తిరుపతిలో కరోనా వైరస్ వేలల్లో పెరిగిపోవటానికి టిటిడినే ప్రధాన కారణమా ? ఇపుడిదే విషయమై అన్నీ వర్గాల్లోను చర్చ జరుగుతోంది. తాజా లెక్కల ప్రకారం ఒక్క తిరుపతిలో మాత్రమే సుమారు 1200 కరోనా వైరస్ బాధితులున్నారు. నెల రోజుల వ్యవధిలోనే ఒక్కసారిగా వందల కేసులు పెరిగిపోవటానికి ప్రధాన కారణం ఏమిటి ? అసలు లాక్ డౌన్ సమయానికి తిరుపతిలోని కేసులెన్ని ? అన్న విషయాలను గమనిస్తే జూన్ 11వ తేదీన తిరుమలలో శ్రీవారి దర్శనాలను పునరుద్ధరించే సమయానికి తిరుపతిలో కరోనా బాధితుల సంఖ్య 44 మాత్రమే. తిరుమలకు భక్తులను అనుమతించిన ఈ నెల రోజుల్లోనే సుమారు 1150 కేసులు పెరిగిపోయాయంటే కారణం ఏమయ్యుంటుంది ? కచ్చితంగా టిటిడినే కారణమని చెప్పటంలో సందేహం అవసరమే లేదు.

 

శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తుల విషయంలో అన్నీ జాగ్రత్తలు తీసుకుంటామని టిటిడి యాజమాన్యం చేస్తున్న ప్రకటనలంతా  డొల్ల మాత్రమే. ఎందుకంటే భక్తులు తిరుమలకు చేరుకునే ముందు తిరుపతిలోనే అడుగుపెట్టాలి. తిరుపతి చుట్టుపక్కలున్న శ్రీవాసమంగాపురం, తిరుచానూరు, శ్రీకాళహస్తి, అప్పళాయగుంట తదితర పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు. లేకపోతే తిరుమల దర్శనం అయిపోయిన తర్వాతైనా పై పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారన్న విషయం అందరికీ తెలిసిందే.   శ్రీవారి దర్శనం కోసం దేశ, విదేశాల నుండి రోజూ వేలాదిమంది భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. వీళ్ళల్లో ఎంతమందికి కరోనా వైరస్ ఉందో ఎవరికీ తెలీదు.  తిరుపతిలోని  అలిపిరి దగ్గరే భక్తులకు స్క్రీనింగ్ టెస్టులు చేస్తున్నట్లు చెప్పటం కూడా తప్పే. ఎందుకంటే తిరుమలకు వచ్చే వేలాదిమందికి స్క్రీనింగ్ టెస్టులు జరిపేంత వ్యవస్ధ టిటిడి దగ్గర లేదు. పోనీ స్క్రీనింగ్ టెస్టులు చేస్తే వైరస్ అప్పటికప్పుడు బయటపడుతుందనేందకూ లేదు.

 

అందుకనే వచ్చిన భక్తులను వచ్చినట్లు తిరుమలపైకి పంపేస్తున్నారు. దాంతో వైరస్ విపరీతంగా వ్యాప్తి చెందుతోంది. ఈ విషయం వాస్తవమైనా అంగీకరించటానికి టిటిడి సిద్ధంగా లేదు. తిరుమలకు వచ్చే భక్తుల్లో ఎవరికీ కరోనా వైరస్ లేదన్న మాటనే పదే పదే చెబుతోంది. భక్తుల్లో ఎవరికీ వైరస్ లేకపోతే మరి ఆలయంలో పనిచేసే అర్చకుల్లో సుమారు 15 మందికి వైరస్ ఎలా సోకిందో టిటిడి చెప్పగలదా ?  టిటిడి ఉద్యోగుల్లో సుమారు 100 మందికి కరోనా ఎలా సోకిందో టిటిడి దగ్గర ఏమన్నా సమాధానముందా ?  అసలు తిరుపతిలోని వేలాదిమందిలో  వైరస్ ఎలా పెరిగిపోతోందో టిటిడి యాజమాన్యం చెప్పగలదా ? చివరకు స్క్రీనింగ్ టెస్టులు చేసే ఉద్యోగులకు కూడా వైరస్ సోకటంతో టెస్టింగులు కూడా నిలిపేశారంటే పరిస్ధితి అర్ధమవుతోంది.

 

తిరుమలకు వస్తున్న భక్తుల్లో ఎక్కువగా తెలంగాణా, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్రల నుండే వస్తుంటారన్న విషయం అందరికీ తెలిసిందే. దేశంలో వైరస్ ఎక్కువున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణా ప్రముఖంగా ఉన్నాయి. మరి ఇలాంటి రాష్ట్రాల నుండి వస్తున్న భక్తల నుండి తిరుపతిలోని వాళ్ళకో లేకపోతే తిరుమలలోని వాళ్ళకో వైరస్ సోకుంటుందనటంలో సందేహమే లేదు. అందరికీ తెలిసిన వాస్తవాలను అంగీకరించటానికి టిటిడి యాజమాన్యం ఎందుకు సిద్ధంగా లేదో ?  చివరకు వైరస్ బాధలను తట్టుకోలేకే చివరకు తిరుచానూరులో లాక్ డౌన్ పెట్టేసుకున్నారు. ఆలయం తప్ప మిగిలిన ప్రాంతాల్లో చాలాభాగం లాక్ డౌన్ లోకి వెళిపోయింది. శ్రీకాళహస్తి గురించి కొత్తగా చెప్పాల్సిన పనేలేదు. కాబట్టి తిరుపతిలో కరోనా వైరస్ పెరిగిపోతోందంటే అది టిటిడి పుణ్యమనే చెప్పాలి. మళ్ళీ తిరుమలలో శ్రీవారి దర్శనాలను నిలిపేస్తే కానీ తిరుపతిలో వైరస్ సమస్య తగ్గేలా లేదు.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: