అందరికీ ఊబకాయం ఒక సమస్య అయితే... కొందరికి పొట్ట భాగంలో చేరిన కొవ్వు మరొక సమస్య. చుట్టానికి నాజూకుగా ఉండి పొట్ట మాత్రం పెద్ద బానలా వుంటే అంత బావుండదు కదా. అయితే ఈ పొట్టలో కొవ్వు చేరడానికి సాధారణంగా రెండు విషయాలు కారణమవుతాయి: అవి మానసిక ఒత్తిడి, సరిపడినంత నిద్ర లేకపోవటం. నిద్రలేమి తో పెరిగే మానసిక ఒత్తిడి వల్ల వస్తున్న మన బాన పొట్టలని ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


చాలామంది కార్బోహైడ్రేట్లు తక్కువ తీసుకుంటారు కానీ రక్తంలోని చక్కెర స్థాయిపై దృష్టి పెట్టరు. కొన్ని ఆహారపదార్థాలు తినగానే, రక్తంలో చక్కెర స్థాయి హఠాత్తుగా పెరిగి, ఎక్కువైన చక్కెర కొవ్వుగా మారి నిల్వ ఉండటంతో బానపొట్టగా మారుతుంది. దాన్ని నివారించడం కోసం చక్కెర స్థాయిలు పెరగనివ్వని, జీర్ణక్రియను సమతుల్యం చేస్తూ, పీచుపదార్థం కలిగిన ఆహారం సేవించాలి. అందుకని ఎక్కువగా పిండిపదార్థం లేని కాయగూరలు, నట్స్, చిక్కుళ్ళు తినండి. బంగాళదుంపలు, వైట్ రైస్, వైట్ బ్రెడ్, చక్కెర ఎక్కువ ఉండే ఇన్స్టెంట్ పళ్ళరసాల వంటి వాటికి దూరంగా ఉండండి.

పీచు పదార్థాలు, సంపూర్ణ ధాన్యాలను ఎక్కువగా తీసుకోండి. పీచుపదార్థానికి అరగటానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి ఎక్కువసేపు ఆకలి వేయదు. దానివలన మీరు ఎక్కువ కార్బొహైడ్రేట్లు ఉన్న ఇతర ఆహారపదార్థాలు ఏది పడితే అది తినరు. మీరు ఎక్కువ పీచు ఉండే ఆకుకూరలు, సంపూర్ణ ధాన్యాలు, చిక్కుళ్ళు, బ్రౌన్ లేదా సంపూర్ణ ధాన్యం నుండి వచ్చిన అన్నం, నట్స్, డ్రై ఫ్రూట్స్ వంటివి తీసుకోవాలి.


మెటబాలిజాన్ని పెంచడంలో, ఆకలిని తగ్గించి, బరువుకి సంబంధించిన హార్మోన్స్ నియంత్రించడంలో ప్రొటీన్స్‌ పాత్ర అధికం. అందుకుగాను గుడ్లు, ఓట్స్, బ్రొకొలీ, పౌల్ట్రీ, చేపలు, బాదం, పాలు ఇలాంటి ప్రొటీన్స్ ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవాలి. గుడ్లలో ప్రొటీన్ ఎక్కువగా ఉండి బరువు తగ్గటంలో సాయపడుతుంది.
రోజువారీ ఆహారంలో మొత్తానికే కొవ్వు పదార్థాలు తీసెయ్యడం అన్నది మంచి ఆలోచన కాదు ఎందుకంటే మీ కణాల గోడల్లో ఎక్కువగా కొవ్వే ఉంటుంది, పైగా హార్మోన్ బ్యాలెన్స్ కూడా ఇవే చేస్తాయి.


అన్ని కొవ్వులు చెడ్డవి కావు. ఆరోగ్యకరమైన అవకాడో, ఆలివ్ నూనె, కొబ్బరి, చేపలు, నట్స్ మరియు గింజలు ఇవన్నీ ఆకలి తగ్గించటమే కాకుండా శరీరంలో కొవ్వు కరిగే ప్రక్రియను కూడా ప్రేరేపిస్తాయి. రోజువారీ మొత్తం కేలరీలలో 15 - 20% కొవ్వులు ఉండాలి. వీటితో పాటు రోజుకి 8 గ్లాసుల నీరు తాగండి. నిద్ర లేకపోవటం మెటబాలిజాన్ని తగ్గిస్తుంది. దీనిలో ఘ్రెలిన్, లెప్టిన్ల హార్మోన్లు ప్రభావితం చేస్తాయి. ఘ్రెలిన్ హార్మోన్ ఎప్పుడు తినాలో చెప్తుంది, అయితే నిద్రలేనప్పుడు మరింత ఘ్రెలిన్ ఉత్పత్తి అవుతుంది. మరోవైపు, లెప్టిన్ అనేది తినవద్దు ఆగండని చెప్తుంది. నిద్ర సరిగా లేనప్పుడు, శరీరంలో తక్కువ లెప్టిన్ ఉంటుంది. ఎక్కువ మొత్తాల్లో ఘ్రెలిన్, తక్కువగా లెప్టిన్ ఉండటం వలన బరువు పెరుగుతారు. సాధారణంగా రోజుకి ఎనిమిది గంటల మంచి నిద్ర అవసరం. కొంతమంది అంత అవసరం లేదని వాదించొచ్చు కానీ నిద్ర సరిగా లేకపోవడం వలన ఆరోగ్యం పాడయి, బరువు కూడా పెరిగిపోతాం..



మరింత సమాచారం తెలుసుకోండి: