గత కొంతకాలంగా స్థిరంగా ఉన్న బంగారం ధరలు తాజాగా రికార్డు స్థాయికి చేరుకున్నాయి. చైనా, అమెరికా దేశాలు పరస్పరం విమర్శలు చేసుకుంటూ ఉండటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కరోనా విజృంభణతో ప్రపంచ దేశాలు లాక్ డౌన్ పై ఆధారపడ్దాయి. లాక్ డౌన్ అమలు వల్ల ట్రేడర్లు ప్రస్తుతం బంగారంపై పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. జపాన్, అమెరికా దేశాలు ఆర్థికంగా పతనమవుతూ ఉండటం కూడా బంగారం రేట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. 
 


ప్రపంచ దేశాల్లో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో పది గ్రాముల స్వచ్చమైన బంగారం ధర రూ.47,860 గా ట్రేడ్ అవుతోంది. కిలో వెండి రూ.48,298 వద్ద ట్రేడ్ అవుతోంది. పెరిగిన ధరలతో బంగారం ఏడేళ్ల గరిష్ట స్థాయిని చేరుకుంది. అతి త్వరలో పది గ్రాముల బంగారం ధర 50,000 మార్కు దాటే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి వాతావరణం మదుపరులను బంగారం వైపు ఆకర్షిస్తోంది. 
 


ఈక్విటీ మార్కెట్లు కుదేలవడంతో బంగారానికి భారీగా డిమాండ్ పెరిగింది. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని బులియన్ నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగారం ధరలు పెరగడంతో మరికొంతమంది విక్రయించాలనే ఆలోచనలో ఉన్నారు. 2012 అక్టోబర్ నుంచి బంగారం ధర అత్యధికంగా పెరగడం ఇదే తొలిసారి కావడంతో బంగారంపై పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపే వారి సంఖ్య పెరుగుతోంది. 
 


ప్రపంచ మార్కెట్లో ఈ సంవత్సరం బంగారం ధర ఏకంగా 16 శాతం పెరిగింది. లాక్ డౌన్ వల్ల మన దేశంలో బంగారం కొనుగోళ్లు తగ్గినప్పటికీ గత వారం వరకు ఆసియాలోని ముఖ్య కేంద్రాల్లో బంగారానికి భారీ డిమాండ్ ఉంది. ఇప్పట్లో బంగారం ధరలు తగ్గే అవకాశాలు లేవని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: