ఏపీలో ఉపాధ్యాయ పోస్టుల నియామక ప్రక్రియలో భాగంగా టెట్‌, డీఎస్సీలు వేర్వేరుగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఈ నెలలో టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసి, జనవరి చివరి వారం లేదా ఫిబ్రవరి మొదటి వారంలో పరీక్షలు నిర్వహించే అవకాశముంది. టెట్‌ నోటిఫికేషన్‌ విడుదలైనప్పటి నుంచి పరీక్షలకు కేవలం 45 రోజులే సమయమిస్తారు. టెట్‌ ఫలితాల అనంతరం డీఎస్సీ-2020 నోటిఫికేషన్‌ను మార్చిలో విడుదల చేసి, ఏప్రిల్‌/మేలో పరీక్షల్ని నిర్వహిస్తారని సమాచారం. విద్యాహక్కు చట్టం ఆధారంగా ఉపాధ్యాయ శిక్షణ పొందిన అభ్యర్థులంతా టెట్‌లో తప్పనిసరిగా అర్హత సాధించాలి. 2014లో టెట్‌, డీఎస్సీల సిలబస్‌ను కలిపి ఒకే పరీక్షను(టెట్‌ కమ్‌ టీఆర్టీని) నిర్వహించడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ ఉమ్మడి పరీక్ష ప్రభావంతో గత టెట్‌లలో అర్హత సాధించి, వెయిటేజీ మార్కులు పొందిన అభ్యర్థులు నష్టపోయారు. డీఎస్సీ-2018కి టెట్‌, డీఎస్సీ పరీక్షలు(ఒక్క ఎస్జీటీ మినహా) వేర్వేరుగా నిర్వహించారు. రాబోయే నోటిఫికేషన్లలో ఎస్జీటీలకు సైతం టెట్‌, డీఎస్సీలు వేర్వేరుగా నిర్వహిస్తారని తెలిసింది. తొలిసారిగా 2011లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం టెట్‌ను నిర్వహించింది. అప్పటి నుంచి ముందు టెట్‌, ఆ తర్వాత డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తోంది. జనవరిలో నోటిఫికేషన్లు ఇవ్వాలని అధికారులను జగన్‌ ఆదేశించిన విషయం విదితమే.

విద్యాహక్కు చట్టం ఆధారంగా టెట్‌, డీఎస్సీ నోటిఫికేషన్లను ప్రభుత్వం వేర్వేరుగా నిర్వహించనుంది. గతంలో వచ్చిన న్యాయపరమైన సమస్యల్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ముందస్తుగా టెట్‌, ఆ తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్లు విడుదలవుతాయి. ఉపాధ్యాయ పోస్టులకు అభ్యర్థి దరఖాస్తు చేయాలంటే..సంబంధిత సబ్జెక్టులో ఉపాధ్యాయ శిక్షణా కోర్సుల్ని పూర్తి చేయాలి. ఆ తర్వాత తప్పనిసరిగా టెట్‌లో అర్హత సాధించాలి. టెట్‌లో అర్హత సాధించిన వారే..డీఎస్సీకి దరఖాస్తు చేసేందుకు అర్హులవుతారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 4లక్షల మంది టెట్‌లో అర్హత సాధించిన వారున్నారు. ఒక్కసారి టెట్‌లో అర్హత సాధిస్తే..అది ఏడేళ్ల వరకు అమలులో ఉంటుంది. అర్హత సాధించిన అభ్యర్థులంతా వెయిటేజీ మార్కుల కోసం మళ్లీ టెట్‌ రాసుకోవచ్చు. టెట్‌ క్వాలిఫై అయిన అభ్యర్థి మళ్లీ టెట్‌ రాస్తే గతం కంటే మార్కులు పెరిగితే అవి, తగ్గితే పాత మార్కుల్నే ఉంచుతారు.

డీఎస్సీలో పోస్టులెన్ని ..!
రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు 25వేల నుంచి 30వేల వరకు ఉండే అవకాశముంది. ప్రభుత్వం దాదాపు 15వేల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ ఇస్తుందని తెలిసింది. ఐదేళ్ల నుంచి డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ నియామక ప్రక్రియను సజావుగా నిర్వహించడం లేదు. గత ప్రభుత్వం ఎన్నికల ముందు హడావుడిగా డీఎస్సీ-2018 నిర్వహించి చేతులు దులుపుకుందనే విమర్శలున్నాయి. తెలుగు, హిందీ లాంగ్వేజీ పండిట్ల పోస్టులపై అభ్యర్థులు న్యాయస్థానానికి వెళ్లడం వల్ల ఇంతవరకూ ఫలితాల్ని ప్రకటించలేదు. ఎస్జీటీ పరీక్షల నిర్వహణ తీరుపై అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. డీఎస్సీ-2018కి న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తడం, ఇంతవరకూ ఒక్క పోస్టునూ భర్తీ చేయనందున అభ్యర్థులు నిరుత్సాహానికి గురవుతున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1-6 తరగతులకు ఇంగ్లీషు మీడియాన్ని ప్రవేశపెట్టడం వల్ల ఆ మీడియం అభ్యర్థులకు అధిక ప్రాధాన్యత ఇచ్చే అవకాశముంది.

తెలుగు పండిట్లకు డిగ్రీలో తెలుగు..
ఇటీవల స్కూల్‌ అసిస్టెంట్‌(ఎస్‌ఏ)-తెలుగు ఇన్‌ సర్వీస్‌ పదోన్నతుల్లో ఎల్పీ-తెలుగు అభ్యర్థులకు సమాన విద్యార్హతలున్న ఎస్జీటీలకు అవకాశం కల్పించారు. డిగ్రీలో స్పెషల్‌ తెలుగు/సబ్జెక్టు లేకుండా ఎంఏ-తెలుగు చేసిన వారిని అనర్హులుగా ప్రకటిస్తూ ప్రభుత్వం జీవో జారీచేసింది. ఈ జీవోను రాబోయే టెట్‌, డీఎస్సీ నోటిఫికేషన్లలో తెలుగు పండిట్‌, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు వర్తింపజేసే అవకాశముంది. డీఎస్సీ-2018 తెలుగు పండిట్లు/స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు డిగ్రీలో తెలుగు లేకుండా నేరుగా ఎంఏ-తెలుగు చేసిన వారికి అవకాశం కల్పించడం వల్ల ప్రభుత్వానికి న్యాయపరమైన సమస్యలు ఎదురయ్యాయి. రాబోయే టెట్‌, డీఎస్సీలలో లాంగ్వేజీ పండిట్స్‌(ఎల్‌పీ)-తెలుగు అభ్యర్థుల విద్యార్హతల వివరాల్ని ముందస్తుగా ప్రభుత్వం స్పష్టం చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: