అల్లారుముద్దుగా పెంచుకుంటున్న పెంపుడుకుక్క చనిపోవడంతో ఓ కుటుంబం ఆ జ్ఞాపకాలను మరిచిపోవడానికి ఇంటినే ఖాళీ చేసి మరో చోటికి షిఫ్ట్‌ అయ్యారు. శ్రీనగర్‌కాలనీలోని క్రియేటివ్‌ సదన్‌ అపార్ట్‌మెంట్స్‌లో నివసించే కామిరెడ్డి సంతోష్‌ అనే యువకుడు ఫిలిం ఎడిటర్‌గా పనిచేస్తున్నాడు. ఆయనతోపాటు ఆయన తల్లి లక్ష్మీపద్మావతి, తండ్రి కన్నా, సోదరి ప్రియాంక పదేళ్లుగా ఓ శునకాన్ని (లక్కీ) పెంచుకుంటున్నారు.

కుటుంబసభ్యులందరికీ లక్కీ అంటే మమకారమెక్కువ.ఈ నెల 6న కుక్క అనారోగ్యానికి గురైంది.చికిత్స చేయించినా కోలుకోలేకపోగా కన్నుమూసింది. దీంతో ఆ కుటుంబం తట్టుకోలేకపోయింది. కుక్కకు పంజాగుట్టలో ఖననం చేశారు. తాజాగా   దశదిన ఖర్మ కూడా నిర్వహించి వివిధప్రాంతాల్లో వందకు పైగా కుక్కలకు ఆహారం అందించారు. కుక్క భారీ ఫోటోను ఏర్పాటు చేసి నివాళి కూడా అర్పించారు. అదే ఇంట్లో ఉంటే జ్ఞాపకాలను మరిచిపోలేకపోతున్నామని భావించిన సంతోష్‌ రెండు రోజుల క్రితం శ్రీనగర్‌కాలనీలో ఇల్లు ఖాళీ చేసి మధురానగర్‌కి షిఫ్ట్‌ అయ్యారు.

తనపై కుక్క దాడి చేసేందుకు యత్నించిందని కక్షపెంచుకున్న ఓ వ్యక్తి దానిని అతి కిరాతకంగా చంపేశాడు. విచిత్రమేమంటే దానిని పెంచుకుంటోంది నిందితుడి సోదరే. ఓయూ పోలీసుస్టేషన్‌ పరిధిలోని లాలాపేటలో ఈ ఘటన జరిగింది. ఎస్‌ఐ నర్సింగరావు తెలిపిన మేరకు.. ఎన్‌జీఆర్‌ఐ ఉద్యోగి రమాదేవి తన తల్లి యాదమ్మతో కలిసి లాలాపేట వినోభానగర్‌లో నివాసముంటోంది. అదే ఇంట్లో కింద పోర్షన్‌లో ఆమె అన్న నాగరాజు(40)తన భార్యస్వప్న నివాసముంటున్నారు. నాలుగేళ్ల క్రితం యాదమ్మ లాలాపేటలో ఉన్న 75 చదరపు గజాల విస్తీర్ణం  కలిగిన తన ఇంటిని కూతురు రమాదేవి పేరున రిజిస్ట్రేషన్‌ చేసింది. అప్పటినుంచి అన్నాచెల్లెళ్ల మధ్య గొడవలు జరుగుతున్నాయి.

ఈనెల 12న చిత్తుగా మద్యం తాగిన నాగరాజు ఇంటికివచ్చి తన చెల్లెలు, తల్లితో  గొడవకు దిగాడు. వారిపై దాడికి యత్నించగా రమాదేవి పెంచుకున్న పెమేరియన్‌జాతి కుక్క అతనిపై దూకే  ప్రయత్నంచేసింది. దీంతో కక్షపెంచుకున్న నాగరాజు ఈనెల 18న ఇంటిముందు కట్టేసిన కుక్క మెడపై కాలుపెట్టి నలిపి అతికిరాతంగా చంపాడు. కుక్కఅరుపులు విన్న రమాదేవి పై నుంచి  వచ్చిచూడగా, నాగరాజు కుక్కను చంపిదానిపై  కూర్చున్నాడు. దీంతో ఆమె కంపాసినేట్‌ సొసైటీ సభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుక్క శవాన్ని  స్వాధీనంచేసుకుని పోస్టుమార్గంనిమిత్తం నారాయణగూడలోని పశువైద్యశాలకు  పంపించారు. రమాదేవి ఫిర్యాదుమేరకు  నాగరాజును అరెస్టు చేసి కేసు   దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నర్సింగరావు తెలిపారు


మరింత సమాచారం తెలుసుకోండి: