రాజస్ధాన్ లో యువనేత సచిన్ పైలెట్ కు కాంగ్రెస్ అధిష్టానం అలాంటి ఇలాంటి షాక్ ఇవ్వలేదు. సిఎం అశోక్ గెహ్లాట్ కు ఉపముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు సచిన్ పైలెట్ కు మధ్య మొదలైన ఆధిత్యపత్య గొడవల్లో ఎవరిది పై చేయా అనే టెన్షన్ అందరిలోను పెరిగిపోయింది. అయితే గంటకో తీరుగా మారుతున్న పరిణామాల్లో ప్రస్తుతానికి గెహ్లాట్ దే పైచేయని చెప్పాలి. మంగళవారం జరిగిన సిఎల్పీ సమావేశం తర్వాత సచిన్ ను ఉపముఖ్యమంత్రిగానే కాకుండా పిసిసి అధ్యక్షునిగా కూడా అధిష్టానం తీసేసింది. అంతేకాకుండా సచిన్ మద్దతుదారులను మంత్రిపదవుల  నుండి తీసేసింది.  

 

తాను తిరుగుబాటు చేయగానే గెహ్లాట్ తో పాటు పార్టీ జాతీయ నాయకత్వం కూడా తనతో కాళ్ళబేరానికి వస్తుందని సచిన్ అనుకున్నట్లున్నాడు. అందుకనే తనకు 30 మంది ఎంఎల్ఏల మద్దతుందని చెప్పి అందరినీ ఢిల్లీలో క్యాంపుకు తరలించాడు. దాంతో ఇద్దరిలో ఎవరి క్యాంపులో ఎంతమంది ఎంఎల్ఏలున్నారో ఎవరికీ అర్ధం కాలేదు. అందుకనే గెహ్లాట్ ను సిఎల్పీ సమావేశం నిర్వహించమని సోనియా ఆదేశించింది. దాంతో గెహ్లాట్ నిర్వహించిన సిఎల్పీ సమావేశానికి 90 మంది ఎంఎల్ఏలు హాజరైనట్లు పార్టీ ప్రకటించింది. దాంతో ప్రస్తుతానికి గెహ్లాట్ పదవికి ఎటువంటి గండం లేదన్న ధీమా పార్టీలో వ్యక్తమైంది.

 

అదే సమయంలో 30 మంది ఎంఎల్ఏలున్నట్లు సచిన్ చెప్పుకున్నదంతా అబద్ధమేనా అనే అనుమానాలు పెరిగిపోయాయి.  ఎప్పుడైతే సచిన్ ను పదవుల్లో నుండి తొలగించిందో వెంటనే బిజెపి స్పందించింది.  సచిన్ను తమ పార్టీలోకి ఆహ్వానించింది. అయితే అసలు సచిన్ కు ఎంతమంది ఎంఎల్ఏల మద్దతు ఉన్నదనే విషయంలో అందరికీ అనుమానాలు పెరిగిపోయాయి. ఇదే అనుమానం బిజెపిలో కూడా కచ్చితంగా ఉండే ఉంటుంది. ఎందుకంటే సచిన్ చెప్పుకున్నట్లు నిజంగానే తనకు 30 మంది ఎంఎల్ఏల మద్దే నిజమైతే ఈ పాటికే గెహ్లాట్ ప్రభుత్వం పతనం అంచునుండేదే. అలా కాకుండా సీఎల్పీ సమావేశానికి 90 మంది ఎంఎల్ఏలు హాజరవ్వటమే నిజమైతే సచిన్ కు పార్టీలో పెద్దగా బలం లేదనే అనుకోవాలి.

 

మరి బలంలేని సచిన్ కు  బిజెపిలో మాత్రం ఏమంత విలువుంటుంది ? సచిన్ వ్యవహారం ఇపుడు రెంటికి చెడ్డ రేవడిగా మారిపోయింది. అంటే ఇటు కాంగ్రెస్ లో పదవులు పోగొట్టుకుని అటు బిజెపిలో కూడా పెద్దగా విలువ లేకపోవటంతో ఏమి చేయాలో సచిన్ కు అర్ధంకాని పరిస్ధితుల్లో పడినట్లే అనిపిస్తోంది. మొత్తానికి పార్టీలోను, యువత నేతల్లోను సచిన్ కున్న క్రేజంతా ఒక్కసారిగా గ్రాఫ్ పడిపోయినట్లే అర్ధమవుతోంది. ప్రభుత్వాన్ని ఏదో చేయబోయి చిరవకు తానే ఏదో అయినపోయాడు సచిన్ పైలెట్. మరి సచిన్ భవిష్యత్తు ఎలాంటి మలుపులు తిరుగుతుందో  చూడాల్సిందే.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: