వ్యక్తి ప్రగతికే కాదు, యావ‌త్ జాతి నిర్మాణానికి, పురోగతికి కూడా విద్య పునాది వంటిది. అందువల్ల విద్యా వ్యవస్థను బలోపేతం చేసుకుంటే దేశ ఆర్థిక పురోగమనం జరుగుతుంది. ప్రపంచమంతా ఒక గ్రామంగా మారిన నేపథ్యంలో ప్రతి విద్యార్థీ గ్లోబల్‌ నైపుణ్యాలు అలవర్చుకోవాలి. ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా పనిచేసే సామర్థ్యాన్ని, సన్నద్ధతను విద్యార్థికి కల్పించే బాధ్యతను ఉన్నత విద్యా సంస్థలే తీసుకోవాలి.
Related image
మన విద్యార్థులకు అకడమిక్‌ సమస్యలు పెద్దగా లేనప్పటికీ ప్రపంచ దేశాల సంస్కృతిపై అవగాహన లేకపోవడంతో వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చదువంటే కేవలం టెక్ట్స్‌బుక్‌ను విద్యార్థి మెదడుకు సరఫరా చేయడం కాదు.. కొత్త జ్ఞానాన్ని సృష్టించడం. అందువల్ల కేవలం పుస్తకాల్లో రాసేదే చెప్పే మూస పద్ధతులకు ఉపాధ్యాయులు స్వస్తి చెప్పాలి. అప్పుడే విద్యార్థి మానసిక వికాసం పెరుగుతుంది. నిజమైన విద్య అంటే అన్ని విషయాల్లో వికాసం చెందడమే. వ్యాయామం, ఆటలు-పాటలు, ప్రయోగాలు, వృత్తి విద్య తర్ఫీదులు, సృజనాత్మక కార్యక్రమాలు, శాస్త్రీయ దృక్పథం, ముఖ్యంగా నైతిక విలువలు, సామాజిక స్పృహ ఇవన్నీ కలిస్తేనే. ఇలాంటి వెలుగుల చదువులు ఎక్కడ కనిపిస్తున్నాయి. 

విద్యార్థులను బయటి ప్రపంచంతో అనుసంధానిస్తూ వర్తమాన, ప్రాపంచిక విషయాలను బోధించే దిశగా విద్యాబోధన జరగాలి. గ్లోబల్‌ సాంకేతికతకు అనుగుణంగా నైపుణ్యాలను విద్యార్థుల్లో పెంపొందించడం ద్వారా ఉపాధి అవకాశాలు పెంపొందించుకోవచ్చు. అందుకోసం ఉన్నత విద్యాసంస్థల్లో కొత్త బోధనా నైపుణ్యాలను ప్రోత్సహించాలి. విద్యార్థుల అకడమిక్‌ ఫ్రీడమ్‌ను కాపాడాలి. అప్పుడే వారు తమ భావాలను స్వేచ్ఛగా ఇతరులతో పంచుకొనే వీలు కలుగుతుంది. 

Related image

యంత్ర విద్య‌
కార్పోరేట్ విద్య స‌మాజానికి పెద్ద స‌మ‌స్య‌గా మారింది. పిల్లలను బాగా చదివించాలనే తపన, ఆరాటం సమాజంలో పెరగటం సానుకూలమైన అంశం కాగా, విద్యారంగం పెద్ద ఎత్తున కార్పొరేటీకరణ చెందటం ప్రతికూల అంశంగా కనబడుతోంది. గత రెండు దశాబ్దాలుగా విద్యారంగ కార్పొరేటీకరణ, ప్రైవేటికరణ విద్యాసంస్థల మధ్య అనారోగ్యకరమైన పోటీకి దారి తీసింది. విద్యార్థులు సాధించే మార్కులు, గ్రేడులే విద్యా మార్కెట్‌లో తమ ఉనికిని పెట్టుబడులని గ్రహించారు. విద్యార్థులపై చదవాలనే ఒత్తిడి పెంచారు. ఉదయం నాలుగు గంటలకే నిద్రలేచి, రాత్రి పది గంటల వరకు క్షణం తీరిక లేకుండా క్లాసులు, స్టడీ అవర్స్‌తో విద్యార్థులు కుస్తీ పడుతున్నారు, ఒత్తిడికి గుర‌వుతున్నారు. డే-స్కాలర్స్‌గా ఉండే పిల్లలు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు ఆ పాఠశాలలోనే గడపాలి. త‌మ బ్రాండ్ అంబాసిడ‌ర్‌లు అన్న‌ట్టుగా కార్పోరేట్ విద్యా సంస్థ‌లు విద్యార్థుల‌ను యంత్రాల్లా త‌యారు చేస్తున్నాయి. 

Image result for corporate education in india

చదువులు, ర్యాంకుల పేరుతో పిల్లలను వేధించే తల్లిదండ్రులు, మ‌న విద్యావ్య‌వ‌స్థ వ‌ల్ల పిల్ల‌లు ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందో అనే విష‌యాన్ని తెలుగులో విడుద‌ల కాబోతున్న‌ ‘ఫస్ట్ ర్యాంక్ రాజు’ సినిమా ట్రైల‌ర్ చూపించింది. తాజాగా విడుద‌లైన ఫస్ట్ ర్యాంక్ రాజు ట్రైల‌ర్ లో ప్రస్తుత విద్యావ్యవస్థలోని ప్ర‌ధాన‌లోపాన్ని ఎత్తి చూపిన‌ట్టు క‌నిపిస్తోంది. ఈ మూవీ నరేష్ తన కొడుకైన రాజు భవిష్యత్ బాగుండాలని చిన్నప్పటినుండి పుస్తకాలే ప్రపంచంగా, ర్యాంక్ లే లక్ష్యంగా సామజిక అంశాలపై, మంచి చెడులపై అవగాహన లేకుండా పెంచుతాడు. అలా పెరిగిన రాజు సొసైటీలో చాలా అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. చివరికి జాబ్ విషయంలో కూడా ర్యాంక్ కాదు, జనరల్ నాలెడ్జ్ అవ‌స‌ర‌మ‌ని తెలుస్తుంది. ''నీలాంటి ఫ‌స్ట్ ర్యాంక్ స్టూడెంట్ అయినా, నాలాంటి బ్యాక్ బేంచ్ స్టూడెంట్ ద‌గ్గ‌రికే జాబ్ కోసం రావాలి..'' అంటూ ఈ ట్రైల‌ర్‌లో ప్ర‌కాష్ రాజ్ ప్ర‌స్తుత విద్యావ్య‌వ‌స్థ‌పై తిరుగుని బాణం వ‌దులుతాడు.  
తల్లిదండ్రులు పిల్లల ఆసక్తి, అభిరుచికి అనుగుణంగా చదివిస్తే, ఒత్తిడికి గురికాకుండా ఉంటారు. పిల్లలు క్రీడలు, ఆటలు, పాటలు మొదలైన వాటిల్లో పాల్లోనే విధంగా ప్రోత్సాహించాలి. ఎటువంటి పాఠశాలల్లో 'సమగ్ర విద్య' అందుతుందో పరిశీలించాలి. ప్రతిరోజు కొంత సమయాన్ని వెచ్చించి పిల్లలతో గడపాలి. బట్టీ విధానం, గ్రేడ్‌లు, మార్కుల ప్రాధాన్యత ఇవ్వకుండా, విషయపరిజ్ఞానం, విశ్లేషణాసామర్థ్యం, సమగ్ర దృక్పథం కల్పించే పాఠశాలలకు ప్రాధాన్యత ఇవ్వాలి. విద్యారంగం సృజనాత్మకమైనది. గాంధీ, అరబిందో, వివేకానందుడు, రవీంద్రనాధ్‌ఠాగూర్‌, జిడ్డుకృష్ణమూర్తి, గిజుభారు వంటి అనేకమంది విద్యారంగ సృజనాత్మకతను విద్య గొప్పతనాన్ని వివరించారు. 

Related image

 విద్యను అంగడి సరకుగా మార్చే ప్రైవేటు యాజమాన్యాలు కూడా ప్రభుత్వాలను తప్పుదోవపట్టిస్తూ ప్రభుత్వ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేస్తున్నాయన్నది స‌త్యం. ప్రభుత్వ విద్యా వ్యవస్థ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో మొత్తం విద్యా వ్యవస్థను త‌క్ష‌ణం సంస్కరించుకోవాల్సి అవ‌స్య‌కత ఆస‌న్న‌మైంది. 


ప్రస్తుత ఉన్నత విద్యా వ్యవస్థ దేశంలో అత్యధికశాతం ప్రజలకు అనుగుణంగా లేదు. కొద్దిశాతం మంది ధనవంతులకు మాత్రమే నాణ్యతతో కూడిన విద్య అందుతోంది. ఈ నేపథ్యంలో పేదలకు నాణ్యమైన విద్యను అందించాల్సిన బాధ్యత ఆయా ప్రభుత్వాలపైనే ఉంది. విద్యతోనే వారి జీవితాల్లో వెలుగులను ప్రసరింపచేసే వీలుంటుంది. ఎన్ని ప్రభుత్వ పథకాలు ప్రవేశపెట్టినా. పేదలకు నాణ్యమైన విద్యను అందించకపోతే దేశం తిరోగమనం చెందడమే తప్ప ఎప్పటికీ అభివృద్ధి చెందదనే విషయం పాలకులకు కొత్తగా చెప్పనక్కర్లేదు. దేశంలో అణగారిన వర్గాల ప్రజలు అప్పులు చేసి చదువును కొనుక్కుంటున్నారు. తమ కష్టార్జితాన్నంతా నాణ్యమైన విద్య కోసం ప్రయివేటు విద్యా సంస్థలకు ధారాదత్తం చేస్తున్నారు. 


      ఎంతో దూరదృష్టితో దేశంలో గొప్పగా ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వ విద్యావ్యవస్థను చిత్తశుద్ధితో ప్రక్షాళన చేస్తే, దేశంలో బడుగు, బలహీనవర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుంది. వారి పిల్లలు చక్కగా చదువుకుంటారు. దీంతో కుటుంబాల్లో కొత్త జీవన రేఖలు ప్రసరించే వీలుంటుంది. వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. తద్వారా దేశ ఆర్థిక వృద్ధిరేటును సాధించవచ్చు. 


మరింత సమాచారం తెలుసుకోండి: