ఆంధ్రప్రదేశ్ లో ఓ పోస్టుల విషయంలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. తూర్పుగోదావరి జిల్లాలో ఎస్జీటీ కాంట్రాక్టు టీచర్ ఉద్యోగాలు మొత్తం 500 వరకూ ఉంటే.. వాటికి కేవలం 260 మాత్రమే అప్లికేషన్లు వచ్చాయి. డీఎస్సీ- 2008లో అర్హత సాధించినా ఉద్యోగాలు దక్కనివారిని ఒప్పంద ప్రాతిపదికన ఎస్జీటీలు నియమించాలని ఇటీవల ప్రభుత్వం నిర్ణయించింది.

 

 

అయితే వీటికి అంతగా స్పందన కనిపించలేదు. గడువు ముగిసే సరికి జిల్లాలో 51 శాతం మంది మాత్రమే ఆసక్తి చూపారు. అప్పటి 100 శాతం కామన్‌ మెరిట్‌ జాబితా ద్వారా అదనంగా ఎంపిక చేసిన సెకండరీ గ్రేడ్‌ అభ్యర్థుల పోస్టులు జిల్లాకు 502 కేటాయించారు. ఇందులో బీఈడీ 497, డీఈడీ అయిదు పోస్టులు ఉన్నాయి. వీటికి దరఖాస్తు చేసేందుకు ఈనెల 17ఆఖరు తేదీ.

 

 

గడువులోపల అంతగా స్పందన కనిపించకపోవడంతో మరో మూడు రోజులు అవకాశం ఇచ్చారు. చివరి రోజైన బుధవారం నాటికి తూర్పుగోదావరి జిల్లాలో 502 పోస్టులకు 260 మంది మాత్రమే దరఖాస్తు చేశారని జిల్లా విద్యా శాఖ అధికారి తెలిపారు. గురువారం సాయంత్రం తుది జాబితాను ప్రభుత్వానికి పంపుతారు. ఈలోగా ఆసక్తి ఉన్న అభ్యర్థులు హాల్‌టికెట్, మార్కుల జాబితా, అంగీకార పత్రాన్ని స్కాన్‌ చేసి మెయిల్‌ చేయవచ్చు.

 

 

తూర్పుగోదావరి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత అధికంగా ఉంది. గత విద్యా సంవత్సరంలో ఏకంగా 32 వేల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. జిల్లాలో విద్యార్థులకు సమర్థ బోధన సాగాలంటే 1,200 మంది ఉపాధ్యాయులు అవసరం. అందుకే కాంట్రాక్ట్ టీచర్లుగా 502 మందిని.. 2018 డీఎస్సీ ద్వారా 620 పోస్టులను భర్తీ చేస్తే కొంత సాఫీగా పని జరిగే అవకాశం ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: