ఉన్నతమైన చదువుల కోసం ఏపీ నుంచీ విదేశాలకి వెళ్లేవారికి గుడ్ న్యూస్..ఏపీ మంత్రి ఘంటా శ్రీనివాసరావు మరియు రైట్ స్టేట్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ హెరాల్ షెడర్‌ లు భేటీలో తీసుకున్నఒక కీలకమైన నిర్ణయం..విద్యార్ధుల విదేశి చదువులకి మరింత ఊతం ఇచ్చింది. ఈ భేటీ లో నిర్ణయం ప్రకారం ఏపీ నుంచి ఆమెరికా (ఒహియో రాష్ట్రం)లోని రైట్‌ స్టేట్‌ యూనివర్సిటీ వెళ్లే విద్యార్థులకు ఫీజు రాయితీ లభించనుంది అంతేకాదు ఈ విషయంలో ఒప్పంద సంతకాలు కూడా చేశారు.


అక్కడి కాలమానం ప్రకారం.. బుధవారం ఈ వర్సిటీ డైరెక్టర్లతో మంత్రి గంటా నేతృత్వంలోని బృందం సమావేశమై, పలు అంశాలపై చర్చించింది. వర్సిటీ ప్రతినిధి బృందం డిసెంబరులో ఏపీని సందర్శించనుంది. రాష్ట్ర విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఇద్దరు సభ్యులతో కమిటీని నియమించడంతో పాటు, ఏపీ విద్యార్థులు ప్రత్యేకంగా వర్సిటీ వెబ్‌సైట్లో దరఖాస్తు చేసుకునేలా చూడటం లేదా ఇందుకోసం ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసే అంశంపై అప్పుడే నిర్ణయిస్తారు. అలాగే పరిశోధనా రంగంలో నవ్యాంధ్ర వర్సిటీలకు నిధులు అందించేందుకు ఈ వర్సిటీ ఆసక్తి కనబరిచింది.


యూజీలో సెమిస్టర్‌కు బయటి నుంచి వచ్చిన విద్యార్థులు 8,904 డాలర్లు, స్థానిక విద్యార్థులు 4,365 డాలర్లు చెల్లిస్తున్నారని చెప్పారు. ఇకనుంచి ఏపీ విద్యార్థులు మాత్రం 5,400 డాలర్లు చెల్లిస్తే సరిపోతుందని మంత్రి వివరించారు. పీజీ కోర్సుల్లో11,889 డాలర్లకు గాను ఏపీ విద్యార్థులు 8,552 డాలర్లు చెల్లించాలని తెలిపారు.


జనవరి నుంచి అన్ని కోర్సులకు ఫీజు రాయితీ అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. అంతేకాదు ఈ ఒప్పందం ఒక్క ఈ యూనివర్సిటీ తోనే ఆగిపోదు  ఒహియో రాష్ట్రంలోని అన్ని వర్సిటీల్లోనూ రాష్ట్ర విద్యార్థులకు ఫీజు రాయితీ లభించే విధంగా ఆయా వర్సిటీల అధికారులతో మాట్లాడతామని ఘంటా చెప్పారు.. ఇండియా నుంచీ  ఒక రాష్ట్ర ప్రభుత్వంతో నేరుగా ఒప్పందం చేసుకోవడం ఇదే తొలిసారని షెడర్‌తెలిపారు..

మరింత సమాచారం తెలుసుకోండి: