'అంగన్‌వాడీ అనేది దేశవ్యాప్తంగా ఉన్న సిస్టమ్‌ దానిని ఎవరూ మార్చలేరు..' అని భర్త చెప్పినా, ఆమె నిరాశ పడలేదు.
 పేద తల్లులు కూలీకెళితే వాళ్ల పిల్లల ఆలనాపాలనా కోసం సర్కారు ఏర్పాటుచేసే క్రష్‌ లాంటివే, అంగన్‌వాడీలు. వాటిల్లో కాస్త చదువూ నేర్పించాలి. కానీ, ఆ కేంద్రాలపై చాలా నిర్లక్ష్యం ఉండటం ఆమెను కదిలించింది. అంగన్‌వాడీల్లో, సరైన సౌకర్యాలు లేక చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిసి, వాటినోసారి చూడాలి అనిపించింది ఆమెకు.

 ''చిత్తూరు జిల్లా, బంగారుపాళ్యం సమీపంలో మహాసముద్రం గ్రామంలో ఓ అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లా. అక్కడంతా ముళ్లపొదలు, చుట్టూ అపరిశుభ్రత.. ఇంత దుర్భర పరిస్థితిలో ఈ పిల్లలు ఎలా ఎదుగుతారు? వారి భవిష్యత్‌ ఏమవుతుంది ? అని ఆలోచించినపుడు ఆ అంగన్‌వాడీ కేంద్రాన్ని దత్తత తీసుకోవడం ఒక్కటే మార్గం అని అప్పుడే నిర్ణయించుకున్నా...' అన్నారు శిల్ప.

 సమాజంలో అవసరాలు మార లేదు.పారిశుద్ద్యం,పౌష్టికాహార లోపమూ,పేదరికమూ ఎప్పుడూ ఉండే సమస్యలే.అయితే సమస్యల పట్ల అవగాహన ఉండి,పరిష్కారం దిశగా ఆలోచిస్తే మార్పు వస్తుందని నిరూపించారు ఆమె. ప్రభుత్వాలు ప్రజల సమస్యల పరిష్కారానికి ఎంతో ఖర్చు చేస్తున్నాయి కానీ, పలు కారణాల వల్ల చేరవలసిన వారికి అవి పూర్తిగా చేరడం లేదు. అలాంటి చోట ఆమె చొరవ తీసుకొని పథకాల అమలు సమర్ధవంతంగా జరిగేలా చూశారు.
అనుకున్నట్టే మూడు నెలల్లో ఆ కేంద్రాన్ని సమూలంగా మార్చేశారు. 
ఇంద్రధనుస్సులా ...
 వారానికోసారి తన ఇద్దరు పిల్లలతో అక్కడికి వెళ్లడం మొదలు పెట్టారు.కూలడానికి సిద్ధంగా ఉన్న గోడలతో శిథిలావస్థకు చేరుకున్న అంగన్‌ వాడీ కేంద్రాన్ని ఆధునికీకరించే పని మొదలు పెట్టారు. కొత్త భవనం నిర్మించి, పిల్లలు మెచ్చే రంగులు వేయించారు. ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశంలో సూక్ష్మసేద్యంతో మొక్కలు,కూరగాయలు పెంచారు. 

ఆమెకు 37 మంది పిల్లలు 

పిల్లల కోసం పలకలూ, పుస్తకాలూ, దుస్తులూ, భోజనం చేయడానికి పళ్లాలూ, గ్లాసులూ, ఫ్యాన్లూ, లైట్లు వంటి విద్యుత్తు ఉపకరణాలు, కూర్చొని చదువుకోవడానికి ఆకర్షణీమైన రంగుల బల్లలూ అన్నీ సమకూర్చిపెట్టారు. ఆకర్షణీయమైన టాయిలెట్లు కట్టించారు. మూడునెలల కిందట ఈ కేంద్రంలో 14 మంది పిల్లలే నమోదైతే.. కొత్త రూపు వచ్చాక ఇప్పుడు 37 మంది ఉన్నారు! ఈ ఆధునికీకరణ పనుల కోసం మొత్తం ఆరులక్షలు ఖర్చయ్యాయి. అందులో లక్ష రూపాయలు ఆమె సొంతవే. మరో ఐదు లక్షలు ప్రభుత్వం (ఎస్‌డీఎఫ్‌) నుంచి కేటాయించేలా చూశారు. 

పౌష్టికాహారం కోసం పెరటి తోట 

అంగన్‌వాడీ కేంద్రంలో న్యూట్రియా గార్డెన్‌ పెట్టాలని శిల్ప భావించారు. విద్యతో పాటు పౌష్టికాహారం కూడా అందించాలని ఆంగన్‌ వాడీ ఆవరణలో కూరగాయల సాగును చేపట్టి అక్కడ పండించిన సేంద్రీయ కూరగాయలతో చేసిన ఆహారాన్ని పిల్లలకు అందిస్తున్నారు. అవసరానికి వాడగా మిగిలిన కూరగాయలను విక్రయించిగా వచ్చిన ఆదాయంతో అంగన్‌వాడీ నిర్వహణకు నిత్యావసర వస్తువులు సమకూర్చుకొని స్వయం సమృద్ధి సాధిస్తూ, ప్రభుత్వ నిధులను ఆదా చేస్తున్నారు. 

తల్లిబిడ్డల ఆరోగ్యం కోసం పిల్లల్లో సజనాత్మకత పెరిగేలా కార్యక్రమాల రూపకల్పన చేయాలనేది ఆమె సంకల్పం. పిల్లలకు ఎలాంటి యాక్టివిటీస్‌ నేర్పించాలనే అంశాన్ని అక్కడి సిబ్బందికి స్వయంగా వివరించడంతో పాటు ఆమే స్వయంగా పిల్లలకు కొన్ని అంశాలను నేర్పించారు. అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశుభ్రంగా వుంచాల్సిన అవసరం అక్కడ పని చేస్తున్న ఇద్దరు ఆయాలకు వివరించారు. ఈ విషయమై శిల్పా ఆ గ్రామంలోనే కొందరు సహాయకులను మోటివేట్‌ చేశారు. తల్లిబిడ్డల ఆరోగ్యానికి ఎంతో ప్రధాన్యం ఇవ్వాల్సిన అవసరాన్నిగుర్తించిన శిల్ప ఏ ఒక్క గర్భవతి కూడా సరైన పోషకాహారం లభించక ఎనీమియాకి గురి కాకూడదని, మహిళలకు పోషకాహారం సక్రమంగా అందించేలా ఏర్పాట్లు చేశారు. 

ఎవరీ శిల్ప..?
 అంగన్‌ వాడీలను అభివృద్ధికి రోల్‌మోడల్‌గా మార్చి, చిన్నారులకు బంగారు భవిష్యత్‌ని ఇస్తున్న ఈ మానవీయ మహిళ, గతంలో చిత్తూరు జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన పీఎస్‌ ప్రద్యుమ్న భార్య!
కర్నాటకకు చెందిన మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగారు. ఉన్నత విద్యావంతురాలైన ఆమె, అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పనిచేసే భర్త స్ఫూర్తితో తనదైన శైలిలో వెలుగు బాట వైపు అడుగులు వేస్తున్నారు. (pics/shyammohan)


మరింత సమాచారం తెలుసుకోండి: