రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా మార్చేందుకు కంకణం కట్టుకున్న ప్రభుత్వం ‘హరితహారం’ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపడుతోంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే క్రమంలో ప్రజాప్రతినిధులకు, అధికారులకు లక్ష్యాలను విధించాలని యోచిస్తోంది. శాసనసభ్యుడి స్థాయి నుంచి గ్రామ సర్పంచ్‌ వరకూ ఈ లక్ష్యాలను విధించే దిశగాముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు యోచిస్తున్నారు. దీనికి కార్యాచరణ ప్రణాళిక త్వరలోనే సిద్ధం కానున్నట్లు సమాచారం. తొలి నుంచి హరితహారంపై కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించి అధిక ప్రాధాన్యతనిస్తూ వచ్చారు. అయితే కొన్ని జిల్లాల్లో అనుకున్నంతగా కొనసాగకపోవడాన్ని సీఎం కొద్ది రోజుల క్రితం జరిగిన ఓ సమీక్షా సమావేశంలో ప్రస్తావించారు.



అధికారులు, ప్రజాప్రతినిధులపై ఒకింత ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇక మొక్కల పరిరక్షణ బాధ్యతలో ప్రజల భాగస్వామ్యం అవసరమని, ఇందుకు ప్రజాప్రతినిధుల సహకారం కూడా అవసరమని కొద్ది రోజుల క్రితం ఓ సమావేశంలో అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. దీంతో మొక్కల పరిరక్షణలో లక్ష్యాలను సాధించిన ప్రజాప్రతినిధులకు టిక్కెట్లిచ్చే ప్రక్రియలో ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన భావిస్తున్నట్లు వినికిడి. అలాగే హరితహారం పురోగతిని గీటురాయిగా చేసుకుని అధికారులు, ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. గజ్వేల్‌, సిద్దిపేటల్లో హరితహారం మంచి ఫలితాలు ఇస్తున్న నేపథ్యంలో అక్కడి అధికారులను సీఎం త్వరలో కలిసి అభినందించనున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: