క‌రోనా వైర‌స్‌.. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల‌ను వ‌ణికిస్తూ.. ప్ర‌జ‌ల‌ను కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. చైనాలో పుట్టుకొచ్చిన ఈ వైర‌స్ ఇప్ప‌టికే అనేక మంది ప్రాణాల‌ను బ‌లి తీసుకుంది. ఇక రోజురోజుకు క‌రోనా పాజిటివ్ సైతం లెక్క‌కు మిక్కిలిగా పెరిగిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సైతం క‌రోనా పంజా విసురుతోంది. ముఖ్యంగా ఏపీలో క‌రోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ ఒక్కరోజే 43 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 87కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం వెల్ల‌డించారు.

 

అయితే క‌రోనా విస్త‌రిస్తున్న నేప‌థ్యంలో స్కూల్స్ మూసేయ‌డంతో పాటు  పదో తరగతి పరీక్షలు వాయిదాపడ్డాయి. వాస్తవానికి పరీక్షలు మార్చి 31 నుంచి ఏప్రిల్‌ 17 వరకు నిర్వహించాల్సి ఉంది. పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లును అధికారులు చేస్తున్నారు. కానీ పరిస్థితులు మారిపోవడం.. ఏపీలో లాక్‌డౌన్ ప్రకటించడంతో వాయిదా నిర్ణయం తీసుకున్నారు. ఈ నేప‌థ్యంలోనే 10వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను రాబోయే రెండు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇక పదో తరగతి పరీక్షలు వాయిదా పడటం ఇది రెండోసారి. 

 

దీంతో ఏపీలో 10వ త‌రగ‌తి ప‌రీక్ష‌లు లేకుండానే డైరెక్ట్ పాస్ చేస్తారు.. అనే వార్త ప్ర‌స్తుతం జోరుగా వైర‌ల్ అవుతోంది. అయితే తాజాగా ఈ వార్త‌ను ఏపీ ప్రభుత్వం ఖండించింది. మంత్రి ఆదిమూలపు సురేష్ తాజాగా మీడియాతో మాట్లాడారు.. పరీక్షలను కచ్చితంగా నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు. పరీక్షలు జరగవంటూ వస్తున్న వార్తలను నమ్మవద్దని ఆయన తెలిపారు. లాక్‌డౌన్ పూర్తయ్యాక షెడ్యూల్ విడుదల చేస్తామని వెల్లడించారు. కాగా,  కరోనా విజృంభించడంతో ఆరో తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులందర్నీ పాస్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే.

 

 


 

మరింత సమాచారం తెలుసుకోండి: