తాజాగా తెలంగాణ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) రంగం మెరుగైన వృద్ధిని సాధిస్తోంది. ఫలితంగా ఉద్యోగాల కల్పన పెరుగుతోందని హైసియా ప్రెసిడెంట్‌ మురళి బొల్లు తెలిపారు. వచ్చే ఐదేళ్ల కాలంలో ఐటీ కంపెనీలు 5 లక్షల మందికి ఉపాధిని కల్పించే అవకాశం ఉందని, ఫలితంగా మొత్తం ఉద్యోగుల సంఖ్య 10 లక్షలు దాటనుందని ఆయ‌న అన్నారు. నైపుణ్యం కలిగిన మానవ వనరులు, మంచి మౌలిక సదుపాయాలు, ప్రభుత్వం నుంచి మద్దతు లభిస్తున్నందు వల్ల కంపెనీలు ఇక్కడ తమ కేంద్రాలను ఏర్పాటు చేసుకోవడానికేకాకుండా విస్తరణకు ప్రాధాన్యం ఇస్తున్నాయని చెప్పారు. 


అలాగే 2018-19 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఐటీ ఎగుమతులు రూ.1.09 లక్షల కోట్లుగా ఉన్నాయని, అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చితే వృద్ధి 17 శాతంగా నమోదైందని చెప్పారు. ఇదే కాలంలో ఐటీ రంగ జాతీయ సగటు 9 శాతానికే పరిమితమైందన్నారు. రాష్ట్రంలో ఐటీ రంగం ద్వారా గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 65 వేల మందికి ఉద్యోగాలు లభించాయ‌ని.... దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 5.5 లక్షలకు చేరుకుందని పేర్కొన్నారు.  


ఇదిలా ఉంటే సరికొత్త టెక్నాలజీలు వస్తున్న కారణంగా ఐటీ కంపెనీలు అందుకు తగిన విధంగా తమ ఉద్యోగులకు ట్రైనింగ్ ఇస్తున్నాయి. ఇప్ప‌టికే దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 40 శాతం మందికి పునఃశిక్షణ ఇచ్చే పరిస్థితి ఏర్పడుతోంది. అయితే భవిష్యత్‌ టెక్నాలజీలైన ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌, బ్లాక్‌ చెయిన్‌, ఏఆర్‌/వీఆర్‌ టెక్నాలజీలను నేర్చుకోవ‌డం వ‌ల్ల స్టాటింగ్‌లోనే మంచి వేత‌నాలు కూడా ల‌భించే అవ‌కాశాలు ఉన్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: