ఈ మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెముకను ' వెన్నుబాము' అని అంటారు. అందు కుండలినీశక్తి మూలాధారచక్రంలో "పాము" ఆకారమువలెనే వుంటుందని "యోగశాస్త్రం" చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిదురిస్తున్నట్లు నటిస్తూ! కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాల్ని గ్రక్కుతూ, మానవునిలో ' సత్వగుణ' సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు ' నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్పపుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది, అందరి హృదయాలలో నివసించే ' శ్రీమహావిష్ణువు" నకు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే! ఈ నాగుపాము పుట్టలో పాలు పోయుటలోగల అంతర్యమని చెప్తారు. ఈ క్రమంలోనే నాగుల చవితికి పుట్టకు నూలు చుట్టి పూజ చేయుటం ఆనాదిగా వస్తున్న ఆచారసంప్రదియం.


 ప్రకృతి మానవ మనుగడకు జీవనాధరమైనది కనుక దానిని దైవస్వరూపంగా భావించి మన పూర్వీకులు చెట్టును, పుట్టను, రాయిని, రప్పను, కొండను, కోనను, నదిని, పర్వతాన్ని - ఇలా సమస్త ప్రాణికోటిని దైవస్వరూపంగా చూసుకొంటూ.. పూజిస్తూవస్తున్నారు. ఇదే మనభారతీయ సంస్కృతిలోని విశిష్టత. నిశితంగా పరిశీలిస్తే ... అందులో భాగంగానే నాగుపాము ను కూడా నాగరాజుగా, నాగదేవతగా పూజిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా శ్రావణ శుద్ధ చతుర్థినాడు నాగుల చవితి జరుపుకుంటారు. (కార్తీక శుద్ధ చతుర్థిని కొందరు   జరుపుకుంటారు).
ఈ పాములు భూమి అంతర్భాగమందు నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా సమస్త జీవకోటికి నీటిని ప్రసాదించే దేవతలుగా తలచేవారు. ఇవి పంటలను నాశనంచేసే క్రిమికీటకాదులను తింటూ, పరోక్షంగా రైతు  కు పంటనష్టం కలగకుండా చేస్తాయట!. అలా ప్రకృతి పరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి.


 మన పురాణాలలో నాగుల చవితి గురుంచి ఎన్నో గాథలు ఉన్నాయి. దేశమంతట పలు దేవాలయల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావముతో అర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం. నాగుల చవితి రోజు ఆవు పాలు పుట్టలో పోసి నాగపూజచేసి చలిమిడి, చిమ్మిలి (నువ్వులతో చేస్తారు) అరటిపళ్ళు, తాటి బుర్రగుంజు , తేగలు మున్నగున్నవి నివేదన చేస్తారు. 
పూజ ఎలా చేయాలి?

 నాగేంద్రస్వామి (పాముపడగ) ప్రతిమను గానీ, లేదా ఫోటోను గానీ పూజకు ఉపయోగించాలి. పూజకు మందార పూలు - ఎర్రటి పువ్వులు – కనకాంబరములు, నైవేద్యమునకు చిన్నచిన్న ఉండ్రాళ్ళు, వడపప్పు, అరటిపండ్లు, చలిమిడిలను సిద్ధం చేసుకోవాలి. పూజకు ముందు నాగేంద్ర అష్టోత్తరము, నాగేంద్ర స్తోత్రము, నాగస్తుతి, నాగేంద్ర అష్టోత్తరము, నాగేంద్ర సహస్రనామములను పఠించడం ద్వారా సకల సంతోషాలు ప్రాప్తిస్తాయని విశ్వాసం. స్తోత్రములు పఠించేందుకు వీలుకాని పక్షములో  ఓం నాగేంద్ర స్వామినే నమః  అనే మంత్రాన్ని జపించాలి. దీపారాధనకు నువ్వుల నూనె వాడాలి. 7 దూది వత్తులు, ఆవు నేతితో సిద్ధం చేసుకున్న దీపంతో హారతి ఇచ్చి నైవేద్యమును సమర్పించుకోవాలి. 
 అనంతరం దగ్గరలో ఉన్న పుట్టవద్దకు పోయి దీపం వెలిగించి పుట్టలో ఒక చెంచాడు మాత్రమే  పాలుపోసి పూజ చేయాలి. నాగులచవితి రోజున ఆవు పాలు పుట్టలో పోసి, నాగపూజ చేసి చలిమిడి, చిమ్మిరి ఉండలు (నువ్వులతో చేస్తారు), అరటిపళ్ళు, తాటి బుర్ర గుజ్జు, తేగలు మున్నగునవి స్వామికి నివేదించాలి.  నాగరాజుకు హారతి పట్టడం గాని, వేడి పదార్థాల ఆరగింపు గాని పనికి రాదు.


 పాలను పుట్టలో పోస్తూ నన్నేలు నాగన్న నాకులము నేలు నాకన్న వారల నాయింటి వారల ఆప్తుల మిత్రుల నందరను నేలు పడగ త్రొక్కిన పగ వాడనుకోకూ నడుము త్రొక్కిన నా వాడనుకొనుమూ తోక త్రొక్కిన తొలగుచు పొమ్ము ఇదిగో! నూకనిచ్చెదను మూకను నాకిమ్ము పిల్లల మూకను నాకిమ్ము అంటూ ఈ విధంగా ప్రార్థిస్తారు.నాగుల చవితి రోజున నాగదేవతలకు పంచామృతములతో అభిషేకం చేయిస్తే సర్వం సిద్ధిస్తుందని నమ్మకం. దేవాలయాల్లో నాగేంద్ర అష్టోత్తర పూజ, నాగేంద్ర సహస్రనామపూజలు చేయించుకుంటే శుభదాయకం. 




మరింత సమాచారం తెలుసుకోండి: