వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ వ్యాప్తంగా సుదీర్ఘ పాదయాత్ర చేసి, పేదలకు అండగా, నవరత్నాల హామీలను కలిపి మేనిఫెస్టోను రూపొందించారు. ఇక ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, హామీలపై ప్ర‌మాణ‌స్వీకారం చేసే రోజే సంత‌కం చేయ‌బోతున్నారు జ‌గ‌న్. ఆ హామీల‌ అమలు చేసే దిశగా ప్రయత్నాల‌కు శ్రీ‌కారం చుట్టబోతున్నారు. అయితే అందులో హాట్ టాపిక్‌గా మారిన హామీ.. మ‌ద్య‌పాన నిషేధం. 
అధికారంలోకి రాగానే మూడు దశల్లో పూర్తి మద్యపాన నిషేదం చేస్తానని త‌న పాద‌యాత్ర స‌మ‌యంలోనే సంచలన ప్రకటన చేశారు జగన్. తొలి దశలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బెల్ట్ షాపులపై ఉక్కుపాదం మోపుతామని.. రెండో దశలో మద్యపానం వలన కలిగే నష్టాలను ప్రజలకు తెలియజేసే విధంగా ప్రభుత్వం తరపున క్యాంపైన్ నిర్వహిస్తామని.. చివరి దశలో మద్యంరేట్లను విపరీతంగా పెంచుతామ‌ని, పేద‌ల జీవితాల్లోకి మ‌ద్యం రాకుండా చేస్తామ‌ని జ‌గ‌న్ హామీ ఇచ్చారు. ప్రభుత్వానికి అతిపెద్ద ఆదాయ వనరైనప్పటికీ రిస్క్ తీసుకుని మద్యం రేట్లను పెంచుతామని చెబుతూ, మద్యం తయారు చేసినా, అమ్మినా ఏడేళ్ల శిక్ష విధించేలా చట్ట సవరణ చేస్తామని అప్ప‌ట్లో స్పష్టం చేశారు.
 Image result for jagan padayatra
మూడు ద‌శ‌ల్లో మ‌ద్యాన్ని నిషేధించేందుకు రిహాబిలిటేష‌న్ సెంట‌ర్లు స‌హా అవ‌స‌ర‌మైన అన్నీ చ‌ర్య‌లు చేప‌ట్ట‌డ‌మే కాకుండా అందుకు కోసం కొత్త చ‌ట్టంతో పాటు ప్ర‌త్యేక యంత్రాగాన్ని సైతం ఏర్పాటు చేయ‌బోతోంది జ‌గ‌న్ స‌ర్కార్. మూడు ద‌శ‌ల్లో మద్యపాన నిషేధ ప్ర‌క్రియ కొన‌సాగిస్తూ, 2024 నాటికి పూర్తిగా నిషేధం విధిస్తామ‌ని, సంపూర్ణ మధ్య నిషేధం అమలు చేసిన తర్వాతే 2024లో ఓట్లు అడిగేందుకు మళ్ళీ మీ వద్దకు వస్తా.. అంటూ జ‌గ‌న్ ప‌లుమార్లు హామీలు ఇచ్చారు. మ‌ద్య‌పాన నిషేధ హామీని న‌వ‌ర‌త్నాల్లో కూడా చేర్చారు. అయితే మ‌ద్య‌పాన నిషేధం అమ‌లు చేసే అంశం ఇప్పుడు రాష్ట్రంలో చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది.

Image result for ntr liquor ban

గ‌తంలో మ‌ద్య‌పాన నిషేధం అమ‌లు చేశారు అప్ప‌టి ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్. ఎన్నిక‌ల‌కు ముందు హామీ ఇచ్చిన‌ట్టుగానే ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన రోజే, 1994లో మద్య నిషేధాన్ని విధించారు. 1995 జూన్ 1 నుంచి సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తున్నట్లుగా ప్రకటించారు. అయితే, అమల్లోకి వచ్చే సరికి విఫలమయ్యారు. ప‌క్క రాష్ట్రాల నుంచి మ‌ద్యం ఏరులైపారింది. రాష్ట్రంలోకి మ‌ద్యం రాకుండా ఆప‌డం స‌వాల్‌గా మారింది. ఆ త‌ర్వాత ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ చంద్ర‌బాబు నాయుడు మ‌ద్య‌పాన నిషేదాన్ని ఎత్తివేశారు. 

Image result for liquor ban

ఇక చాలా కాలం త‌ర్వాత ఇప్పుడు మ‌ద్య‌పాన నిషేదం హామీని జ‌గ‌న్ తీసుకురావ‌డం చ‌ర్చ‌గా మారింది.   ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి సరిహద్దుగా ఉన్న తెలంగాణ‌, కర్నాటక, తమిళనాడు, పాండిచ్చేరి.. వంటి రాష్ట్రాల‌ల్లో మద్యంపై నిషేధం లేనపుడు ఏపీలో అమలు ఎంత‌వ‌ర‌కు సాధ్యమ‌వుతుంద‌న్న చ‌ర్చ సాగుతోంది. అంతేకాదు ప్ర‌ధానం చెప్పాలంటే రెవెన్యూపరంగా ఏపీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ కొత్త ఆదాయ మార్గాలను రూపొందించడంలో విఫలమైంది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఎక్కువ ఆదాయం వస్తున్నది మద్యం అమ్మకాల నుంచే సమకూరుతోంది. ఫలితంగా రెవెన్యూ లోటు కొంత వరకు తీరుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మద్య నిషేధం విధిస్తే రాష్ట్ర ఆదాయం రుణంగా పడిపోయి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు భారీ గండిపడుతుంది. అదే జరిగితే బొటాబొటి నిధులతో రాష్ట్రాన్ని నెట్టుకురావడం అంత ఈజీకాదు.. అనే చ‌ర్చ కూడా ఉంది. అయితే మ‌ద్య‌పానాన్ని నిషేదిస్తే దానికి ప్ర‌త్యామ్నాయ అద‌న‌పు ఆదాయ వ‌న‌రుల‌ను సృష్టించాల్సి ఉంది. అప్పుడే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇచ్చిన మాట ప్రకారం మద్య నిషేధం అమలు చేయడం సాధ్యమవుతుంది. 
మ‌ద్య‌నిషేదం అమ‌లు ప‌టిష్టంగా ఉంటే మ‌ద్య‌త‌ర‌గ‌తి, పేద కుటుంబాలు చిన్నాభిన్నం కాకుండా సంతోషంగా ఉంటార‌ని చెప్ప‌వ‌చ్చు. అయితే మ‌ద్య‌పాన నిషేధాన్ని ద‌శ‌ల‌వారీగా అమ‌లు చేయ‌డం కూడా స‌రైన విధాన‌మేన‌ని చెప్పొచ్చు. 


మరింత సమాచారం తెలుసుకోండి: