రైతు బాంధ‌వుడు.. రాజ‌కీయ రుషి.. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి. రాజ‌కీయంగానే కాకుండా.. త‌న పాల‌న ద్వారా.. త‌న సంచ‌ల‌న నిర్ణ‌యాల ద్వారా.. వెనుక‌డుగు వేయ‌ని వ్య‌క్తిత్వం ద్వారా ప్ర‌తి మ‌నిషి మ‌న‌సులోనూ చోటు సంపాయించుకున్నారు. కేవ‌లం ఐదేళ్ల పాల‌నే పూర్తిగా చేసినా.. కొన్ని త‌రాల వ‌ర‌కు ఆయ‌న త‌న పేరు చ‌రిత్ర‌లో నిలిచిపోయేలా చేసుకున్నారు. అయితే, ఎంతైనా ఆయ‌న కూడా మ‌నిషే. ఆయ‌న‌కు స‌ర‌దాలు.. సంతోషాలు కామ‌నే! మ‌రీ ముఖ్యంగా రాజ‌కీయాల్లో ఉండేవారికి ఒత్తిళ్లు ఎక్కువ‌. ఎన్నో ఆటుపోట్ల‌ను ఎదుర్కోవాలి. ఇలాంటి స‌మ‌యంలో ఆయా ఒత్తిళ్ల నుంచి బ‌య‌ట ప‌డేందుకు చిన్న‌పాటి అల‌వాట్లు కామ‌న్‌గా ఉంటాయి. 


ఎక్క‌డో ఒక‌రిద్ద‌రు పీవీ న‌ర‌సింహారావు, మ‌న్మోహ‌న్‌సింగ్‌, న‌రేంద్ర మోడీ వంటివారు త‌ప్ప‌.. చాలా మందికి ఏదో ఒక అలవాటు ఉంది. అలాంటి అల‌వాటే.. దివంగ‌త వైఎస్ రాజశేఖ‌ర‌రెడ్డికి కూడా ఒక‌టి ఉంది. అయితే, ఆ అలవాటు ఆయ‌నకు స్కూల్ డేస్ నుంచి ఉండ‌డం గ‌మ‌నార్హం. అదే.. సిగ‌రెట్ స్మోకింగ్‌. ఆయ‌నే ఓసారి ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో పాత్రికేయుడు ఎంజే అక్బ‌ర్‌కు ఈ విష‌యాన్ని చెప్పుకొచ్చారు. ``నాకు 11 ఏళ్ల వ‌య‌సు నుంచి స్మోకింగ్ అల‌వాటుంది. అది రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన త‌ర్వాత మ‌రింత పెరిగింది. టెన్ష‌న్లు, ఇత‌ర‌త్రా స‌మ‌స్య‌లు ఎక్కువ‌గా ఉన్న విష‌యం మీకు తెలియంది కాదు. అయితే, ఆ త‌ర్వాత స్మోకింగ్ మానుకున్నాన‌నుకోండి!`` అని వైఎస్ తెలిపారు. 

 

వైఎస్‌కు ఉన్న ఈ చిన్న‌పాటి అల‌వాటు గురించి ఆయ‌న స‌తీమ‌ణి వైఎస్ విజ‌య‌మ్మ.. తాను స్వ‌యంగా రాసుకున్న ``నాలో.. నాతో.. వైఎస్సార్‌`` అనే పుస్త‌కంలో ప్ర‌త్యేకంగా ప్ర‌స్థావించారు. అంతేకాదు.. ఈ అల‌వాటును ఆయ‌న ఎలా మానుకున్నారో.. కూడా ఆస‌క్తిగా వివ‌రించారు. ``ఈయ‌న‌(వైఎస్‌)కు పెళ్లికాక ముందునుంచే స్మోకింగ్ చేసే అల‌వాటు ఉంది. రాజ‌కీయాల్లోకి వ‌చ్చాక టెన్ష‌న్ పెరిగ‌డం వ‌ల్లేమో.. అది ఇంకొంచెం ఎక్కువైంది. అయితే, ఎక్క‌డ ఆరోగ్యం పాడైపోతుందోన‌ని, సిగ‌రెట్ మానేయ‌మ‌ని ప‌దేప‌దే చెప్పేదాన్ని. కానీ, త‌న‌కున్న టెన్ష‌న్‌ల‌కి సిగ‌రెట్ తాగ‌డం ఒక రిలీఫ్‌గా భావించేవారేమో.. నేనెంత చెప్పినా వినేవారు కాదు. ఈ విష‌యం త‌లుచుకుంటే ఇప్ప‌టికీ కన్నీళ్లు వ‌స్తాయి`` అని విజ‌య‌మ్మ జ్ఞాప‌కాల దొంత‌ర‌ల‌ను త‌డుముకున్నారు. 


మ‌రి వైఎస్ త‌న చెడు అల‌వాటును ఎప్పుడు మానేశారు? అంటే.. ఆయ‌న కుమార్తె ష‌ర్మిలకు చిన్న వ‌య‌సులో గోళ్లు కొరికే అల‌వాటు ఉండేది. అయితే, స్వ‌త‌హాగా డాక్ట‌ర్ అయిన వైఎస్.. ``ఇలా చేయొద్ద‌మ్మా! గోళ్లు కొరికితే.. అక్కడి మ‌ట్టి క‌డుపులోకి వెళ్లి అనారోగ్యం క‌లుగుతుంది`` అని ప‌దే ప‌దే హెచ్చ‌రించేవారు. కానీ, ష‌ర్మిల వినేది కాదు. ఓరోజు.. వైఎస్ మ‌రింత గ‌ట్టిగా హెచ్చ‌రించారు. దీంతో ష‌ర్మిల ఓ ష‌ర‌తు పెట్టింది. ``డాడీ మీరు సిగ‌రెట్లు మానేస్తే.. నేను గోళ్లు కొర‌క‌డం మానేస్తాను`` అని.. దీనికి వైఎస్‌.. ``నువ్వు ఆరు నెల‌లు గోళ్లు కొర‌క‌డం మానేస్తే.. నేను సిగ‌రెట్ మానేస్తాను`` అన్నారు. దీంతో ష‌ర్మిల గోళ్లు కొర‌క‌డం మానేశారు. ఆ త‌ర్వాత ఆరు మాసాల‌కు కూతురుకు ఇచ్చిన మాట ప్ర‌కారం.. వైఎస్ సిగ‌రెట్ తాగ‌డం మానేశారు. అది కూడా ఒక్క‌సారిగా అల‌వాటును త్య‌జించారు. 


నిజానికి ఎలాంటి చెడు అల‌వాటైనా.. మానుకునేందుకు చాలా స‌మ‌యం ప‌డుతుంది. కానీ, వైఎస్ విష‌యంలో అది నిజం కాద‌ని నిజ‌మైంది. ఆయ‌న మానేయాల‌ని అనుకున్న వెంట‌నే మానేశారు. ఈ విష‌యాన్ని విజ‌యమ్మ ప్ర‌త్యేకంగా ప్ర‌స్థావించ‌డంతోపాటు.. వైఎస్ ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డ‌తారనే విష‌యం.. అది ఎంత చిన్న‌దైనా.. పెద్ద‌దైనా.. చేసి చూపిస్తార‌నే విష‌యం త‌లుచుకుని త‌లుచుకుని క‌న్నీళ్లు పెట్టుకుంటార‌ట‌! సో.. ద‌టీజ్ వైఎస్సార్‌..!!

 

మరింత సమాచారం తెలుసుకోండి: