ఏ స్కూలు ప్రవేశం కావాలన్నా.. ఇప్పుడు ఎంట్రన్స్ టెస్టులంటూ కొత్త సంస్కృతి మొదలైంది. మరీ దారుణం ఏంటంటే.. నర్సరీ నుంచే ఈ జాడ్యం మొదలవుతోంది. అందుకే..ప్రీ-స్కూళ్లలో చేరే చిన్నారులకు ఎలాంటి రాతపూర్వక, మౌఖిక పరీక్షలు నిర్వహించరాదని- నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.. ఎన్సీఈఆర్టీ స్పష్టం చేసింది.


ప్రాథమిక విద్యాభ్యాసం ప్రారంభదశలోనే ఓ పిల్లవాడిని పాస్ లేదా ఫెయిల్ అని తేల్చే విధానం సరైంది కాదని ఎన్సీఈఆర్టీ చెబుతోంది. ఇలాంటి దారుణమైన విధానాల వల్ల ప్రీస్కూల్ కు వెళ్లే చిన్నారులు నిస్తేజంగా మారుతున్నారని ఎన్సీఈఆర్టీ అభిప్రాయపడింది.


లేత వయస్సులోనే టెస్టులు , హోంవర్క్ పేరుతో చిన్నారులు ఆటలకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. పిల్లలు గొప్పవాళ్లు కావాలని ఏ తల్లిదండ్రి అయినా కోరుకుంటారు. కానీ తల్లిదండ్రుల ఆకాంక్షలను తప్పుదారి పట్టించే అనుచితమైన, హానికరమైన విధానాలు అభిలషణీయం కాదని ఎన్సీఈఆర్టీ చెప్పింది.


అందుకే ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కు సంబంధించిన మార్గదర్శకాల్లో భాగంగా చిన్నారుల్లోని నైపుణ్యాలను అంచనా వేసేందుకు కొన్ని సూచనలు చేసింది. చెక్ లిస్ట్ లు, తోటివారితో మాట్లాడే విధానం తదితర అంశాల ఆధారంగా చిన్నారుల ప్రగతిని అంచనా వేయాలని సూచించింది. అంతకుమించి పరీక్షలు అంటూ వేధిస్తే.. ఆ విద్యాసంస్థలపై చర్యలు ఉంటాయని తెలిపింది.


మరింత సమాచారం తెలుసుకోండి: