అవును! ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలో తిన్నింటి వాసాలు లెక్క‌పెట్టే నాయ‌కులు పార్టీని నాశ‌నం చేస్తున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ప్ర‌తి జిల్లాలోనూ ఈ త‌ర‌హా నాయ‌కులు క‌నిపిస్తున్నార‌ని పార్టీలో ఇప్పుడు పెను చ‌ర్చ సాగుతోంది. పార్టీ అధికారంలో ఉన్న స‌మ‌యంలో చ‌క్రం తిప్పిన చాలా మంది నాయ‌కులు, మంత్రులుగా చ‌లామ‌ణి అయిన వారు..నామినేటెడ్ ప‌ద‌వులు ద‌క్కించుకున్న‌వారు.. పార్టీలోనూ కీల‌క ప‌ద‌వులు పొందిన వారు.. పార్టీ అధికారం కోల్పోయే స‌రికి.. పార్టీకి దూర‌మ‌య్యారు. స‌రే! దీనిని కూడా అర్ధం చేసుకోవ‌చ్చు. ఏదో .. అధికార పార్టీ నుంచి బెదిరింపులో.. లేదా.. కేసుల భ‌యంతోనే వారు పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూర‌మ‌య్యార‌ని భావించొచ్చు.

 

దీనిని ఎవ‌రైనా సానుకూలంగానే ప‌రిగ‌ణిస్తారు. కానీ, ఇప్పుడు చిత్ర‌మైన ప‌రిస్థితి టీడీపీలో క‌నిపిస్తున్న‌ది. పార్టీలోనే ఉంటూ.. వారి వారి వ్యాపారాలు, వ్య‌వ‌హారాల‌ను చ‌క్క‌బెట్టుకునేందుకు అధికార వైఎస్సార్ సీపీ నేత‌ల‌తో లోపాయికారీ ఒప్పందాలు చేసుకున్న త‌మ్ముళ్ల సంఖ్య తాజాగా చంద్ర‌బాబు చేతికి అందింది. గ‌డిచిన ఏడాది కాలంలో పార్టీ ప‌రిస్థితిపై అధ్య‌య‌నం చేయించిన చంద్ర‌బాబు దీని తాలూకు నివేదిక‌ను విశ్లేషించ‌డం ప్రారంభించారు. దీని ప్ర‌కారం.. పార్టీలోనే ఉంటూ.. పార్టీ ఉప్పు తింటూ.. అధికార పార్టీతో కుమ్మ‌క్క‌యిన నేత‌లు భారీగా ఉన్నార‌ని తెలిసి నివ్వెర పోతున్నార‌ట చంద్ర‌బాబు. నిజానికి గ‌తంలో వైఎస్సార్ సీపి కూడా ప్ర‌తిప‌క్షంలో ఉంది. కానీ, ఆ పార్టీ నాయ‌కులు టీడీపీ నేత‌ల‌తో కుమ్మ‌క్క‌యింది లేదు.

 

కానీ, ఇప్పుడు టీడీపీలో ఉన్న చాలా మంది మేధావులు, మాజీ మంత్రులు మాత్రం వైఎస్సార్ సీపీ నేత‌ల‌తో అంత‌ర్గ‌త ఒప్పందాలు చేసుకుని, త‌మ వ్యాపారాలు దెబ్బ‌తిన‌కుండా చూసుకోవ‌డంతోపాటు .. ప్ర‌భుత్వం నుంచి ఏదో ఒక మార్గంలో నిధులు కూడా తెప్పించుకున్నార‌ని తాజా నివేదిక‌లో గ‌ణాంకాల‌తో పాటు తెలిసింది. వీరిలో గుంటూరుకు చెందిన సీనియ‌ర్ నాయ‌కులు చాలా మంది ఉన్నార‌ట‌. ఇక‌, విజ‌య‌వాడ‌లోనూ నాయ‌కులు ఉన్నార‌ని తెలిసింది. ఇక‌, అనంత‌పురంలో మాజీ మంత్రి ఒక‌రు వైఎస్సార్ సీపీ నేత‌ల‌తో నిత్యం ఫోన్లు మాట్లాడుతున్నార‌ని కూడా టీడీపీ అధినేత‌కు తెలిసింది.

 

పోనీ.. ఏదో వ్యాపారాలు, వ్య‌వ‌హారాల కోసం లోపాయికారీ ఒప్పందాలు చేసుకుంటున్నారులే.. ఏం చేస్తారు? అని స‌రిపెట్టుకున్నా.. కీల‌క‌మైన పార్టీ కార్య‌క్ర‌మాల‌కు హాజ‌రుకాకుండా చూసుకోవ‌డం, ఆయా కార్య‌క్ర‌మాలు వ‌చ్చిన‌ప్పుడు ఏదో ఒకవంక పెట్టుకుని నియోజ‌క‌వ‌ర్గాల్లో కూడా ఉండ‌కుండా త‌ప్పించుకోవ‌డం.. పార్టీ కార్యాల‌య‌కు కూడా అద్దెలు చెల్లించ‌కుండా.. పార్టీకి మూడు మాసాల‌కు ఒక‌సారి ఇచ్చే పార్టీ ఫండ్‌ను కూడా ఇవ్వ‌కుండా త‌ప్పించుకుంటున్నార‌ట‌. దీంతో ఆయా విష‌యాలు తెలుసుకున్న చంద్ర‌బాబు ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు న‌డుంబిగించార‌ని , ముందుగా నోటీసులు జారీ చేయాల‌ని భావిస్తున్నార‌ట‌. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: