భారత్‌తోపాటు ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్న రక్తపోటు, మధుమేహం, కేన్సర్ మొదలైన నాన్-కమ్యూనికేబుల్ డిసీజెస్‌పై వైద్యరంగం ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని గౌరవ ఉపరాష్ట్రపతి  ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. ఈ దిశగా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు తీసుకునే చొరవ అత్యంత కీలకమని ఆయన సూచించారు. హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో గురువారం జరిగిన 27వ ఇండియన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ సదస్సును ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. వైద్యులు తమకు దగ్గర్లో ఉన్న పాఠశాలలు, కాలేజీలు, యువజన కేంద్రాలు, గ్రామాలను తరచూ సందర్శిస్తూ.. నాన్-కమ్యూనికేబుల్ డిసీజెస్‌కు కారణమవుతున్న ఆధునిక జీవన విధానంపై వారిని చైతన్యపరచడంతోపాటు.. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ వంటివాటిపై అవగాహన కల్పించాలని సూచించారు. 
వైద్యరంగానికి సంబంధించి ప్రభుత్వం నుంచి సరైనన్ని నిధుల విడుదల లేకపోవడం, రోగులకు సరిపోయేంత సంఖ్యలో వైద్యులు లేకపోవడం, వ్యాధులు రాకుండా నివారణపై చైతన్యపరిచే వ్యవస్థ లేకపోవడం, వైద్యానికవుతున్న ఖర్చు పెరగడం, గ్రామీణ ప్రాంతాల్లో మౌలికవసతుల కొరత, ప్రజల్లో ఆరోగ్యబీమాపై అవగాహన లేకపోవడం తదితర అంశాలు దేశ వైద్యరంగంపై పెనుప్రభావాన్ని చూపుతున్నాయని ఆయన అభిప్రాయడ్డారు. 



మరిన్ని వైద్య కళాశాలలను ప్రారంభించడం ద్వారా వైద్యుల కొరతను అధిగమించేందుకు అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. దీనితోపాటుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కనీస వైద్య వసతుల కొరతతోపాటు ఇలాంటి వ్యాధుల కారణంగా భారత్ తీవ్ర ఇబ్బందులు పడుతోందని.. ఉపరాష్ట్రపతి అన్నారు. ఈ దిశగా హెల్త్‌కేర్ ఇండస్ట్రీ, ప్రైవేటు రంగ భాగస్వాములంతా యుద్ధప్రాతిపదికన దృష్టిసారించాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో, సమాజంలోని అన్ని వర్గాల్లో నరాలకు సంబంధించిన వ్యాధుల సమస్యలు ఎక్కువవుతున్నాయని.. ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భారత్‌లో ప్రతి ఏటా 20లక్షల మంది బ్రెయిన్ స్ట్రోక్‌తో చనిపోతున్నారని.. దీని కారణంగా పక్షవాతం వంటి దీర్ఘకాల వైకల్యాలు, ఇతర సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. 2016లో వివిధ అనారోగ్య కారణాలతో మృతిచెందిన వారిలో.. 55.2%మంది నాన్-కమ్యూనికేబుల్ డిసీజెస్ (స్ట్రోక్, ఎపిలెప్సీ, మైగ్రైన్ తదితర సమస్యల) కారణంగానే చనిపోయారన్నారు. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలే ఇందుకు కారణమని ఆయన అన్నారు. 



ఈ సమస్యలను అధిగమించేందుకు న్యూరోలజీలో సీట్లు పెంచడంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో సీటీ, ఎమ్మారై స్కాన్ సౌకర్యాలున్నటువంటి వీలైనన్ని ఎక్కువ ఆసుపత్రులను ఏర్పాటుచేయటం కొంతమేరనైనా ఉపశమనం కలిగిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. దీంతోపాటుగా గ్రామీణ ప్రాంతాల్లో రిహాబిలిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని.. బాధితుల కుటుంబసభ్యులకు కూడా శిక్షణ ఇవ్వడం ద్వారా.. సదరు బాధితుడి విషయంలై జాగ్రత్తలు తీసుకునేందుకు వీలుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో నీతి ఆయోగ్ సభ్యుడు  డాక్టర్ వినోద్ పాల్, కిమ్స్ ఆసుపత్రి ఎండీ డా.భాస్కర్ రావు,ఐఏఎన్ అధ్యక్షుడు డా. సతీష్, న్యూరాలజీ వరల్డ్ ఫెడరేషన్ అధ్యక్షుడు డా. విలియమ్ కారల్, కార్యక్రమ కార్యనిర్వహక కార్యదర్శి డా.సీతాజయలక్ష్మితోపాటుగా.. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, పోర్చుగల్, జపాన్, ఇటలీలకు చెందిన 15మంది అంతర్జాతీయ నిపుణులతోపాటు 2వేల మంది వైద్యులు పాల్గొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: