జ్వరం.. ఒళ్లు నొప్పులు.. తలనొప్పి లక్షణాలు కనిపిస్తే చాలామంది ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేటు ఆసుపత్రులు, నర్సింగ్‌హోంలు రోగులతో కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్ లో ఎక్కువ శాతం డెంగీ కేసులు నమోదు కావడంతో..  చాలామంది జ్వరం వస్తే చాలు...వైద్యులను సంప్రదిస్తున్నారు. పరీక్షలు చేయించుకుంటున్నారు. 


హైదరాబాద్ గాంధీ, ఉస్మానియాలలో చెరో వేయి పడకలు వరకు ఉన్నాయి. ఈ రెండు ఆసుపత్రులలో కలిపి ప్రస్తుతం నిత్యం నాలుగు నుంచి ఐదు వేల వరకు ఓపీ ఉంటోంది. ఓపీ చీటీ కోసం గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధుల పరిస్థితి ఘోరంగా ఉంది. టోకెన్ కోసమే గంటలు గంటలు వెయిటింగ్ అంటే.. ఇక వైద్యం అందేది ఎప్పుడన్న ఆందోళన కనిపిస్తోంది. పైగా సామర్థ్యానికి మించి రోగులు వస్తుండటంతో.. ఇక్కడ క్యూలైన్ లో నుంచుంటేనే జ్వరాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 


వాస్తవానికి ఆదివారం ప్రభుత్వ ఆసుపత్రులలో అవుట్‌పేషెంట్‌ సేవలు ఉండవు. కేవలం అత్యవసర కేసులను మాత్రమే తీసుకుంటున్నారు. రోగుల తాకిడి ఎక్కువ ఉండటంతో ఆదివారం కూడా ఓపీ సేవలు అందిస్తున్నారు. ఫీవర్‌ ఆసుపత్రిలో 600, నిలోఫర్‌లో 285, ఉస్మానియా, గాంధీలో 100 మందికి చికిత్సలు చేశారు. ఇక నుంచి ప్రతి ఆదివారం కూడా ఓపీ సేవలు అందించనున్నట్టు చెబుతున్నారు. మరోవైపు హైదరాబాద్ లో ప్రముఖ కార్పొరేట్‌ ఆసుపత్రులు కూడా రోగులతో కిటకిటలాడుతున్నాయి. బంజారాహిల్స్‌లోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో 300 పడకల వరకు ఉన్నాయి. ఇవన్నీ నిండిపోవడంతో ఇతర శాఖలకు పంపుతున్నారు. సోమజీగూడలోని మరో ఆసుపత్రిదీ ఇదే పరిస్థితి. గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వస్తున్న రోగులను పడకలు లేక తిప్పి పంపుతున్నారు. ఆసుపత్రిలో చేరాలంటే నిరీక్షించాలని సూచిస్తున్నారు. ఎక్కువ శాతం మందిలో జ్వరం, జలుబు, ఒళ్లు నొప్పులు, తలనొప్పి ఇతర లక్షణాలు కన్పిస్తున్నాయి.


గ్రేటర్‌ వ్యాప్తంగా డెంగీ జ్వరాలతో చాలా మంది ఆసుపత్రుల్లో చేరుతున్నారు. దోమలు పెరగడంతో అన్ని ప్రాంతాల్లో డెంగీ కేసులు పెరుగుతున్నాయి. గాంధీ, ఉస్మానియాలతో పాటు ప్రైవేటు ఆసుపత్రుల్లో డెంగీ కేసులు నమోదవుతున్నాయి. తలనొప్పి, జ్వరం వస్తే చాలామంది డెంగీగా అనుమానపడుతున్నారు. వైరల్‌ జ్వరంలో కూడా ఇలాంటి లక్షణాలు కన్పిస్తాయి. అయినా ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో డబ్బు ఖర్చు అయినా వెనక్కి తగ్గడం లేదు. డెంగీ నిర్ధారణకు ఎన్‌ఎస్‌1 యాంటీజెన్‌ రాపిడ్‌ పరీక్ష చేస్తారు. కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు ఈ పరీక్షకు 2 వేల నుంచి 3 వేల వరకు వసూలు చేస్తున్నాయి. ఈ టెస్టుతోనే డెంగీ ఉన్నట్టు  పూర్తిగా నిర్ధారించకుండా ఐజీఎం ఎలీసా పరీక్ష కూడా చేయాలి. అయితే ఎన్‌ఎస్‌1 యాంటీజెన్‌తోనే డెంగీగా నిర్ధారిస్తున్నారు. వైరల్‌ జ్వరాలు రెండు, మూడు రోజుల్లో తగ్గిపోతున్నాయి. కొన్ని లక్షణాలు డెంగీ మాదిరిగా కన్పిస్తుంటాయి. అయినా రోగులు ఒత్తిడి ఇతర కారణాలతో కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు డెంగీ పరీక్షలు చేస్తూ రోగుల జేబుకు చిల్లు పెడుతున్నాయి. డెంగీ నిర్ధారణ అయి.. నాలుగైదు రోజులపాటు చికిత్స పొందాలంటే 40 నుంచి 50 వేల వరకు వసూలు చేస్తున్నాయి. దీర్ఘకాలిక వ్యాధులు, ఇతర సమస్యలు ఉన్నవారు, చిన్న పిల్లలు, గర్భిణులు, వృద్ధులకు డెంగీ సోకితే కొంత క్లిష్టంగా మారుతోంది. కొందరిలో ప్లేట్‌లెట్స్ పూర్తిగా పడిపోతాయి. ఇలాంటి వారు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స తీసుకోవాలంటే ఖర్చు తడిసిమోపెడు అవుతోంది. చికిత్స కోసం లక్ష నుంచి లక్షన్నర వరకు వసూలు చేస్తున్నారు.


గ్రేటర్‌ హైదరాబాద్‌లో నగరంతో పాటు రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలోని ఆసుపత్రులు వైద్య ఆరోగ్యశాఖ కిందకు రావడంతో అధికారుల మధ్య సమన్వయం లోపిస్తోంది. డెంగీ కేసులపై స్పష్టత ఉండటం లేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నమోదు అవుతున్న రోగుల సంఖ్య మాత్రమే ఆయా వైద్య ఆరోగ్యశాఖల వద్ద సమాచారం ఉంటోంది. ప్రైవేటు ఆసుపత్రుల్లో నమోదు అవుతున్న కేసులపై అధికారులకు ఎలాంటి సమాచారం అందడం లేదు. డెంగీ వ్యాధి లక్షణాలు ఉన్న రోగి నుంచి రెండో శాంపిల్‌ సేకరించి దానిని నారాయణగూడలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్ కు పంపాలి. ఈ ప్రయత్నం జరగడం లేదు. ఆయా జిల్లాల వైద్య ఆరోగ్యశాఖలు జీహెచ్‌ఎంసీతో సమన్వయం చేసుకుంటూ దోమల నివారణ, సీజనల్‌ వ్యాధులపై అవగాహన కల్పించాలి. ఇంట్లో ఒకరికి డెంగీ సోకితే మిగతా సభ్యులతోపాటు పరిసరాల్లో నివసించే వారందరికీ రక్త పరీక్షలు నిర్వహించాలి. నామమాత్రపు చర్యలతో సరిపెడుతున్నారు. ఇప్పటికైనా స్పందించి పక్కాగా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు



మరింత సమాచారం తెలుసుకోండి: