దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో.. కేంద్ర ఉద్యోగులకు కొత్త మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ఆఫీసుల్లో కచ్చితంగా కోవిడ్ నిబంధనలు పాటించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఇప్పటికే పలు మంత్రిత్వ శాఖల్లో ఉద్యోగులకు కరోనా రావడంతో.. కేంద్రం అప్రమత్తమైంది. 

 

దేశంలో కరోనా విస్తరిస్తున్న తరుణంలో..  పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఒకరిద్దరికి పాజిటివ్ అని రావడంతో ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లాలంటే జంకుతున్నారు. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వ అధికారులు, సిబ్బందికి ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఉద్యోగులందరూ కోవిడ్ ప్రోటోకాల్ తప్పకుండా పాటించాలని సర్క్యులర్ జారీ చేసింది. పెట్టుబడులు ఉపసంహరణ శాఖ కార్యదర్శికి కూడా కరోనా రావడంతో.. కేంద్రం అలర్టైంది.

 

దగ్గు, జలుబు, జ్వరం ఉంటే విధులకు రావద్దని ఉద్యోగులకు కేంద్రం సూచించింది. క్యాబిన్ షేర్ చేసుకునే సెక్రటరీ స్థాయి అధికారులు రోజు విడిచి రోజు రావాలని చెప్పింది. కంటైన్మెంట్ జోన్లలో ఉండే ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోం ఇవ్వాలంది. ఉద్యోగులు నేరుగా మాట్లాడుకోవద్దని, ఇంటర్ కామ్ ఫోన్లు వాడాలని సూచించింది. 

 

ఏ సమయంలో అయినా ఆఫీస్ లో ఇరవై మంది కంటే ఎక్కువ స్టాఫ్ ఉండకూడదని నిర్దేశించింది. ఇందుకు అనుగుణంగా కార్యాలయాల పనివేళలు మార్చుకోవాలని చెప్పింది. కంప్యూటర్ కీ బోర్డులు, మౌసులు ఎవరికి వారే శానిటైజర్ తో క్లీన్ చేసుకోవాలని కేంద్రం చెప్పింది. సమావేశాలు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే నిర్వహించుకోవాలని సూచించింది. వీడియో కాన్ఫరెన్స్ కు కూడా బోర్డ్ రూమ్ ను కాకుండా.. పర్సనల్ కంప్యూటర్లనే వాడాలని చెప్పింది. 

 

ఆఫీసుల్లో వీలైనన్ని చోట్ల శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని తెలిపింది కేంద్రం. ఎక్కువమంది తాకే అవకాశమున్న లిఫ్ట్ బటన్లు, ఎలక్ట్రికల్ స్విచ్చులు, డోర్ హ్యాండిళ్ల, వాష్ రూమ్ ట్యూప్ లను గంటకోసారి శుభ్రం చేయాలని, ఉద్యోగులంతా అరగంటకోసారి చేతులు శుభ్రంగా కడుక్కోవాలని కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. 

 

దేశంలో గత 24 గంటల్లో 9 వేల 987 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే 331 మంది కరోనాతో మరణించారు.  ప్రస్తుతం మొత్తం కేసుల సంఖ్య 2 లక్షల 66 వేల 598కు చేరుకుంది. దేశవ్యాప్తంగా లక్షా 29 వేల 917 యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 7 వేల 466 మంది కరోనాతో మరణించారు.  రికవరీ రేటు 49 శాతానికి చేరింది.

మరింత సమాచారం తెలుసుకోండి: