'' నాణ్యమైన విద్య అందాలంటే దేశంలో ప్రైవేట్‌ పాఠశాలలను పూర్తిగా రద్దు చేయడం ఒక్కటే పరిష్కార మార్గం. అప్పుడు ముఖ్యమంత్రుల పిల్లలు, మనుమలూ మనుమరాళ్ళు, అధికారుల పిల్లలు, ధనవంతుల పిల్లలు, పేద వారి పిల్లలు అందరినీ ప్రభుత్వ బడిలో మాత్రమే చదివించాల్సి వుంటుంది.
దాంతో బడుల పని విధానం, సౌకర్యాలు, విద్య నాణ్యత అన్నీ మెరుగవుతాయి. మండలానికి ఆరు నుండి పది పాఠశాలలు పెట్టి మిగతా చిన్న గ్రామాలకు రవాణా వ్యవస్థ ఏర్పాటు చేయడం ద్వారా పాఠశాలల సంఖ్య తక్కువై, సౌకర్యాలు మెరుగై విద్యాప్రమాణాలను పెంపొందుతాయి...'' అంటూ కునారిల్లిపోతున్న విద్యావ్యవస్ధకు కొత్తపాఠం చెబుతున్నారు, సీనియర్‌ ఐఎఎస్‌ అధికారిగా పనిచేసిన ఆకునూరి మురళి. 

అభివద్ధికి పునాది విద్య !
'' భారత రాజ్యాంగంలో పేర్కొన్నట్టు ప్రభుత్వమే అందరికీ నాణ్యమైన విద్యను అందించాలి. ఏ దేశంలో అయినా పేదరికం పోయిందంటే, బాగా అభివద్ధి జరిగిందంటే దానికి పునాది పాఠశాల విద్య, కాలేజి విద్య, విశ్వవిద్యాలయ విద్య అనేది చారిత్రక సత్యం. కానీ మన దేశంలో ప్రభుత్వ పెద్దలు, రాజకీయ నాయకులు, కాంట్రాక్టుల కిచ్చే ప్రాజెక్టు పనుల మీద ఉన్నంత శ్రద్ధ పిల్లలకు నాణ్యత కల్గిన చదువు చెప్పించడం మీద పెట్టలేకపోతున్నారు.

సివిల్‌ ఇంజనీరింగ్‌ ప్రాజెక్టులు, రియల్‌ ఎస్టేట్‌ లావాదేవీలు ఎన్నికలకు అవసరమైన డబ్బు సమకూరుస్తాయి. సర్కారు బడుల మీద పెట్టే పెట్టుబడులు డబ్బులు రాల్చవు కదా! అందుకే రాజకీయ నాయకులకు విద్య మీద సమయం వెచ్చించడం శుద్ధ దండగ అనిపిస్తుంది. అయితే, రాజకీయ చిత్తశుద్ధి ఉంటే అందరికీ నాణ్యమైన విద్య అందించడం మనకు అసాధ్యమేమీ కాదు....'' అని కుండబద్దలు కొట్టారు మురళి.

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో సెల్ఫ్‌ హెల్ప్‌ గ్రూప్‌లతో గ్రామీణ స్వయం సమృద్ధి సాధించి చూపించిన , కొప్పుల రాజు,విజయకుమార్‌ టీంలో పని చేసిన అకునూరి మురళి తెలంగాణలో పుట్టి పెరిగారు. ఆదిలాబాద్‌ జిల్లాలో, బొగ్గుగనుల ప్రాంతంలో నిరుపేద కుటుంబంలో పుట్టి,కష్టాలు కన్నీళ్ల మధ్య చదువుకొని ఉన్నతాధికారిగా ఎదిగారు.

ఆయన సర్వీసు అంతా గ్రామీణ అభివృద్ది, అట్టడుగు ప్రజల ప్రగతి కోసం పనిచేశారు. ఆ అనుభవంతోనే నేడు పతనమవుతున్న విద్యా వ్యవస్ధ మీద తనదైన శైలిలో అభిప్రాయాలను వెల్లడించారు. ప్రజల భవిష్యత్‌ కోరే తెలంగాణ,ఆంధ్ర ప్రభుత్వాలు మురళి ఆలోచనల మీద అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. సర్కారీ బడులకు జవసత్వాలు ఇస్తే, బాలల భవిష్యత్‌ బంగారు మయం అవుతుందని విద్యా నిపుణులు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: