అవును! ఇప్పుడు ఈ విష‌యంపై రాష్ట్ర వ్యాప్తంగా రాజ‌కీయ నేత‌ల మ‌ధ్య తీవ్ర చ‌ర్చ జ‌రుగుతోంది. ఎందుకంటే.. ప్ర‌స్తుత జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వం.. జిల్లాల విభ‌జ‌న‌, కొత్త జిల్లాల ఏర్పాటుకు పావులు క‌దుపుతోంది. అయితే, ఇది ఇప్ప‌ట్లో సాకారం అయ్యే అవ‌కాశం లేక‌పోయినా.. క‌నీసం మ‌రో రెండేళ్ల స‌మ‌యం ప‌డుతుంద‌ని తెలిసినా.. రాజ‌కీయాల‌పైనా..పార్టీల ఓటు బ్యాంకుపైనా దీని ప్ర‌భావం తీవ్రంగా ఉంటుంద‌నే భావ‌న నేత‌ల‌ను క‌ల‌వ‌ర‌పెడుతోంది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో  13 జిల్లాలు  ఉన్నాయి. వీటిని పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల ప్రాతిప‌దిక‌న విభ‌జించి మొత్తం 26 జిల్లాలు చేయాల‌ని అధికార వైఎస్సార్ సీపీ నిర్ణ‌యించుకుంది.  

 

ఈ నిర్ణ‌యం వైఎస్సార్ సీపీలో ఆనందం కురిపిస్తుండ‌గా.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షాల్లో మాత్రం గుబులు రేపుతోంది. జిల్లాలను విభ‌జిస్తే..  త‌మ పార్టీ ఎక్క‌డ దెబ్బ‌తింటుందోన‌ని టీడీపీ నేత‌ల‌తోపాటు.. పార్టీ అధినేత చంద్ర‌బాబు కూడా త‌ల‌ప‌ట్టుకుంటున్నారు. గ‌త ఏడాది జ‌రిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో వైఎస్సార్ సీపీ అధినేత‌గా జ‌గ‌న్ ఇచ్చిన హామీల్లో రాష్ట్రంలోని జిల్లాల విభ‌జ‌న కూడా ఒక‌టి. అంతేకాదు, కొత్త‌గా తాను ఏర్పాటు చేసే జిల్లాల‌కు కీల‌క నేత‌లు, స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుల పేర్లు పెడ‌తాన‌ని హామీ ఇచ్చారు. ఇది ఎన్నిక‌ల్లో బాగానే ప‌నిచేసింది. కొత్త జిల్లాలు ఏర్ప‌డితే వెనుక‌బ‌డిన జిల్లాలు, పెద్ద జిల్లాలుగా ఉన్న ప్రాంతాల్లో త‌మ జీవితాలు బాగుప‌డ‌తాయ‌ని ప్ర‌జ‌లు భావించారు. 

 

గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో వైఎస్సార్ సీపీకి ప‌డిన ఓట్ల‌లో వివిధ ప‌థ‌కాల ప్ర‌భావం ఉన్న‌ప్ప‌టికీ.. జిల్లాల విభ‌జ‌న అంశం కూడా కీల‌క‌మైన ప్ర‌భావం చూపించంద‌నేది వాస్త‌వం. ఇక‌, జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చి ఏడాదిన్న‌ర పూర్త‌యింది. జగ‌న్ ప్ర‌భుత్వం ఇప్ప‌టికే.. త‌మ‌ పార్టీ ఎన్నిక‌ల మేనిఫెస్టోలో ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన వాగ్దానాల్లో దాదాపు 90 శాతం  నెర‌వేర్చామ‌ని చెబుతోంది. కానీ, అత్యంత కీలక‌మైన, ఇటు ప్ర‌జ‌ల్లోనూ, అటు రాజ‌కీయాల్లోనూ తీవ్ర‌మైన ప్ర‌భావం చూపించే జిల్లాల విభ‌జ‌న లేదా.. కొత్త జిల్లాల ఏర్పాటు అంశం మాత్రం ఇంకా తెర‌వ‌ని పుస్త‌కంగానే ఉండ‌డం గ‌మ‌నార్హం. నిజానికి ఇది గ‌త ఏడాది ప్ర‌భుత్వం ఏర్పాటు అయిన త‌ర్వాత చేప‌ట్టాల‌ని అనుకున్నారు. 

 

కానీ, 2021లో దేశ జ‌నాభా గ‌ణ‌నను చేపట్టాల్సి ఉంది. దీంతో ఇప్పుడు జిల్లాల విభ‌జ‌న ప్ర‌క్రియ‌ను చేప‌ట్టవ‌ద్ద‌ని కేంద్ర ప్ర‌భుత్వం నుంచి ఆదేశాలు అందాయి. దీంతో ఈ ప్ర‌క్రియ నిలిచిపోయింది. అయితే, తాజాగా సీఎం జ‌గ‌న్ జిల్లాల ఏర్పాటుపై దృష్టి పెట్టారు. ఇప్ప‌టికిప్పుడు విభ‌జ‌న చేయ‌క‌పోయినా.. దీనిపై అధ్య‌య‌నం చేసేందుకు క‌మిటీని ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై నిర్ణ‌యం కూడా ప్ర‌క‌టించ‌నున్నారు. ఇదిలావుంటే.. జిల్లాల ఏర్పాటు విష‌యం టీడీపీ స‌హా బీజేపీలోనూ తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. టీడీపీకి మంచి ప‌ట్టున్న నియోజ‌క‌వ‌ర్గాలు, జిల్లాలు ఇప్పుడు కొత్త జిల్లాలుగా చీలిపోతే.. త‌మ ప‌రిస్థితి ఏంటి? అనేది పార్టీ నేత‌ల మాట‌. ఈ క్ర‌మంలో దీనిని అడ్డుకుందామా? అంటే.. ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త వ‌చ్చే అవ‌కాశం ఉంది. పోనీ.. చూస్తూ ఊరుకుందామా? అంటే.. ఓటు బ్యాంకుపై ప్ర‌భావం ప‌డుతుంది. దీంతో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షాల‌న్నీ త‌ర్జ‌నభ‌ర్జ‌న ప‌డుతుండ‌డం గ‌మనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: