ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ కరాళ నృత్యం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. చైనాలో పుట్టుకొచ్చిన ఈ క‌రోనా మ‌హ‌మ్మారి.. ప్ర‌పంచ‌దేశాల‌ను త‌న గుప్పెట్లో పెట్టుకుంది. ఈ క్ర‌మంలోనే ల‌క్ష‌ల మంది ప్రాణాల‌ను బ‌లితీసుకుంది. ఇంకెంత మందిని పొట్ట‌న‌పెట్టుకుంటుందో అర్థంకాని ప‌రిస్థితి. చిన్నా.. పెద్దా అని తేడా లేకుండా అన్ని దేశాలు క‌రోనా ముందు త‌ల వంచాయి. అంత‌లా ఈ మ‌హ‌మ్మారి విశ్వ‌రూపం చూపిస్తోంది. అయితే క‌రోనాను క‌ట్ట‌డి చేసేందుకు ప‌లు దేశాలు లాక్‌డౌన్ విధించాయి. దీంతో పెద్ద‌ల‌తో పాటు పిల్ల‌లు కూడా ఇంటికే ప‌రిమితం అయ్యారు.

 

ఇక ఈ క‌రోనా కార‌ణంగా చాలా మందికి అసలు పరీక్షలే జరగలేదు. పబ్లిక్‌ పరీక్షలూ వాయిదా పడ్డాయి. దీంతో వర్కింగ్‌ పేరెంట్స్‌ తమ రూమ్స్‌లో బిజీగా ఆఫీసు పనులు చేసుకుంటూ ఉంటే.. వారి పిల్లలు స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లు లేదంటే ల్యాప్‌టా్‌పలలో ఇంకా బిజీగా గడుపుతున్నారు. అయితే డిగ్రీ, పీజీ విద్యార్థులు మాత్రం ప‌రీక్ష‌లు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. అయితే ఇలాంటి వారికి గుడ్‌న్యూస్ చెప్పింది తెలంగాణ స‌ర్కార్‌. తెలంగాణలో వాయిదా పడిన డిగ్రీ, పీజీ పరీక్షల నిర్వహణపై రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి మార్గదర్శకాలు జారీ చేసింది. 

 

డిగ్రీ, పీజీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు జూన్‌ 20 నుంచి పరీక్షలు నిర్వహించవచ్చని యూనివర్సిటీలకు అనుమతి ఇచ్చింది.  అయితే తుది సెమిస్టర్‌ పరీక్షలు మాత్రమే నిర్వహించాలని సూచించింది. మిగతా సెమిస్టర్లకు నవంబర్‌ లేదా డిసెంబర్‌లో పరీక్షలు నిర్వహించాలని తెలిపింది. ఇక అటు పరీక్షా సమయాన్ని రెండు గంటలకు కుదించాలని చెప్పిన రాష్ట్ర ఉన్నత విద్యామండలి.. ప్రశ్నాపత్రంలోనూ ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వాలని సూచించింది. అలాగే మిగిలిన సెమిస్టర్‌ విద్యార్థులకు పరీక్షలు లేకుండానే తాత్కాలికంగా ప్రమోట్‌ చేయాలని.. ప్రాజెక్టులు, సెమినార్లు, వైవాలు ఆన్‌లైన్‌లోనే నిర్వహించాలని స్పష్టం చేసింది. కాగా, జూన్ 20 నుంచే ప‌రీక్ష‌లు కాబ‌ట్టి.. డిగ్రీ, పీజీ విద్యార్థులు వాటిపై దృష్టి సారించాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: