ఈవేళ విద్యావ్యవస్థలో ఉండే తేడాల కారణంగా యావత సమాజంలో పౌరజీవనం అస్తవ్యస్తం అయిపోయిన విషయం మనకు తెలుసు మూలాలు ఎక్కడో ఉన్నాయి అనుకుంటాం కానీ, మూలాలు విద్యావ్యవస్థలోనే ఉన్నాయి. నేటి బాలురే రేపటి పౌరులు అంటారు. నిజమే! సరిగ్గా పెంచితే ఆ మాట నిజమే అవుతుంది. లేకపోతే నేటి దూడలే రేపటి దున్నపోతులు! తేడా ఏం లేదు. కష్టంగా అనిపిస్తుంది కానీ ఇది నిజం. దూడ దున్నపోతు కావడానికి ఎవరూ ఏమీ చేయనక్కర్లేదు.
 
కానీ బాలుడు పౌరునిగా మారడానికి చాలా మంది కృషి చేయాలి. బాలునిలో దేశభక్తి, దైవభక్తి అనే స్ఫూర్తిని మనం కలిగించాలి. అది లేకుండా ఎవరి స్వార్థాలకు వారు పాల్పడి, యాజమాన్యాలేమో లాభాల కోసం, ఉపాధ్యాయులు పదోన్నతులు, జీతాల కోసం, తల్లితండ్రులేమో మా వాడు నాలుగు రూపాయలు సంపాదించే ఉద్యోగం చేస్తే చాలని చూస్తున్నారు. 
విద్యార్థి కూడా వీలైనంత చదవకుండా పాసవ్వడం ఎలాగా... అని ఆలోచిస్తున్నాడు. ఇలా నాలుగువైపుల నుంచి స్వార్థపరమైన ఆలోచనలు ఉన్నప్పుడు సమగ్రమైన భారతీయ పౌరుడు తయారయ్యే అవకాశం ఉందా?
 
ఒక బాలుడు మంచి పౌరునిగా తయారు కావాలంటే మనం విద్య లక్ష్యాన్ని స్పష్టంగా నిర్వచించుకుని, అన్వయించుకుని, ఆచరణలో పెట్టాలి.ఎందుకు చదవాలి? ఈరోజున అందరికీ చదువు అంటున్నారు. ఎందుకు? చదువు అందరికీ అవసరమే. ఎందుకంటే విద్య వల్ల వినయం వస్తుంది. ఇవ్వాళ ఓ అబ్బాయిని ఇంటర్మీడియెట్‌లో ఎంపీసీ ఎందుకు తీసుకున్నావు? అని అడిగితే ‘ఇంజనీరింగ్‌ చదవాలి కదండీ’ అంటాడు. ఇంజనీరింగ్‌ ఎందుకు అంటే ‘మంచి ఉద్యోగం దొరకాలి’ కదా అంటాడు. మంచి ఉద్యోగం ఎందుకు అంటే ‘బాగా సంపాదించాలి కదా’ అంటాడు. సంపాదన ఎందుకు అంటే ‘సుఖపడాలి కదా’ అంటాడు. 
సుఖమెందుకు అంటే ‘సుఖపడటానికే జీవితం’ అంటాడు. సుఖపడటానికే జీవితం కాదు, మనం సుఖపడుతూ మనచుట్టూ పదిమంది సుఖంగా జీవించేలా చేయడమే జీవితం.
 
నేను సుఖపడటానికే జీవితం అని చాలా మంది ఆలోచిస్తున్నారు. దేశం అక్కడే దెబ్బతింటోంది. సమాజం అక్కడే సర్వనాశనమవుతోంది. చరిత్ర, శాస్త్రసాంకేతికత, సాహిత్యం చదువుకున్న విద్యార్థికి వినయం రావాలి. ఈ రోజున విద్యార్థికి ఆ వినయం వస్తోందా? అది లేకపోగా పదోతరగతిలో 600 మార్కులకు 550 దాటగానే విద్యార్థి దగ్గరకు కాలేజీ ప్రిన్సిపాళ్లందరూ చేరి మా కాలేజీలో చేరు అని బతిమాలుతున్నారు.
 దాంతో విద్యార్థి కాలు మీద కాలేస్తున్నాడు. గర్వం వచ్చేస్తోంది. 550 మార్కులు వచ్చిన వానికి వినయం రావాల్సింది పోయి గర్వం వచ్చింది.
 
విద్య వల్ల వినయం, వినయంతో యోగ్యత వస్తాయి. పూర్వం పెళ్లి చేసుకునే వారు కూడా వినయాన్ని చూసి చేసుకునే వారు. అబ్బాయి మంచోడు, అమ్మాయి మంచిది అని చేసుకునే వారు. ఇప్పుడేమో ఎంత జీతం? ఏ కంపెనీలో చేస్తున్నావు? అని అడుగుతున్నారు. యోగ్యత ఉన్నప్పుడు మనం వ్యాపారం చేశామా? ఉద్యోగం చేశామా? ఏదైనా ఫరవాలేదు. విద్య వల్ల వినయం, వినయం వల్ల యోగ్యత, ఆ యోగ్యత వల్ల ధనం వస్తాయి. మరి ధనం వల్ల ఏమొస్తుంది? ఆనందం వస్తుందంటే కోటీశ్వరులందరూ ఆనందంగా ఉంటున్నారా? లేదు. రెండోపూట చపాతీ తింటున్నారు. అది కూడా ఒకటే. రెండోది వేసుకుంటే బరువు పెరుగుతారు.
 
అందులో చట్నీ వేయకూడదు, ఎందుకంటే బీపీ. పంచదార వేయకూడదు ఎందుకంటే షుగర్‌. మరి ఏమీ లేనిదానికి వంద కోట్లు ఎందుకు మహానుభావా? ఇదొక్కసారి ఆలోచిస్తే మనిషి సంపాదించడం మానేస్తాడు. సంపాదించడం తగ్గించుకున్నప్పుడు పని ఒత్తిడి కూడా ఉండదు. ధనం వల్ల సుఖం రాదు.మరి ధనం సంపాదిస్తే ఏమొస్తుంది అంటే... *మనిషి తన అవసరాలకు సంపాదించుకున్నప్పుడు ధర్మంగా, నిజాయితీగా ఉండగలుగుతాడు. ధర్మంగా ఉండటం అంటే తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తాడు. బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడం వల్ల సుఖపడతాడు. విద్య వల్ల వినయం, వినయం వల్ల యోగ్యత, యోగ్యత వల్ల ధనం, ధనం వల్ల ధర్మం, ధర్మం వల్ల సుఖం కలుగుతుంది. ఆ ధర్మాన్ని నేర్పడం కోసమే విద్య. మనం ఆ విద్య కోసమే పిల్లలను పాఠశాలలో చేర్పిద్దాం.


మరింత సమాచారం తెలుసుకోండి: