ఇటీవ‌ల మంత్రి ఆదిమూలపు సురేష్ టెన్త్ పరీక్షల షెడ్యూల్‌ను స్వయంగా ప్రకటించిన సంగ‌తి తెలిసిందే. విడుద‌ల చేసిన ష‌డ్యూల్ ప్రాక‌రం.. ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షలు ఈ నెల 23వ తేదీ నుంచి ఏప్రిల్‌ 8వ తేదీ వరకు జరగాల్సి ఉంది. కానీ, ఇప్పుడు ఏపీలో టెన్త్ ప‌రీక్ష‌లు వాయిదా ప‌డ‌నున్నాయి. ఎందుకంటే.. ప్ర‌స్తుతం జగన్ సర్కార్  స్థానిక సంస్థల ఎన్నికల దిశగా అడుగులు వేస్తోంది. రిజర్వేషన్లలను ఒక్కొక్కటిగా ఖరారు చేస్తోంది. ప్రభుత్వం జిల్లా పరిషత్ లకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. 

 

ఈ క్ర‌మంలోనే  స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటేందుకు అధికార, విపక్షాలు రెడీ అవుతున్నాయి. అయితే పదో తరగతి పరీక్షలు, ఎన్నికలు ఒకే సమయంలో రావ‌డంతో ప‌లు ఇబ్బందుల దృష్ట్య ప‌రీక్ష‌లు వాయిదా వేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన‌ట్టు తెలుస్తోంది. అలాగే శనివారం ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమార్ వెల్ల‌డించారు. ఈ నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు వాయిదా వేసుకుంటున్నట్లు బోర్డు అధికారులు చెప్పారని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేష్ కుమార్ తెలిపారు. 

 

వివిధ రాజకీయ పార్టీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సమావేశం నిర్వహించిన ఆయన.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. మ‌రోవైపు ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ, మ‌రో రెండు మూడు రోజుల్లో మాత్రం కొత్త తేదీలను ఖరారు చేశాక ప్రభుత్వం దీనిపై ప్రకటన చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అయితే అందుతున్న స‌మాచారం ప్ర‌కారం.. పదో తరగతి పరీక్షలను ఏప్రిల్ నెలలో నిర్వహించే అవకాశముంది.

 

  

మరింత సమాచారం తెలుసుకోండి: