కేంద్ర బడ్జెట్ లో విద్య, వైద్య రంగానికి నిర్మలా సీతారామన్ భారీ నిధులు కేటాయించారు.కేంద్ర ఆర్థికమంత్రిగా రెండోసారి ఆమె శనివారం లోక్‌సభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు.  ఈ సందర్భంగా నిర్మాలా సీతారామన్‌ మాట్లాడుతూ ఈ సారి విద్య, స్కిల్‌ డెవలప్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు. ఇందులో భాగంగానే విద్యా రంగానికి రూ. 99,300 కోట్లు, వైద్య రంగానికి రూ. 69 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సారి దేశంలో కొత్త ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొస్తామని చెప్పారు. 


దేశంలో విద్యారంగాన్ని అభివృద్ధి చేసేందుకు రూ.99,300 కోట్లను కేటాయిస్తున్నట్లు చెప్పారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోసం రూ.3000 కోట్లను కేటాయించామని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. అదే విధంగా 2026 నాటికి దేశంలోని 150 యూనివర్సిటీల్లో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోసం కొత్త కోర్సులు ప్రారంభించనున్నట్లు చెప్పారు. వీటితో పాటుగా ప్రధాన యూనివర్సిటీల్లో ఆన్‌లైన్‌ డిగ్రీ కోర్సులను సైతం అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. నేషనల్ పోలీస్ యునివర్సిటి, నేషనల్ ఫోరెన్సిక్ యూనివర్సిటీలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. పట్టణ, స్థానిక సంస్థల్లో కొత్త ఇంజనీర్లకు అవకాశం ఇస్తామన్నారు. ప్రతీ జిల్లా ఆస్పత్రిలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. విద్యారంగంలోనూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతులు ఇస్తున్నామని ప్రకటించారు.భారత్‌లో చదువుకోవాలనుకునే విదేశీ విద్యార్థుల కోసం ఇన్సాట్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.


 
మరో వైపు వైద్య రంగానికి సైతం మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో పెద్ద పీట వేశారు. ఈ రంగానికి మొత్తం రూ. 69 వేల కోట్లు కేటాయిస్తున్నట్టు చెప్పారు. ప్రధాని జన యోజనకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. 2౦25వ సంవత్సరం నాటికి దేశంలో క్షయ వ్యాధిని నిర్మూలించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. జిల్లా ఆస్పత్రులుగా మెడికల్ కాలేజీలు ఉంటాయని ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: