ఆయన ఒక మారుమూల గ్రామం, వరంగల్‌ జిల్లా, కేశవాపూర్‌ నుంచి వచ్చి ఐఏఎస్‌ సాధించారు. పేద కుటుంబంలో జన్మించిన ఆయన ఏడేళ్ల వయస్సులోనే తండ్రిని కోల్పోయారు.
తల్లి గౌరమ్మ నీడన పెరిగారు. ఆయన తెలుగులో చదివినా ఆంగ్లంలోనూ ప్రావీణ్యం సాధించారు.

1995లో తెలుగులో సివిల్స్‌ పరీక్ష రాసి రాష్ట్రంలో మొదటి ర్యాంకుతో ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. ప్రస్తుతం తెలంగాణలో పర్యాటక,సాంస్కృతిక శాఖల ముఖ్య కార్యదర్శి. తీరికలేని విధులు...బాధ్యతలు... అన్నీ నిర్వహిస్తూనే తనకు ఇష్టమైన వ్యాపకం పుస్తక రచనను ప్రారంభించారు.సెల్ఫీ ఆఫ్‌ సక్సెస్‌ (విజయానికి స్వీయచిత్రం) పేరిట ఆంగ్లంలో పుస్తకాన్ని రచించారు.

అమెజాన్‌ ద్వారా ఈ పుస్తకం విశేషాదరణ పొందుతోంది. కొత్త రచయితల పుస్తకాల అమ్మకాల్లో అగ్రస్థానంలో నిలిచింది. మిలిందాగేట్స్‌ వంటి ప్రముఖ రచయితల పుస్తకాల కంటే ఎక్కువ రేటింగ్‌ పొందింది. అసాధారణ విజయాలకు వెంకటేశం జీవిత కథే ఒక ఉదాహరణ. వెంకటేశం ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదువుతారు. మానవ జీవితాలను, సామాజిక పరిస్థితులను అధ్యయనం చేశారు. ప్రముఖుల జీవితాలను విశ్లేషిస్తూ , 'విజయంతో సెల్ఫీ' పుస్తకాన్ని రచించారు.

'' విజయం అంటే సంపద, పదవి, ఎదుగుదల, శ్రేయస్సు, కీర్తి, లక్ష్యం చేరడమే గాదు.ఎన్నో కోణాలుంటాయి...'' అని విశ్లేషించారు.
'' నేటి సమాజానికి ఉపయోగ పడేలా,ఈ పుస్తకం రాశాను. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి లక్ష్యం గెలుపే. దీనికి అసలైన అర్థం తెలపాలనే, గెలుపు అంటే ఏమిటి?ఎందుకు? ఎలా? గెలిచిన తర్వాత ఏం జరుగుతుంది,. గెలిస్తే చాలా? ప్రపంచంలో గొప్ప వ్యక్తుల విజయాలు, ఒకరు గెలవడం వెనక ఎంత మంది ఓడిపోతున్నారు అనేది వివరించాను...'' అంటారు వెంకటేశం.
ఇంగ్లీషులో రాసిన ఈ పుస్తకం త్వరలో తెలుగులో రాబోతుంది. ప్రస్తుతం, అమెజాన్‌లో అందుబాటులో ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: