప‌క్షం రోజుల్లోనే తెలంగాణ ప‌ల్లెల్లో కేసుల న‌మోదు గ‌ణ‌నీయంగా పెర‌గ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: